బీజేపీ మాధవ్ గత గెలుపు బలుపు కాదు..తెలుగుదేశం వాపు
బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్‌కు కేవలం 10,884 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్‌కి కావాల్సిన ఓట్లకి సుమారు 20 వేల ఓట్ల దూరంలో ఉండిపోయారు.
ఏపీలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. మూడు స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది. దీనిపై బీజేపీ రాష్ట్ర పార్టీలో పెద్దలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. తమ మిత్రపక్షమైన జనసేన దెబ్బకొట్టిందని సీనియర్ నేత వాపోయారు. మరో నేత అయితే తమకి గతం కంటే ఓటింగ్ శాతం పెరిగిందని ఇదే ఏపీలో జనం మార్పు కోరుకుంటున్నారనేందుకు నిదర్శనం అన్నారు. బీజేపీ వాదనలు ఎలా వున్నా, ఏపీ బీజేపీ వాస్తవ పరిస్థితిని ఈ ఎన్నికల ఫలితాలు కళ్లకు కట్టాయి. ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ పోటీ చేసిన బద్వేలు, తిరుపతి, ఆత్మకూరులలో బీజేపీకి డిపాజిట్లు రాలేదు. బీజేపీ ఉనికి ఏపీలో నామమాత్రం. ఏదైనా ప్రాంతీయ పార్టీ దన్ను ఉంటే తప్పించి సీట్లు కాదు కదా, కనీసం డిపాజిట్ దాటే ఓట్లు వస్తాయనేది బహిరంగ రహస్యం. కానీ బీజేపీ నేతల ప్రగల్భాలు ఆకాశాన్నంటుతాయి. వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం అంటారు ఒకరు. కుటుంబ పార్టీలైన వైసీపీ, టీడీపీని రాష్ట్రం నుంచి తరిమేస్తామంటారు ఇంకొకరు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం ఒక్కటి తప్పించి, ఏ ఒక్క బలమూ ఏపీ బీజేపీకి లేదు.
గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకున్న బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్, ఈ సారి ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయింది. అంటే గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాధవ్ గెలుపు కేవలం తెలుగుదేశం మద్దతోనేనని స్పష్టం అయ్యింది. మొత్తం పోలైన ఓట్లలో చెల్లిన ఓట్లు తీసుకొని, అందులో ఆరో వంతు కంటే తక్కువ వచ్చిన వారిని డిపాజిట్ కోల్పోయినట్టుగా ప్రకటిస్తారు. ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,01,335 మంది ఓటు హక్కు వినియోగించుకోగా చెల్లిన ఓట్లు 1,89,017. ఇందులో ఆరో వంతు 31,502 ఓట్లు వస్తేనే డిపాజిట్లు దక్కినట్టు. బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్‌కు కేవలం 10,884 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్‌కి కావాల్సిన ఓట్లకి సుమారు 20 వేల ఓట్ల దూరంలో ఉండిపోయారు.
2017లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మాధవ్‌కి వచ్చిన మెజారిటీ 9215 ఓట్లు. టీడీపీతో పొత్తుతో పోటీచేసిన ఈ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ అంత లేవు తాజా ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన మొత్తం ఓట్లు. గత ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీగా మాధవ్ గెలుపు పార్టీ బలుపు కాదని, అది తెలుగుదేశం పొత్తు వల్ల వచ్చిన వాపు అని తాజా ఎన్నికలు తేల్చేశాయి.
బీజేపీకి రాష్ట్రంలో ఓటుబ్యాంకు లేకపోవడంతోపాటు ఏపీపై కేంద్రం కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నతీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, రైల్వే జోన్ పై డ్రామాలు వంటివన్నీ బీజేపీ అభ్యర్థి డిపాజిట్లు కోల్పోవడానికి మరో కారణం.