పక్కకు తప్పుకున్న బాలయ్య, పార్టీ కార్యక్రమాలకు దూరం
బావ వ్యవహారాన్ని పక్కనపెట్టేసి బాలయ్య ఇక్కడినుంచి మకాం మార్చారు. ఒకరకంగా ఆయన్ను పక్కకు నెట్టేయడంలో టీడీపీ వ్యూహకర్తలు పైచేయి సాధించారని చెప్పాలి.
రాజమండ్రి జైలు పరామర్శ ఎపిసోడ్ తర్వాత బాలకృష్ణ ఎవరికీ కనిపించడంలేదు. సినిమా షూటింగ్ లు ఉన్నాయని చెబుతున్నారు కానీ.. కనీసం ఆ గ్యాప్ లో అయినా ఆయన ఎక్కడా తెరపైకి రావడంలేదు. ఆ మాటకొస్తే బాలయ్యను ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు అనుకూల మీడియా పక్కన పెట్టిన తర్వాత, ఆయన తనకు తానే మరింత దూరం జరిగారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయన కనపడటంలేదు.
వాస్తవానికి నారా లోకేష్ ఢిల్లీ టూర్ కి వెళ్తే, బాలకృష్ణ రాజమండ్రిలోనో లేదా, మంగళగిరి పార్టీ ఆఫీస్ లోనో ఉండి ఇక్కడి వ్యవహారాలు చెక్కబెట్టాల్సిన పరిస్థితి. కానీ ఎల్లో మీడియాకు అది ఇష్టంలేదు. పార్టీపై బాలయ్య పెత్తనం వారు కోరుకోవడంలేదు. అందుకే భువనేశ్వరి, బ్రాహ్మణి తెరపైకి వచ్చారు, బాలయ్య పక్కకు వెళ్లిపోయారు. జైలు పరామర్శ తర్వాత ఇంతవరకు ఆయన ఎక్కడా బయట కనిపించలేదు. ఆయన లేకపోయినా బాబుకోసం మేము అంటూ నిరసనలు జరుగుతున్నాయి, లోకేష్ ఢిల్లీలో లాబీయింగ్ కి ప్రయత్నిస్తున్నారు, రాజమండ్రిలో ములాఖత్ ఎపిసోడ్ కొనసాగుతోంది. ఎక్కడి కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి కానీ బాలయ్య మాత్రం కనపడటం లేదు.
ప్లాన్ ప్రకారమే బాలకృష్ణను పార్టీకి దూరం చేయాలని చూశారు టీడీపీ వ్యూహకర్తలు. ఆ వ్యూహం తెలిసి బాలయ్య అలిగారో, లేక నిజంగానే పార్టీ నేతలపై ఆగ్రహం చెందారో తెలియదు కానీ.. తనకు తానుగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరమయ్యారు. నేతలతో కూడా టచ్ లో లేరని తెలుస్తోంది. కనీసం టీడీపీ సోషల్ మీడియాలో కూడా బాలయ్య కనిపించడం లేదు. చంద్రబాబు అరెస్ట్ జైలులో ఉన్న ఈ పరిస్థితుల్లో.. పవన్ కల్యాణ్ కూడా షూటింగ్ లు ఆపేసుకుని ఏపీకి వచ్చిన ఈ టైమ్ లో.. బాలకృష్ణ తిరిగి ఫిల్మ్ నగర్ కి వెళ్తాడనుకోలేం. కానీ బావ వ్యవహారాన్ని పక్కనపెట్టేసి బాలయ్య ఇక్కడినుంచి మకాం మార్చారు. ఒకరకంగా ఆయన్ను పక్కకు నెట్టేయడంలో టీడీపీ వ్యూహకర్తలు పైచేయి సాధించారని చెప్పాలి. నందమూరి అభిమానులు మాత్రం ఈ వ్యవహారంపై రగిలిపోతున్నారు. బాలయ్య టీడీపీలో యాక్టివ్ రోల్ పోషించాలంటున్నారు. నారా భజనపరులు మాత్రం బాలయ్య అడ్డు తొలగించే ప్రయత్నాల్లో ఉన్నారు.