గౌతమ్ సవాంగ్.. అప్పుడు బదిలీ, ఇప్పుడు రాజీనామా

అప్పట్లో వైసీపీకి అయిష్టంగా మారి అప్రాధాన్య పోస్ట్ కి వెళ్లారు గౌతమ్ సవాంగ్, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆ పోస్ట్ కి కూడా రాజీనామా చేశారు. రెండు ప్రభుత్వాల హయాంలో ఇబ్బంది పడిన అతి కొద్దిమంది అధికారుల్లో సవాంగ్ ఒకరు.

Advertisement
Update: 2024-07-04 02:22 GMT

తెలుగు రాష్ట్రాల్లో అధికారం మారిన తర్వాత పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. ఒక ప్రభుత్వానికి ఇష్టమైన అధికారి, మరో ప్రభుత్వానికి పెద్దగా నచ్చకపోవచ్చు. ఒక ప్రభుత్వంలో కీలక పోస్ట్ లో ఉన్నవారు ప్రభుత్వం మారాక అప్రాధాన్య పోస్ట్ కి వెళ్లిపోవచ్చు. ప్రస్తుతం ఏపీలో కూడా ఇదే జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎస్ మారారు, డీజీపీ మారారు, టీటీడీ చైర్మన్ కూడా మారారు. ఇక కలెక్టర్లు, ఎస్పీల సంగతి సరేసరి. గత ప్రభుత్వం పక్కనపెట్టిన చాలామంది అధికారులకు కూటమి ప్రభుత్వం కీలక పోస్టింగ్ లు ఇచ్చింది. అయితే రెండు ప్రభుత్వాల హయాంలోనూ ఇబ్బంది పడ్డ అతికొద్దిమంది అధికారుల్లో గౌతమ్ సవాంగ్ ఒకరు. తాజాగా ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌతమ్ సవాంగ్ ని ఏరికోరి డీజీపీగా నియమించారు అప్పటి సీఎం జగన్. సవాంగ్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేందుకే ప్రయత్నించారు. అయితే సీపీఎస్ రద్దుకోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం ఆయనకు మచ్చలా మారింది. ఆ కార్యక్రమాన్ని నిలువరించడంలో డీజీపీ ఫెయిలయ్యారనే ఆరోపణలు వినిపించాయి. అప్పట్లో వేలాదిమంది ఉపాధ్యాయులు విజయవాడ రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. కవర్ చేసుకోడానికి వైసీపీ నానా తంటాలు పడింది, చివరకు సవాంగ్ పై వేటు వేసింది. ఆ అవమానం తట్టుకోలేక ఆయన రాజీనామా చేయడం, ఆ తర్వాత మెత్తబడటం, ఏపీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం ఇలా ఈ ఎపిసోడ్ లో చాలా ట్విస్ట్ లు ఉన్నాయి. అప్పట్లో అలా బదిలీ వేటు బహుమతిగా పొందిన సవాంగ్, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కుదురుకోలేకపోయారు. కాస్త ఆలస్యమైనా ఆయన రాజీనామా ఊహించిందే.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై రాళ్లదాడి జరిగిన సమయంలో డీజీపీగా గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడాయనకు తిప్పలు తెచ్చాయని అంటున్నారు. అప్పట్లో ఆ దాడిని ఆయన నిరసన హక్కు అని పేర్కొనడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఆయన వైసీపీకి కూడా అయిష్టంగా మారారు, అప్రాధాన్య పోస్ట్ కి వెళ్లారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆ పోస్ట్ కి కూడా రాజీనామా చేశారు. ఇలా రెండు ప్రభుత్వాల హయాంలో ఇబ్బంది పడిన అతి కొద్దిమంది అధికారుల్లో గౌతమ్ సవాంగ్ ఒకరు. 

Tags:    
Advertisement

Similar News