ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కించుకున్న ఏపీ - మరో రెండు రాష్ట్ర స్థాయి గోల్డ్ అవార్డులూ సొంతం
రాష్ట్రంలో సుపరిపాలన, పారదర్శక పౌరసేవలు అందిస్తున్నందుకు, గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల ద్వారా పేదరిక నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలకు గాను ఈ ఏడాది రాష్ట్రానికి ఆరు స్కోచ్ అవార్డులు దక్కాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో అందించే ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కించుకుంది. సోమవారం ఢిల్లీలో స్కోచ్ గ్రూప్ నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో ఈ అవార్డులను రాష్ట్ర అధికారులు అందుకున్నారు. రాష్ట్రంలో సుపరిపాలన, పారదర్శక పౌరసేవలు అందిస్తున్నందుకు, గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల ద్వారా పేదరిక నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలకు గాను ఈ ఏడాది రాష్ట్రానికి ఆరు స్కోచ్ అవార్డులు దక్కాయి.
స్కోచ్ అవార్డులు దక్కిందిలా..
వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఆయా కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా చర్యలు చేపట్టింది. తద్వారా మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. బ్యాంకులకు సకాలంలో రుణాలు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖకు 5 స్కోచ్ అవార్డులు దక్కాయి. దేశంలో ఆదర్శవంతంగా సుపరిపాలన, పారదర్శక పౌరసేవలు అందిస్తున్నందుకు గాను రాష్ట్రానికి మరో స్కోచ్ అవార్డు లభించింది.
గోల్డ్ అవార్డులు ఇలా..
పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని కుటుంబ ఆదాయాలను పెంచుకోవడం కోసం ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల నేపథ్యంలో స్కోచ్ సంస్థ రాష్ట్రాన్ని గోల్డ్ అవార్డుకు ఎంపిక చేసింది. సెర్ప్‌కు అనుబంధంగా పనిచేస్తున్న స్త్రీనిధి సంస్థ బ్యాంకులతో పాటు పొదుపు సంఘాల మహిళలకు అదనంగా, అత్యంత సులభ విధానంలో 48 గంటల్లోనే బ్యాంకు రుణాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో మరో స్కోచ్ గోల్డ్ అవార్డుకు ఎంపికైంది.
మరో మూడు సిల్వర్ అవార్డులు సైతం...
`మహిళా నవోదయం` పేరుతో పొదుపు సంఘాల విజయగాథలను ప్రత్యేక మాస పత్రిక రూపంలో ప్రతినెలా ప్రచురించడంపై చిత్తూరు జిల్లా డీఆర్డీఏ విభాగానికి సిల్వర్ అవార్డు దక్కింది. నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నందుకు వారికే మరో సిల్వర్ అవార్డు లభించింది. పొదుపు సంఘాల నుంచి తీసుకున్న రుణాలతో మహిళలు నాటుకోళ్ల పెంపకం ద్వారా అధిక ఆదాయం పొందుతుండటంపై నెల్లూరు జిల్లా డీఆర్డీఏ విభాగానికి మరో సిల్వర్ అవార్డు దక్కింది.