వలస ఓటరు ఎటువైపు..? ఆసక్తికరంగా ఏపీ రాజకీయం

వలస ఓటరు ఎటువైపు అని అంచనా వేయడం కష్టం. తాను ఏ ప్రాంతంలో ఉన్నా.. స్థానికంగా ఉన్న పరిస్థితులను వలస ఓటరు ఓ కంట కనిపెడుతుంటాడు.

Advertisement
Update:2024-05-12 09:36 IST

హైదరాబాద్ లో నివశిస్తూ ఏపీలో ఓట్లు ఉన్న చాలామంది సొంత ఊళ్లకు ప్రయాణం కట్టారు. శని, ఆది వారాలు వరుస సెలవలు కావడం, ఆ తర్వాత సోమవారం ఓట్ల పండగ ఉండటంతో.. శుక్రవారం సాయంత్రం నుంచే ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. శనివారం, ఆదివారం తెల్లవారు ఝామున కూడా హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లే రోడ్లు రద్దీగా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

సాధికారిక గణాంకాలు లేకపోయినా తెలంగాణలో ఉన్న చాలామందికి ఏపీలో ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్ లో స్థిర నివాసాలున్నవారు కూడా ఏపీలో ఓటు హక్కు పోగొట్టుకునేందుకు మాత్రం ఇష్టపడరు. అక్కడ కూడా స్థానికంగా నివాసాలుంటాయి కాబట్టి వారి ఓటు హక్కుని ఎవరూ కాదనలేని పరిస్థితి. దీంతో ఎన్నికలప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చి వారంతా ఓటు వేసి వెళ్తుంటారు. బెంగళూరు నుంచి కూడా చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఏపీలోని సొంత ఊళ్లకు వచ్చి ఓటు వేసి వెళ్తుంటారు. ఈసారి విదేశాలనుంచి కూడా చాలమంది ఎన్నికల సీజన్ లో ఏపీకి వచ్చినట్టు తెలుస్తోంది. వలస ఓటర్లు కొందరు స్వచ్ఛందంగా వస్తున్నా, మరికొందర్ని తరలించేందురు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేశాయి, ముందుగానే తాయిలాలు ముట్టజెప్పాయి.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ సుమారు 2 వేల ప్రత్యేక బస్సులు కేటాయించింది. ఎంజీబీఎస్‌ నుంచి 500, జేబీఎస్‌ నుంచి 200, ఉప్పల్‌ నుంచి 300, ఎల్బీనగర్‌ నుంచి 300 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక రైల్వే స్టేషన్లు కూడా కిక్కిరిసి కనపడుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఏపీ పల్లెలకు వలస ఓటరు తీర్పివ్వడానికి బయలుదేరాడు.

లాభం ఎవరికి..?

వలస ఓటరు ఎటువైపు అని అంచనా వేయడం కష్టం. తాను ఏ ప్రాంతంలో ఉన్నా.. స్థానికంగా ఉన్న పరిస్థితులను వలస ఓటరు ఓ కంట కనిపెడుతుంటాడు. మీడియా, సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగిన ఈ సమయంలో వలస ఓటరు కూడా మరింత తెలివిగా ఆలోచించగలడు. అయితే ఈసారి వలస ఓట్లు ఏ పార్టీకి అనేది మాత్రం పోలింగ్ రోజే క్లారిటీ వస్తుంది. ఓటు హక్కుకోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి వ్యయప్రయాసలు పడి వస్తున్న వారిని నిజంగా అభినందించాల్సిందే. 

Tags:    
Advertisement

Similar News