పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ టాప్.. ఏడు నెలల్లో రూ. 40,361 కోట్లు

సీఎం వైఎస్ జగన్ చేపట్టిన చర్యల కారణంగా ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో భారీ పెట్టుబడులు సాధించగలిగింది. దేశంలో రూ. 1,71,285 పెట్టుబడులు రాగా, ఇందులో ఏపీనే రూ. 40,361 కోట్లను ఆకర్షించింది.

Advertisement
Update:2022-09-14 08:24 IST

ఏపీకి పెట్టుబడులు సాధించడంలో ప్రభుత్వం విజయవంతం అవుతోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త పరిశ్రమలు, సంస్థలు నెలకొల్పడం ద్వారా యువత ఇక్కడి నుంచి తరలిపోకుండా అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ చేపట్టిన చర్యల కారణంగా ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో భారీ పెట్టుబడులు సాధించగలిగింది. దేశంలో రూ. 1,71,285 పెట్టుబడులు రాగా, ఇందులో ఏపీనే రూ. 40,361 కోట్లను ఆకర్షించింది. జనవరి నుంచి జూలై వరకు దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఈ ఏడాది జూలై వరకు వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన రిపోర్టును విడుదల చేసింది. దేశంలోని పెట్టుబడుల్లో ఎక్కువ వాటా ఏపీ సాధించిందని ఆ నివేదికలో పేర్కొన్నది. ఏపీ తర్వాత ఒడిశా రూ. 36,826 కోట్లు రాబట్టిందని తెలిపింది. దేశంలో ఈ ఏడాది వచ్చిన పెట్టుబడుల్లో దాదాపు 45 శాతం ఈ రెండు రాష్ట్రాలే రాబట్టాయని వెల్లడించింది.

గత వారం ఏపీ కేబినెట్ భేటీలో రూ. 1,26,748 కోట్ల ప్రతిపాదనలకు పచ్చ జెండా ఊపారు. ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తయి.. తమ ఉత్పత్తిని ప్రారంభిస్తే రాష్ట్రంలో 40,330 మందికి ఉద్యోగాలు వస్తాయని నివేదికలో పేర్కొన్నది. రాబోయే ఏడేళ్లలో మరిన్ని పెట్టుబడులను ఏపీనే సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నది. ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడంలో ముందున్నదని, అనేక రాయితీలు ఇస్తూ.. భూములు కేటాయించడంతో సంస్థలు రాష్ట్రంలో తమ సంస్థలు స్థాపించడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తున్నది.

రాష్ట్రంలో ఐదు ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ సంస్థలు, 19 రసాయన, ఒక మెటలర్జికల్ సంస్థ, 13 కమర్షియల్ అండ్ గృహ సామగ్రి సంస్థలు, రెండు ఇంధన సంబంధిత యూనిట్లు, 18 ఫెర్టిలైజర్ సంస్థలు, 27 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. ఏడు రవాణా యూనిట్లు, 23 టెక్స్‌టైల్, 24 పేపర్, 35 సిమెంట్ అండ్ జిప్సమ్ యూనిట్లు, 12 మెకానికల్ అండ్ ఇంజనీరింగ్ యూనిట్లు, మరో 38 ఇండస్ట్రీలు, 26 ఫెర్మెంటేషన్ యూనిట్లు పెట్టుబడుల పెట్టడానికి రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ నివేదికలో పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News