ఏపీలో పెన్షన్ పంపిణీ.. ఎవ్వరికీ పట్టదేం..?

ఈ కష్టాలకు కారణం మీరంటే మీరంటూ ఎవరూ మీడియా ముందుకు రాలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా సానుభూతి తెలపలేదు. కారణం..? ఎన్నికలైపోయాయి. ఇప్పుడు ఓటరుని ప్రసన్నం చేసుకున్నా ఫలితం లేదు.

Advertisement
Update:2024-06-01 09:54 IST

మే-1న ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ వ్యవహారం ఎంత రాజకీయ రచ్చకు కారణమైందో అందరికీ తెలుసు. వృద్ధులు, వికలాంగులు అవస్థలు పడుతున్నారని, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని, ఎండలో మలమల మాడిపోతున్నారని రాజకీయ విమర్శలు చెలరేగాయి. కారణం మీరంటే మీరంటూ అధికార, ప్రతిపక్షాలు తిట్టిపోసుకున్నాయి. క్యాలెండర్ లో పేజీ మారింది. ఈరోజు జూన్-1. సేమ్ అవే కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. కానీ రాజకీయ నాయకులు మాత్రం పెద్దగా స్పందించడంలేదు. ఈ కష్టాలకు కారణం మీరంటే మీరంటూ ఎవరూ మీడియా ముందుకు రాలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా సానుభూతి తెలపలేదు. కారణం..? ఎన్నికలైపోయాయి. ఇప్పుడు ఓటరుని ప్రసన్నం చేసుకున్నా ఫలితం లేదు. అందుకే నాయకులెవరికీ పెన్షన్ కష్టాలు పట్టలేదు.

వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ ఆగిపోయాక జనసేన ఓ రేంజ్ లో హడావిడి చేసింది. పెన్షన్ల పంపిణీకి జనసైనికులు సహకరించాలని, వృద్ధులు, వికలాంగులకు చేదోడువాదోడుగా నిలవాలని, స్వచ్ఛందంగా సేవ చేయాలని జనసేనాని వారికి ఆదేశాలిచ్చారు. నెలరోజుల తర్వాత పెన్షన్ దారుల కష్టాలు అలాగే ఉన్నా.. జనసైనికుల్లో మాత్రం స్పందన లేదు. ఇక గతంలో టీడీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పెన్షన్ పంపిణీకి సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉన్నా కూడా కావాలని అకౌంట్లలో జమ చేశారని, వృద్ధుల్ని ప్రభుత్వం కష్టాలపాలు చేసిందని తీవ్రంగా విమర్శించారు టీడీపీ నేతలు. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారు. పెన్షన్ దారులు మళ్లీ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం వచ్చినా కూడా టీడీపీ నేతలు మాత్రం పట్టనట్టే ఉన్నారు.

ఏపీలో మొత్తం 65.30 లక్షల మంది లబ్ధిదారులకు నేటి నుంచి పెన్షన్లు అందిస్తున్నారు. 1,939 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 80 సంవత్సరాలు పైబడిన వారు, వికలాంగులకు మాత్రం ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇస్తారు. మిగతా వారికి గత నెలలో లాగా ఆధార్ తో అనుసంధానం అయి ఉన్న బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ సొమ్ము జమ అవుతుంది. 47.74 లక్షల మందికి డీబీటీ ద్వారా డబ్బులు జమ అయ్యాయి. మిగతా వారికి ఇంటి వద్దకే వెళ్లి సచివాలయ ఉద్యోగులు పెన్షన్ ఇస్తారు. 

Tags:    
Advertisement

Similar News