5 గంటల్లో 90శాతం పని పూర్తి.. వాలంటీర్లు లేకుండానే..!

ఉదయం 6 గంటలనుంచే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టారు. మధ్యాహ్నం 11 గంటల సమయానికి 90శాతం పంపిణీ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.

Advertisement
Update:2024-08-01 15:21 IST

గతంలో పెన్షన్ల పంపిణీని పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు, అది కూడా ఓ కార్యక్రమం, పబ్లిసిటీ లేకుండా ప్రతి నెలా జరుగుతూ ఉండేది. కానీ వాలంటీర్లను పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో ప్రచారం ఎక్కువైంది. ప్రతి నెలా ఉదయం 5 గంటలనుంచే సందడి మొదలయ్యేది. గంట గంటకూ పర్సంటేజ్ అప్ డేట్ చేసేవారు. మధ్యాహ్నానికల్లా 90శాతం పనిపూర్తి చేశామంటూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేది. ఏపీలో ప్రభుత్వం మారినా ఆ ప్రచారం మాత్రం ఆగలేదు. గతంలో వాలంటీర్లతో వైసీపీ ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయించగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల్ని రంగంలోకి దింపింది. 5 గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 90శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందని చెబుతోంది.


ఉదయం 6 గంటలనుంచే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టారు. మధ్యాహ్నం 11 గంటల సమయానికి 90శాతం పంపిణీ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఇటీవల ఎన్నికల సమయంలో వాలంటీర్ల సేవలను ఎన్నికల కమిషన్ అడ్డుకోవడంతో లబ్ధిదారులకు బ్యాంకుల్లో పెన్షన్లు వేశారు. ఎండదెబ్బకు, క్యూలైన్లలో పడిగాపులు పడలేక కొందరు వృద్ధులు మరణించారు. ఆ మరణాల మీరంటే మీరు కారణం అంటూ టీడీపీ, వైసీపీ తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. ఇప్పుడా సమస్య లేదని, వాలంటీర్లు లేకపోయినా సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయించామని చెప్పుకుంటున్నారు టీడీపీ నేతలు.

సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయడం బాగానే ఉంది కానీ, ఆ వంకతో తమకు పూర్తిగా మంగళం పాడేస్తారేమోననే భయం వాలంటీర్లలో మొదలైంది. మరి వాలంటీర్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఏంటో తేలాల్సి ఉంది. పాతవారితో పాటు కొత్తగా వాలంటీర్లను తీసుకుంటారా, వారికి వేరే పని అప్పజెబుతారా.. అనేది సస్పెన్స్ గా మారింది. 

Tags:    
Advertisement

Similar News