వాళ్లకు తెలియదు సరే.. మీకు తెలియదా?- ఇప్పటం గ్రామస్తులకు చుక్కెదురు

సింగిల్ జడ్జి ధర్మాసనం తమకు జరిమానా విధించడాన్ని పిటిషనర్లు హైకోర్టులోనే డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేశారు. పిటిషనర్లు చదువురాని వారని.. తెలియక తప్పు చేశారని కాబట్టి క్షమించి జరిమానా రద్దు చేయాలని న్యాయవాది కోరారు.

Advertisement
Update:2022-12-14 17:28 IST

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామస్తులకు మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నోటీసులు ఇచ్చి నిర్మాణాలను అధికారులను కూల్చివేసినా సరే.. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చేశారంటూ గతంలో 14 మంది హైకోర్టుకు వెళ్లారు. కూల్చివేతల సమయంలో పవన్ కల్యాణ్ స్పందించిన తీరుతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది.

జనసేన వాళ్లం కాబట్టే తమ నిర్మాణాలు కూల్చేశారంటూ కోర్టుకు వెళ్లారు. తొలుత తమకు నోటీసులు ఇవ్వలేదంటూ హైకోర్టును పిటిషనర్లు నమ్మించారు. తదుపరి విచారణలో అధికారులు నోటీసులు జారీ చేసింది నిజమేనని అంగీకరించారు. దాంతో నిజాన్ని దాచి హైకోర్టును తప్పుదోవ పట్టించిందనందుకు 14 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున కోర్టు జరిమానా విధించింది.

సింగిల్ జడ్జి ధర్మాసనం తమకు జరిమానా విధించడాన్ని పిటిషనర్లు హైకోర్టులోనే డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేశారు. పిటిషనర్లు చదువురాని వారని.. తెలియక తప్పు చేశారని కాబట్టి క్షమించి జరిమానా రద్దు చేయాలని న్యాయవాది కోరారు. ఇందుకు కోర్టు అంగీకరించలేదు. పిటిషనర్లు చదువురాని వారైతే.. మరి మీరు చదువుకున్నారు కదా.. మీకు తెలియకుండానే పిటిషన్ వేశారా..? అని ఇప్పడం గ్రామస్తుల తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టును తప్పుదోవ పట్టించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని.. జరిమానా విధింపు సరైనదేనంటూ పిటిషనర్ల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.

Tags:    
Advertisement

Similar News