అడ్వర్టైజ్ మెంట్లకు జస్ట్ 128కోట్లే ఖర్చు చేశాం..

టీడీపీ హయాంలో యాడ్స్ కోసం రూ. 449 కోట్లు దుబారా చేశారని మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన. తమ ప్రభుత్వంలో డైరెక్ట్ యాడ్స్ ఇవ్వటం వల్ల రూ.80 కోట్లు ఆదా చేశామని అన్నారు.

Advertisement
Update:2023-03-18 13:42 IST

టీడీపీ హయాంలో ప్రభుత్వం ప్రకటనల పేరిట చేసిన ఖర్చు రూ.449కోట్లు..

వైసీపీ హయాంలో ఇప్పటి వరకు చేసిన ప్రకటనల ఖర్చు రూ.128 కోట్లు..

చూశారా మేం ఎంత పొదుపుగా ఖర్చు చేస్తున్నామో అంటూ గణాంకాలతో సహా వివరించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. శాసన మండలిలో ఆయన నవరత్నాల పథకాలకోసం చేసిన ప్రకటనల ఖర్చు గురించి వివరించారు.

ప్రకటనలు అవసరం..

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నవరత్నాల పథకాలు అమలవుతున్నాయని చెప్పారు మంత్రి చెల్లుబోయిన. పథకాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియజేయడానికే యాడ్స్ ఇస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో ఎక్కడా వివక్ష లేదని చెప్పారు. ఇప్పటివరకు రూ.128 కోట్ల ప్రకటనలు ఇచ్చామని చెప్పారు.

అప్పట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి దోపిడీ..

టీడీపీ హయాంలో యాడ్స్ కోసం రూ. 449 కోట్లు దుబారా చేశారని మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన. యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో పారదర్శకత లేదన్నారు. ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్లకి యాడ్స్ ఇచ్చారన్నారు. రాష్ట్రానికి సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన పేపర్లకు కూడా యాడ్స్ ఇచ్చారని గుర్తు చేశారు. అప్పట్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలకు పెద్దపీట వేశారని, ఈనాడుకి 50 శాతం రేటు పెంచి రూ.120 కోట్లు యాడ్స్ ఇచ్చారని చెప్పారు. సర్క్యులేషన్ లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి రూ.72 కోట్ల యాడ్స్ ఇచ్చారని, రెండో స్థానంలో ఉన్న సాక్షి కి కేవలం రూ.30 కోట్ల యాడ్స్ మాత్రమే ఇచ్చారని అన్నారు.

గత ప్రభుత్వం యాడ్ ఏజెన్సీలకు కూడా దోచి పెట్టిందని, ఏజెన్సీకి 15 శాతం కమిషన్ ఇచ్చేవారన్నారు మంత్రి చెల్లుబోయిన. తమ ప్రభుత్వంలో డైరెక్ట్ యాడ్స్ ఇవ్వటం వల్ల రూ.80 కోట్లు ఆదా చేశామని అన్నారు. ప్రకటనల విషయంలో గతంలో దుబారా జరిగిందని, దాన్ని తాము కంట్రోల్ చేశామని చెప్పుకొచ్చారు.

Tags:    
Advertisement

Similar News