అమిత్ షా తో జగన్ భేటీ.. ట్విట్టర్లో లోకేష్ క్విజ్ పోటీ
రెండు వారాల గ్యాప్ లోనే జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఈ రెండు వారాల గ్యాప్ లో కొత్తగా రాష్ట్రానికి వచ్చిన సమస్యలేంటి, ఢిల్లీలో వాటికి దొరికే పరిష్కారాలేంటి అనేదే ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హాట్ టాపిక్.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన. ఎప్పటిలాగే ప్రధాని మోదీ, అమిత్ షా తో భేటీ. ఎప్పటిలాగే విభజన హామీల అమలుకోసం పట్టు. ఎప్పటిలాగే పోలవరం నిధుల విడుదలకోసం అభ్యర్థన. ఎప్పటిలాగే పెండింగ్ బకాయిల విడుదలకు అర్జీ. జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. వారి సొంత మీడియా సాక్షికి కూడా ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు. పోనీ పర్యటన తర్వాత జగన్ కానీ, ఆయన తరపున వైసీపీ నాయకులు కానీ అధికారికంగా మాట్లాడతారా అంటే అదీ లేదు, న్యూస్ పేపర్లో వచ్చింది చదువుకుని మన తరపున నాలుగు అర్జీలు మళ్లీ ఢిల్లీకి వెళ్లాయి అనుకోవాల్సిందే. వాటి అమలు ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ హయాంలో కూడా ఇంతకంటే గొప్పగా ఏమీ జరగలేదు కానీ, మెడలు వంచుతాం అన్నవారు కూడా ఇలా మెడలు వాలేసే పరిస్థితికి రావడమే విశేషం.
తాజా పర్యటన వివరాలు..
పోలవరం ప్రాజెక్ట్ కి అడ్ హక్ గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని అమిత్ షాకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లయినా ప్రధాన సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిపై దృష్టిసారించాలని కోరారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని వివరించారు. బుధవారం రాత్రి 40 నిమిషాల పాటు అమిత్ షాతో భేటీ అయ్యారు జగన్.
2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద పెండింగ్‌లో ఉన్న రూ.36,625 కోట్లు వెంటనే విడుదలయ్యేలా చూడాలని కోరారు జగన్. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడుకుందన్న కారణంతో ఇప్పుడు ఆంక్షలు విధించారని, నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని, ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్ కోకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించాలన్నారు జగన్.
ఈ పర్యటనకు సంబంధించి నారా లోకేష్ ట్విట్టర్లో ఓ క్విజ్ పోటీ పెట్టారు. జగన్ పదే పదే ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు, ఏం సాధిస్తున్నారంటూ ఆయన సెటైర్లు పేల్చారు.
జగన్ ఢిల్లీటూర్ల పై ప్రజలకు క్విజ్ పోటీ
1) జగన్ ఢిల్లీ టూర్ ఇది ఎన్నోసారి?
2) ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఏం సాధించారు?
3) ప్రత్యేక విమానానికి ఎన్ని కోట్లు ఖర్చు?
అంటూ కామెడీ చేశారు లోకేష్.
ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా జగన్ హడావిడిగా ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆ పర్యటనలో ఏం జరిగిందని, అసెంబ్లీలో టీడీపీ నిలదీసింది. వివరాలు చెప్పాలని పట్టుబట్టింది. రెండు వారాల గ్యాప్ లోనే జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఈ రెండు వారాల గ్యాప్ లో కొత్తగా రాష్ట్రానికి వచ్చిన సమస్యలేంటి, ఢిల్లీలో వాటికి దొరికే పరిష్కారాలేంటి అనేదే ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హాట్ టాపిక్.