తాడేపల్లికి దూరంగా 5 రోజులు..

ఈరోజు రాత్రి ఢిల్లీ చేరుకుంటారు సీఎం జగన్. ఈనెల 5, 6 తేదీల్లో ఢిల్లీలోనే ఆయన మకాం. 5వ తేదీ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ ఉంది.

Advertisement
Update:2023-07-04 06:45 IST

ఏపీ సీఎం జగన్ వరుస పర్యటనలతో బిజీ అవుతున్నారు. ఈరోజు నుంచి ఈ బిజీ షెడ్యూల్ మొదలవుతుంది. మొత్తం 5రోజులపాటు ఆయన తాడేపల్లికి దూరంగా ఉంటారు. చిత్తూరులో ఈరోజు జగన్ పర్యటన మొదలవుతుండగా.. మధ్యలో ఢిల్లీ, ఆ తర్వాత కడప, అనంతపురం జిల్లాల పర్యటనతో బిజీ షెడ్యూల్ ముగుస్తుంది.

ఈరోజు చిత్తూరు జిల్లాలో అమూల్‌ సంస్థ ఏర్పాటుచేసే కొత్త యూనిట్‌ కు సీఎం జగన్ భూమి పూజ చేస్తారు. క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ ఆవరణలో 300 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్ గ్రౌండ్స్ లో బహిరంగలో పాల్గొంటారు. సభ అనంతరం ఆయన తిరిగి గన్నవరం చేరుకుంటారు. అక్కడినుంచి ప్రత్యేక విమానంలో ఈరోజే ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు జగన్.

ఢిల్లీలో 2 రోజులు..

ఈరోజు రాత్రి ఢిల్లీ చేరుకుంటారు సీఎం జగన్. ఈనెల 5, 6 తేదీల్లో ఢిల్లీలోనే ఆయన మకాం. 5వ తేదీ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ ఉంది. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు జగన్. అందుబాటులో ఉన్న పలువురు కేంద్ర మంత్రులతోనూ ఆయన సమావేశం అయ్యే అవకాశముంది. ఎప్పటిలాగే విభజన చట్టం హామీల అమలు, పెండింగ్‌ లో ఉన్న అంశాలు, సమస్యల పరిష్కారం కోసం ఆయన చర్చలు జరుపుతారని తెలుస్తోంది. 6వ తేదీ రాత్రి ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకుంటారు జగన్.

కడపలో 2 రోజులు..

6వతేదీ ఢిల్లీనుంచి తిరిగి వచ్చే జగన్, 7, 8 తేదీల్లో కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటిస్తారు. 7వ తేదీ సొంత నియోజకవర్గం పులివెందులతో పాటు కడప నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం జగన్‌ పాల్గొంటారు. జులై 8న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో ఇడుపులపాయ వెళ్తారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే రైతు దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగే రైతు దినోత్సవంలో జగన్ పాల్గొని, బీమా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అనంతరం అక్కడినుంచి తాడేపల్లి వెళ్తారు. ఈరోజు చిత్తూరుతో మొదలు పెడితే వరుసగా 5రోజుల పాటు 4 ప్రాంతాల్లో పర్యటనలతో బిజీ కాబోతున్నారు సీఎం జగన్. 

Tags:    
Advertisement

Similar News