పురందేశ్వరికి అఖిలపక్షం షాక్..సేవ్ వైజాగ్
అదానీతో కేంద్ర ప్రభుత్వం కుమ్మకై వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిపై అఖిలపక్షం మండిపోయింది. దీనికి పురందేశ్వరి సమాధానం చెప్పలేకపోయారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది కేంద్ర ప్రభుత్వ పాలసీలో భాగమని చెప్పిన పురందేశ్వరికి అఖిలపక్షం షాకిచ్చింది. ఒకవైపు స్టీల్ ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తున్నా దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం అలాంటిదేమీ లేదని, కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చాలాకాలం నెట్టుకొచ్చారు. చివరకు వేరేదారిలేక, బుకాయింపులు సాధ్యంకాదని అర్థమైన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాలసీలో భాగమని అంగీకరించారు. అందరూ ఈ విషయాన్ని అర్థంచేసుకోవాలని, ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం తాము కేంద్రానికి కొన్ని సూచనలు చేసినట్లు కొత్త పాటందుకున్నారు.
సూచనలు చేశామన్నారే కానీ అవేమిటో చెప్పమంటే మాత్రం చెప్పలేదు. దాంతోనే ఆమె అబద్ధం చెబుతున్నారని అందరికీ అర్థమైపోయింది. అందుకనే వైజాగ్‌లో స్టీల్ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తున్న అఖిలపక్షం పురందేశ్వరితో భేటీ అయ్యింది. ఈ భేటీలో స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదని కుండబద్దలు కొట్టినట్లు నేతలు చెప్పారు. కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం అంటే ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి తప్ప ప్రైవేటు రంగానికి అప్పగిస్తామంటే అంగీకరించేదిలేదని తెగేసిచెప్పారు.
ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసిన తర్వాత ఇక మీరు చూసే సంక్షేమం ఏముంటుందని నిలదీశారు. ఫ్యాక్టరీని అమ్మేసే ఉద్దేశంతో కేంద్రం వైజాగ్ స్టీల్‌ను ఏ విధంగా నిర్వీర్యం చేస్తోందనే విషయాన్ని లెక్కలతో సహా అఖిలపక్షం చెప్పినప్పుడు పురందేశ్వరి మాట్లాడలేకపోయారు. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్‌కు అప్పగించేస్తూ, గంగవరం పోర్టును అదానీ గ్రూపుకు అమ్మేసి, రైల్వే జోన్ హామీని తుంగలో తొక్కేసి కూడా వైజాగ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలా చెబుతున్నారంటూ పురందేశ్వరిని నిలదీశారు.
ఆమె సమక్షంలోనే ‘బీజేపీ నుండి సేవ్ వైజాగ్’ అంటు అఖిలపక్షం నేతలు నినాదాలు ఇవ్వటంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. అదానీతో కేంద్ర ప్రభుత్వం కుమ్మకై వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తున్నారని అఖిలపక్షం అధ్యక్షురాలిపై మండిపోయింది. దీనికి పురందేశ్వరి సమాధానం చెప్పలేకపోయారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఇకదాన్ని అడ్డుకునేంత సీన్ పురందేశ్వరికి లేదని అందరికీ తెలుసు. అందరికీ తెలుసన్న విషయాన్ని పురందేశ్వరి ఇంకా తెలుసుకోకపోవటంతోనే ఇంకా అబద్ధాలు చెబుతున్నారు.