త్రిబుల్ తలాక్ పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
త్రిబుల్ తలాక్ పై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. గౌస్‌బీ అనే మహిళకు తన భర్త ఇచ్చిన తలాక్ చెల్లదని చెప్తూ ఆమెకు జీవన భృతి చెల్లించాలని ఆదేశించింది.
ఒకే సారి మూడు తలాక్ లు చెప్పడానికి వీల్లేనప్పుడు దానిని తలాక్‌నామా రూపంలో లిఖితపూర్వకంగా రాసుకున్నా కూడా చెల్లదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తలాక్‌నామాతో వివాహం రద్దు కాదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళ్తే...
పి.గౌస్‌బీ అనే మహిళ, తాను తన భర్త విడి విడిగా ఉంటున్నాం కాబట్టి తనకు తన భర్త నుండి జీవన భృతిని ఇప్పించాలని కోరుతూ 2004 లో పొన్నూరు కోర్టును ఆశ్రయించారు. అయితే తాను తన భార్యకు రిజిస్టర్ పోస్టులో తలాక్‌నామా పంపానని కానీ ఆమె ఆ తలాక్ నామాను తిరస్కరించడం వల్ల తాను భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని గౌస్‌బీ భర్త జాన్ సైదా వాదించారు. ఆయన వాదనలను తిరస్కరించిన కోర్టు గౌస్ బీకి, ఆమె మైనర్ కుమారుడికి ప్రతి నెల 8 వేల రూపాయల జీవన భృతి కింద చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ తీర్పుపై జాన్ సైదా అప్పీలుగా వెళ్ళగా భార్యకు భరణం చెల్లించాల్సిన పనిలేదని, కుమారుడికి మాత్రం చెల్లించాలని గుంటూరులోని మొదటి అదనపు సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై గౌస్ బీ హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి తీర్పు చెప్పారు.
గుంటూరు కోర్టు తీర్పును రద్దు చేసిన హైకోర్టు, పొన్నూరు కోర్టు తీర్పును సమర్థించింది. భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పి, దాన్ని రిజిస్టర్ పోస్టులో పంపి వివాహం రద్దయినట్లు పేర్కొనడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. అలాగే, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు 16 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో జీవనభృతిని పెంచాలని కోరే స్వేచ్ఛ కూడా ఆమెకు ఉందని న్యాయ స్థానం పేర్కొంది.