రాంబాబు వర్సెస్ నాగబాబు.. ట్విట్టర్ లో పొలిటికల్ వార్
వైసీపీ, జనసేన మధ్య మళ్లీ ట్విట్టర్ వార్ మొదలైంది. ఏపీలో 175 సీట్లలో జనసేన పోటీ చేస్తుందా
వైసీపీ, జనసేన మధ్య మళ్లీ ట్విట్టర్ వార్ మొదలైంది. ఏపీలో 175 సీట్లలో జనసేన పోటీ చేస్తుందా.. ఇండిపెండెన్స్ డే రోజున అయినా ప్రకటించండి అంటూ మంత్రి అంబటి రాంబాబు వేసిన ట్వీట్ ఇప్పుడు ఇరు వర్గాల మధ్య మంట పెట్టింది. అంబటి అక్కడితో ఆగితే జనసైనికులకు మరీ అంత మండేది కాదు, "కాటన్ దుస్తుల ఛాలెంజ్ లు ఆపి ముందు ఈ సంగతి తేల్చు" అంటూ రెట్టించారు. దీంతో జనసైనికులు అంబటిపై తిరగబడ్డారు. ఉదయం నుంచి అంబటిపై ట్వీట్ల దాడి జరుగుతూనే ఉంది. దీనికి ఫినిషింగ్ టచ్ అన్నట్టుగా నాగబాబు ఎంటరయ్యారు.
"ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా!
బాబూ... ఓ రాంబాబు...
జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్ కి,
వైసీపీ సర్కస్ లో నీలాంటి బఫూన్ గాళ్ళు అడిగే క్లారిఫికేషన్స్ కి
సమాధానం చెప్పే ఓపిక, తీరిక మా జనసైనికులకి లేదు.
మా ప్రెసిడెంట్ గారికి అంతకంటే లేదు." అంటూ కాస్త ఘాటుగా రిప్లై ఇచ్చారు. అంబటి ఫొటోకి బఫూన్ రంగులద్ది మరీ రెచ్చగొట్టారు.
నాగబాబు రియాక్షన్ తో మంత్రి అంబటి మళ్లీ లైన్లోకి వచ్చారు. ఉదయం నుంచి తనపై జనసైనికులు ఎంత ట్రోలింగ్ చేస్తున్నా స్పందించలేదు అంబటి, నాగబాబు కౌంటర్ ఇవ్వగానే మళ్లీ ఆయనకు ఘాటుగా రిప్లై ఇచ్చారు. నాపై కార్టూన్లు వేసేందుకు నీకెంత తీరిక నాగబాబూ అంటూ సెటైర్లు వేశారు.
"భలే ఓరండి నాగబాబు గారు..
ఎంత ఓపిగ్గా ఎంత తీరిగ్గా నా బొమ్మేసారండి
ఖాళీగా ఉన్నట్లున్నారు, ధన్యవాదాలు.." అంటూ నాగబాబుని దెప్పిపొడిచారు.
ఈ గొడవ ఇక్కడితో ఆగేలా లేదు. కచ్చితంగా ఇరు వర్గాలు ప్రెస్ మీట్లకు సిద్ధపడే అవకాశముంది. జనసేన నుంచి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టాల్సి రావొచ్చు కానీ, మంత్రిగా ఏ పర్యటనలో అయినా పంచ్ లు విసిరే అవకాశం అంబటికి ఉంది. మొత్తమ్మీద ఇండిపెండెన్స్ డే సాక్షిగా వైసీపీ, జనసేన మధ్య మళ్లీ ట్విట్టర్ వార్ మొదలైంది.