నెల్లూరులో ‘అమరావతి’ రాజకీయం..

అమరావతి రైతులు ఎమ్మెల్యే కోటంరెడ్డిని కలిసేందుకు నెల్లూరుకు రావడం సంచలనంగా మారింది. రైతులతో కలసి కోటంరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కలిపి రాజధాని విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారా..? వేచి చూడాలి..

Advertisement
Update:2023-02-05 20:39 IST

అమరావతి రైతులు నెల్లూరుకి వచ్చారు. ఏపీకి ఏకైక రాజధాని కావాలంటూ డిమాండ్ చేస్తున్న రైతులంతా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మకాం వేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని కలసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అమరావతి రైతులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి అభిమానులు ఘన స్వాగతం పలికారు.

కొత్త స్ట్రాటజీ ఏంటి..?

గతంలో అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తిరుమల యాత్ర చేసిన సందర్భంలో వారిని కలిసేందుకు వెళ్లారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. వర్షంలో వారు ఇబ్బంది పడుతుంటే పరామర్శించారు. అప్పటినుంచే తనపై నిఘా పెరిగిందని ఇటీవల కోటంరెడ్డి ఓ సందర్భంలో చెప్పారు.


అలా అమరావతి రైతుల పాదయాత్రను ఆయన మరోసారి గుర్తు చేశారు. అంటే మూడు రాజధానులకు తన మద్దతు లేదని, అమరావతికే తన మద్దతు అని పరోక్షంగా తెలియజేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమరావతి రైతులు ఎమ్మెల్యే కోటంరెడ్డిని కలిసేందుకు నెల్లూరుకు రావడం సంచలనంగా మారింది.

కోటంరెడ్డి వైసీపీ నుంచి బయటకొస్తున్నానని చెబుతున్నారే కానీ, టీడీపీలో చేరతానని బహిరంగ ప్రకటన చేయలేదు. ఆయన టీడీపీ చేరిక ఖాయమే అనుకున్నా.. ప్రస్తుతానికి ఆయన ప్రభుత్వంపైనే సూటిగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

ఇప్పుడు అమరావతి అంశంతో మరోసారి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు కోటంరెడ్డి. నెల్లూరు జిల్లా వరకు మూడు రాజధానుల అంశంపై ప్రజలకు పెద్దగా ఆసక్తి లేదనే చెప్పాలి. హైకోర్టు అమరావతిలో ఉన్నా, కర్నూలుకి వచ్చినా నెల్లూరు ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదు.

అదే సమయంలో సెక్రటేరియట్ విశాఖకు తరలిపోతే మాత్రం నెల్లూరు వాసులకు అది దూరా భారమే. అందుకే మూడు రాజధానులు అనే ప్రయోగానికి నెల్లూరు ప్రజలు పూర్తిగా మద్దతు తెలిపే అవకాశం లేదు. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండానే కోటంరెడ్డి జై అమరావతి అనేస్తున్నారు.


టీడీపీ నినాదం కూడా అదే కాబట్టి ఆయన రైతు ఉద్యమానికి తనవంతు సాయం చేస్తున్నారు. రైతులతో కలసి కోటంరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కలిపి రాజధాని విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారా..? వేచి చూడాలి..

Tags:    
Advertisement

Similar News