సోమూ వీర్రాజుకు వ్యతిరేకంగా ఢిల్లీ నాయకులను కలిసిన 30 మంది బీజేపీ నేతలు

రాష్ట్రవ్యాప్తంగా 30 మంది బీజేపీ ముఖ్యనాయకులు కన్నా లక్ష్మీనారాయణ వినిపించిన వాదననే వినిపిస్తున్నారు. సోము వీర్రాజు వ్యవహారశైలిపట్ల ఆగ్రహంగా ఉన్న ఆ నాయకులందరూ ఈ రోజు ఢిల్లీ వెళ్ళి ఏపీ బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధరన్ ను కలిశారు.

Advertisement
Update:2023-02-23 16:46 IST

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆ పార్టీలో అసమ్మతి రగులుతోంది. ఆయ‌న వ్యవహారశైలి పట్ల తీవ్ర ఆగ్రహంతో ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇటీవలే ఆపార్టీకి రాజీనామా చేసి ఈ రోజు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా చేసిన సమయంలో కూడా తనకు మోడీపై విపరీతమైన గౌరవం ఉందని అయితే సోము వీర్రాజు పద్దతులు నచ్చకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 30 మంది బీజేపీ ముఖ్యనాయకులు కన్నా వినిపించిన వాదననే వినిపిస్తున్నారు. సోము వీర్రాజు వ్యవహారశైలిపట్ల ఆగ్రహంగా ఉన్న ఆ నాయకులందరూ ఈ రోజు ఢిల్లీ వెళ్ళి ఏపీ బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధరన్ ను కలిశారు.

రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావాలంటే అధ్యక్షుడు సోము వీర్రాజునుమార్చాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులను మార్చే సమయంలో కనీసం సీనియర్లమైన తమతో మాట మాత్రమైనా సంప్రదించలేదని వారు ఆరోపించారు. దశాబ్దాలుగా బీజేపీలో పని చేస్తున్న తమకు కనీస విలువ ఇవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జమ్ముల శ్యామ్ కిషోర్, చిగురుపాటి కుమారస్వామి, తుమ్మల అంజిబాబు, ధారా సాంబయ్య, బాలకోటేశ్వరరావు, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, శ్రీమన్నారాయణ, సుబ్బయ్య, హనుమంతు ఉదయ భాస్కర్ సహా 30 మంది నేతలు మురళీధరన్ ను కలిసివారిలో ఉన్నారు.

వీరు చెప్పిన మాటల‌ను విన్న మురళీధరన్ వీరిపైనే అసంత్రుప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. తాను ఏపీకి వచ్చినప్పుడే ఈ విషయాలన్ని చెప్పవచ్చు కదా, దీని కోసం ఢిల్లీకి రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయినా సోము వీర్రాజు గురించి తాము చెప్పిన విషయాలపట్ల విచారణ జరుపుతానని హామీ ఇచ్చినట్టు అసమ్మతి నాయకులు చెప్పారు. త్వరలోనే ఏపీకి వస్తానని అన్ని విషయాలు కూలంకుషంగా మాట్లాడుకుందామని హామీ ఇచ్చారని వారు మీడియాతో తెలిపారు.

Tags:    
Advertisement

Similar News