సిగరెట్ కోసం స్నేహితుడి పీకకోసిన టీనేజర్లు
ఏవీఎస్ కళాశాల సమీపంలో నూకాలమ్మ అనే మహిళ తన కుమారుడు చిన్నాతో కలిసి నివసిస్తోంది. ఓ రౌడీషీటర్‌ను ఆదర్శంగా తీసుకున్న చిన్నా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు.
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో జరిగిన ఓ మైనర్ బాలుడి హత్య కేసును పోలీసుల ఛేదించారు. మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి దుండగులు సముద్రంలో పడేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చిన్నా అనే 17 సంవత్సరాల పిల్లాడిని అతని స్నేహితులే బటన్ నైఫ్‌తో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సిగరెట్ కోసం గొడవపడి అసభ్య పదజాలంతో దూషించినందుకు కోపంతో నలుగురు యువకులు ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏవీఎస్ కళాశాల సమీపంలో నూకాలమ్మ అనే మహిళ తన కుమారుడు చిన్నాతో కలిసి నివసిస్తోంది. ఓ రౌడీషీటర్‌ను ఆదర్శంగా తీసుకున్న చిన్నా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈనెల 20న స్నేహితులతో కలిసి అతడు ఉత్సాహంగా వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్నాడు. అర్ధరాత్రి దాటాక నలుగురు స్నేహితులతో కలిసి సిగరెట్లు తాగాడు. ఈ క్రమంలో వారి మధ్య సిగరెట్ కోసం గొడవ మొదలైంది. ఆవేశంలో స్నేహితులు చిన్నా గొంతు కోసి హత్య చేశారు. ఆ తరువాత అతడి మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి దాచారు. వినాయక చవితి సామగ్రి తరలించడం కోసం మాట్లాడుకున్న రాము అనే వ్యక్తి ఆటోలోనే చిన్నా మృతదేహాన్ని చేపల చెరువు వద్దకు తీసుకెళ్లి అక్కడ సముద్రంలో విసిరేశారు.
చిన్నా మృతదేహం పోలీసులకు లభించడంతో వారు ఆటోడ్రైవర్ రామును వెతికిపట్టుకుని విచారించారు. దీంతో, అతడు ఆ నలుగురు పిల్లల గురించి చెప్పాడు. వారిని శనివారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఆ నలుగురినీ జువైనల్ హోంకు తరలించారు.