ఎన్ఆర్ఐల మద్దతు వ్యూహం కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకొని రావాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా పెట్టుకున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగిన సీట్లే గెలిచింది. కానీ సీఎం కేసీఆర్ తన రాజకీయ చతురతను ప్రదర్శించి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కాకుండా.. ఆ పార్టీని కూడా బలహీన పరిచారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ […]
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకొని రావాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా పెట్టుకున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగిన సీట్లే గెలిచింది. కానీ సీఎం కేసీఆర్ తన రాజకీయ చతురతను ప్రదర్శించి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కాకుండా.. ఆ పార్టీని కూడా బలహీన పరిచారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరించిన సందర్భాలు పెద్దగా లేవనే చెప్పుకోవచ్చు. దీంతో కార్యకర్తల్లో కూడా ఉత్సాహం తగ్గిపోయి వేరే మార్గాలు చూసుకున్నారు.
కాగా, పీసీసీ చీఫ్ పదవి కోసం ఎంతో మంది సీనియర్లు ప్రయత్నించినా.. కొత్తగా పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టడంతో కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలయ్యాయి. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, వీహెచ్ వంటి వాళ్లు బహిరంగంగానే తమ అసంతృప్తిని బయటపెట్టారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించాడు. తన టార్గెట్ కేసీఆర్ మాత్రమే అని తన మాటల ద్వారా బయటపెట్టారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, అప్పుడప్పుడు ఆందోళనల్లో పాల్గొంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు.
కాగా, ఇన్ని చేసినా రేవంత్ రెడ్డి.. పార్టీకి అనుకున్నంత మైలేజీ రావడం లేదని గ్రహించారు. ముఖ్యంగా బీజేపీ దూకుడు ముందు కాంగ్రెస్ పార్టీ తేలిపోతూ వస్తున్నది. రాష్ట్రంలోని ధాన్యం సమస్య నుంచి రాష్ట్ర ప్రభుత్వ అప్పుల వరకు ప్రతీ సమస్యను బీజేపీ బలంగా పట్టుకుంటున్నది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒకడుగు వెనకపడింది. దీంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో వరంగల్‌లో మీటింగ్ పెట్టించి రేవంత్ తన బలాన్ని నిరూపించుకున్నారు. కానీ అదే సమయంలో తనకు మరింత మద్దతు అవసరమని భావించారు.
దేశంలోని అన్ని పార్టీలకు క్షేత్ర స్థాయి కార్యకర్తలతో పాటు ఎన్ఆర్ఐ విభాగం కూడా ముఖ్యంగా మారిపోయింది. టీడీపీకి ఎన్ఆర్ఐలు చేసినంత సాయం మరే ఇతర పార్టీకి ఎవరూ చేసుండరు. వాళ్లు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు టీడీపీకి అండగా ఉండటంతో పాటు అవసరమైన సమయంలో ఆర్థిక సాయం చేస్తూ ఎన్నో ఏళ్లుగా టీడీపీకి అండగా ఉన్నారు. ఈ విషయాలన్నీ గతంలో ఆ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే అటువైపు నుంచి నరుక్కొని రావడానికి వ్యూహం రచించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఒక మంచి సందర్భంగా ఉపయోగించుకున్నారు. తనకు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మధ్య సఖ్యత లేదని బయట వస్తున్న రూమర్లకు కూడా చెక్ పెట్టడానికి ఈ పర్యటనను ఉపయోగించుకున్నారు. డల్లాస్‌లో భారీ కార్ల ర్యాలీ తీయడమే కాకుండా ఎన్ఆర్ఐల సదస్సులో వారిని ఉత్సాహపరిచేలా ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాల్సిన ఆవశ్యకతను వారికి వివరించారు. అన్ని రకాలుగా వారి సహకారాన్ని కోరారు.
కేసీఆర్ కుటుంబం సాగిస్తున్న పాలనపై విమర్శలు గుప్పించారు. తెలంగాణకు విముక్తి కలిగించింది సోనియా గాంధే అని.. సోనియా గాంధీ లేకపోతే లక్షల ఏళ్లు అయినా రాష్ట్రం వచ్చేది కాదని ఆ సదస్సులో పేర్కొన్నారు. రేవంత్ మాటలకు అక్కడున్న ఎన్ఆర్ఐలు కూడా చప్పట్లు కొట్టారు.
అయితే, తెలంగాణ ఎన్ఆర్ఐలు నిజంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా అనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీతో కలసి ఎంతో మంది అమెరికా ఎన్ఆర్ఐలు పని చేస్తున్నారు. వాళ్లలో చాలా మందికి ఇక్కడ వ్యాపారాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఇటీవల మంత్రి కేటీఆర్ కూడా అమెరికాలో పర్యటించి ఉత్సహం నింపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎన్ఆర్ఐలకు ప్రత్యేకంగా కలిగే లాభమేమీ ఉండదనే భావనలో ఉన్నారు. పైగా.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కేవలం రాష్ట్రంలో రావడం వల్ల తమకు నష్టమేనని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
రేవంత్ రెడ్డి సదస్సుకు భారీ సంఖ్యలో ఎన్ఆర్ఐలు వచ్చినా.. వాళ్లు భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా మద్దతు ఇచ్చే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐల సపోర్ట్‌ను నమ్ముకోవడం కంటే ఇక్కడ క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు మరింత నమ్మకాన్ని కలిగింది.. పాత కాంగ్రెస్ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకుంటే మేలు జరుగుతుందని సూచిస్తున్నారు.