స్వయంకృతాపరాధం.. భారత్ లో పర్యావరణ వినాశనం..

ఏడాదికేడాది వేసవి మరింత వేడిగా మారిపోతోంది. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల స్పష్టంగా తెలుస్తోంది. వేడిగాలులతో జనం అల్లాడిపోతున్నారు. దీనికి కారణం ఎవరు..? చేజేతులా పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్న ప్రజలే వాతావరణ మార్పులకి కారణం. పర్యావరణ హితమైన నిర్ణయాలు తీసుకోలేని, తీసుకున్నా రాజకీయ స్వలాభాలకోసం అమలు చేయలేని పాలకులే దీనికి కారణం. ప్రపంచ దేశాల సంగతి పక్కనపెడితే.. భారత్ లో కూడా ఏడాదికేడాది వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. ఉత్తర భారతంలో వర్షపాతం తగ్గిపోతోంది, దక్షిణ భారతం తుపాన్లు, వరదల్లో […]

Advertisement
Update:2022-04-30 09:08 IST

ఏడాదికేడాది వేసవి మరింత వేడిగా మారిపోతోంది. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల స్పష్టంగా తెలుస్తోంది. వేడిగాలులతో జనం అల్లాడిపోతున్నారు. దీనికి కారణం ఎవరు..? చేజేతులా పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్న ప్రజలే వాతావరణ మార్పులకి కారణం. పర్యావరణ హితమైన నిర్ణయాలు తీసుకోలేని, తీసుకున్నా రాజకీయ స్వలాభాలకోసం అమలు చేయలేని పాలకులే దీనికి కారణం. ప్రపంచ దేశాల సంగతి పక్కనపెడితే.. భారత్ లో కూడా ఏడాదికేడాది వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. ఉత్తర భారతంలో వర్షపాతం తగ్గిపోతోంది, దక్షిణ భారతం తుపాన్లు, వరదల్లో చిక్కుకుపోతోంది. ఈ వ్యత్యాసం అంతిమంగా ప్రజల జీవన విధానాలను తీవ్రంగా ప్రభావితం చూపిస్తోంది.

భారత్ వేడి గాలుల మధ్య చిక్కుకుపోవడానికి మూల కారణం మానవ తప్పిదమే. మానవ తప్పిదం వల్ల భూమిపై పచ్చదనం తగ్గేకొద్దీ వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి. ఈమేరకు TNQ-జెనేలియా సమ్మిట్ లో భాగంగా నిర్వహించిన ఆన్ లైన్ వెబ్‌నార్ లో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రీన్ హౌస్ వాయువుల వల్ల భూమిపై ఉష్ణోగ్రతలు, సముద్ర జలాల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, హిమానీ నదాలు కరిగి, సముద్రమట్టం పెరిగిపోతోందని, జీవావరణంలో ఇది పెను మార్పులకు కారణం అవుతోందని హెచ్చరించారు.

ప్రపంచ సముద్ర మట్టాలు ఏడాదికి మూడు మిల్లీమీటర్లు పెరుగుతున్నాయి. మిల్లీమీటర్ మేర పెరగడం అనేది చిన్న విషయంగానే ఉన్నా.. ఆ మాత్రం పెరుగుదలకే వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తుంటాయి. తుపాన్లు, వరదలతో తీరప్రాంతం అల్లాడిపోవడం ఖాయమంటున్నారు డాక్టర్ స్ట్రానియో. భారత్ లో ఏటా పెరిగిపోతున్న కాలుష్యం వల్ల ప్రకృతి వైపరీత్యాలతో 15లక్షలమంది మరణిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

పరిష్కారం ఏంటి..?
భారత్ లో వంట చెరకు వినియోగం తగ్గించడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చు. అయితే దానికోసం కర్బన ఉద్గారాలు లేని వంట ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాల్సి ఉంటుంది. పదేళ్ల ప్రణాళికతో ముందడుగు వేస్తేనే పర్యావరణాన్ని రక్షించుకోగలం. ప్రకృతి వైపరీత్యాలనుంచి తప్పించుకోగలం. అడవులు, వృక్ష సంపదను పెంచడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి ప్రవేశించకుండా ఆపగలం, అంటే.. ఉష్ణోగ్రతల పెరుగుదలను నిరోధించగలం అన్నమాట. వాతావరణ సమతుల్యత దెబ్బతినకూడదు, గ్లోబర్ వార్మింగ్ పెరగకూడదంటే కచ్చితంగా అటవీ ప్రాంతాన్ని పెంచాల్సిందే. అయితే భారత దేశంలో అటవీ ప్రాంతాలను గుర్తించడం చాలా కష్టమని పరిశోధకులంటున్నారు. 1700 సంవత్సరం నుంచి భారత దేశంలో భూ వినియోగ మార్పు తీవ్రమైంది. అటవీ ప్రాంతమంతా తగ్గిపోయి, జనావాసాలు పెరిగిపోతున్నాయి. జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న భారత్ లాంటి దేశాల్లో దీన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. కానీ దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అటవీ సంపద తరుగుదలను ఆపాలని హెచ్చరిస్తున్నారు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త యాద్వీందర్ మల్హి. విచ్చలవిడి ఇంధనాల వాడకాన్ని తగ్గించడం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిపెట్టడం.. అన్నిటికీ మించి పచ్చదనం పెంచడం.. వీటి ద్వారా భారత్.. గ్లోబల్ వార్మింగ్ ప్రాభావం నుంచి బయటపడే అవకాశముంది.

Tags:    
Advertisement

Similar News