భారమవుతున్న చదువులు.. పెరుగుతున్న డ్రాపవుట్లు..

కరోనా ప్రభావంతో భారత్ లో పిల్లలు కేవలం పాఠాలకు మాత్రమే దూరమయ్యారని ఇన్నాళ్లూ ఆందోళన వ్యక్తం చేశారు నిపుణులు. అయితే ఇప్పుడు ఏకంగా బడికే దూరమయ్యారని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అవును, కరోనా కాలంలో భారత్ లో చదువులు.. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు భారంగా మారాయి. ఇప్పుడు పరిస్థితుతుల చక్కబడినా.. చాలామంది స్కూళ్లకు రావడం మానేశారు. కరోనా తర్వాత గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో కూడా మార్పు రావడంతో డ్రాపవుట్ల సంఖ్య భారీగా పెరిగినట్టు […]

Advertisement
Update:2021-11-13 04:46 IST

కరోనా ప్రభావంతో భారత్ లో పిల్లలు కేవలం పాఠాలకు మాత్రమే దూరమయ్యారని ఇన్నాళ్లూ ఆందోళన వ్యక్తం చేశారు నిపుణులు. అయితే ఇప్పుడు ఏకంగా బడికే దూరమయ్యారని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అవును, కరోనా కాలంలో భారత్ లో చదువులు.. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు భారంగా మారాయి. ఇప్పుడు పరిస్థితుతుల చక్కబడినా.. చాలామంది స్కూళ్లకు రావడం మానేశారు. కరోనా తర్వాత గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో కూడా మార్పు రావడంతో డ్రాపవుట్ల సంఖ్య భారీగా పెరిగినట్టు తెలుస్తోంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (icrier) సర్వే ప్రకారం కరోనా కష్టకాలంలో కేవలం 20శాతం మంది పిల్లలు మాత్రమే ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యను అభ్యసించారు. మిగతా 80శాతం మంది చదువులో బాగా వెనకబడ్డారు. అయితే ఇలా వెనకబడినవారిలో కూడా కొంతమంది తిరిగి స్కూళ్లకు ఇప్పుడిప్పుడే అలవాటవుతున్నారు, కానీ ఎక్కువశాతం బడికి శాశ్వతంగా దూరమయ్యారు. భారత్ లో 38శాతం కుటుంబాల్లో కనీసం ఒక పిల్లవాడు బడికి పూర్తిగా దూరమయ్యాడని icrier సర్వే తేల్చి చెప్పింది. ఈ డ్రాపవుట్ల సంఖ్య ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లోనే ఎక్కువ.

5నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు దాదాపుగా ఒక అకడమిక్ ఇయర్ ని పూర్తిగా కోల్పోయారు. వీరికి కనీసం ఆన్ లైన్ క్లాసులు వినడానికి కూడా అవకాశం లేదు. భారత్ లో 36శాతం మంది పిల్లలకు ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. వీరిలో ఏ కొద్దిమందో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పాఠాలు చదువుకున్నారు. మిగతా వారిలో కనీస అవగాహన లేకపోవడం, సాంకేతికత అందుబాటులో లేకపోవడంతో పాఠాలకు దూరమయ్యారు. అదే క్రమంలో ఇప్పుడు ఏకంగా స్కూల్ కే దూరమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

కరోనా వల్ల ఒక తరం చదువుల్లో పూర్తిగా మార్పులొచ్చాయి. కరోనా బ్యాచ్ ని ఆల్ పాస్ అంటూ ప్రభుత్వాలు పై తరగతులకు ప్రమోట్ చేశాయి. టెన్త్, ఇంటర్ విద్యార్థులు కూడా పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లిపోయారు. ఫీజు కట్టిన వాల్లందరూ పాసైపోయారు. అయితే కరోనా ప్రభావం కేవలం చదువులపైనే ప్రభావం చూపలేదని, చదువుకునే విద్యార్థులపై కూడా తీవ్ర ప్రభావం చూపిందని తాజా సర్వేలు చెబుతున్నాయి. డ్రాపవుట్ల సంఖ్యను తగ్గించడంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని, లేకపోతే అక్షరాశ్యత శాతం పడిపోతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Tags:    
Advertisement

Similar News