చంద్రబాబు సంయమనం కోల్పోతున్నారా..?

2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు వేరు, 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు వేరు. ఆయన వ్యవహార శైలి, మాటతీరు చూస్తే కచ్చితంగా ఈ మార్పు స్పష్టమవుతుంది. వైరిపక్షాలే కాదు, సాక్షాత్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలకు కూడా అనుభవంలోకి వస్తున్న విషయం ఇదే. గతంలో ఎప్పుడూ చంద్రబాబు ఆవేశంతో ఊగిపోతూ ప్రసంగాలివ్వలేదు, మాట మార్చడం ఆయనకు అలవాటే కానీ, ప్రత్యర్థులు ఎంత రెచ్చగొడుతున్నా మాట తూలడం ఆయనకు అనుభవంలో లేదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక రోజు రోజుకీ […]

Advertisement
Update:2021-02-23 02:32 IST

2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు వేరు, 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు వేరు. ఆయన వ్యవహార శైలి, మాటతీరు చూస్తే కచ్చితంగా ఈ మార్పు స్పష్టమవుతుంది. వైరిపక్షాలే కాదు, సాక్షాత్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలకు కూడా అనుభవంలోకి వస్తున్న విషయం ఇదే. గతంలో ఎప్పుడూ చంద్రబాబు ఆవేశంతో ఊగిపోతూ ప్రసంగాలివ్వలేదు, మాట మార్చడం ఆయనకు అలవాటే కానీ, ప్రత్యర్థులు ఎంత రెచ్చగొడుతున్నా మాట తూలడం ఆయనకు అనుభవంలో లేదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక రోజు రోజుకీ చంద్రబాబు బ్యాలెన్స్ కోల్పోతున్నారని అర్థమవుతోంది. ఆయన ప్రెస్ మీట్లు, విమర్శలు, చీవాట్లు వింటే కచ్చితంగా బాబులో వచ్చిన మార్పు తెలుస్తుంది. చరిత్ర ఎరుగని పరాభవం 2019 ఎన్నికల్లో టీడీపీకి దక్కిందనే బాధో, లేక తనకంటే వయసులో బాగా చిన్నవాడైన జగన్ అధికారంలోకి వచ్చారన్న ఆక్రోశమో, లేక తన కొడుకు లోకేష్ చేతికి అందిరాలేదన్న ఆవేదనో తెలియదు కానీ.. చంద్రబాబు మాత్రం పూర్తిగా మారిపోయారు.

బట్టలూడదీస్తాం.. మీ అంతు చూస్తాం..
నాలుగో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుంటూ చంద్రబాబు నిర్వహించిన ప్రెస్ మీట్ ఆద్యంతం ఆయనలోని ఆక్రోశాన్ని బయటపెట్టింది. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని, బెదిరింపులతో మెజార్టీ స్థానాలు చేజిక్కించుకుందని విమర్శిస్తూనే, వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బాబు. “ఎల్లకాలం మీరే అధికారంలో ఉంటారనుకుంటున్నారా..?జమిలి వచ్చే వరకే మీ పెత్తనం, ఆ తర్వాత మా సంగతి చూపిస్తాం, ఎక్కడికెళ్లిపోతారు మీరు, బజార్లో బట్టలూడదీస్తాం” అంటూ రెచ్చిపోయారు బాబు.

అధికారులపై కూడా అదే తీరు..
పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి కొంతమంది పోలింగ్ సిబ్బంది, పోలీసులు వంతపాడుతున్నారనేది చంద్రబాబు తొలినుంచీ చేస్తున్న ఆరోపణ. అలాంటి వారందరికీ తుది విడత ఎన్నికల తర్వాత ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు బాబు. “చంద్రబాబు మంచి వాడని, జగన్ మూర్ఖుడని అనుకుంటూ ఆయనకు ఊడిగం చేస్తున్నారు. రేపు బాబు అధికారంలోకి వస్తే అందర్నీ మన్నిస్తాడనే అంచనాలో ఉన్నారు. ఇప్పటి వరకూ చంద్రబాబులో మంచితనమే చూశారు, తిక్క తిక్కగా ప్రవర్తిస్తే నాలో కూడా అదే తిక్కని చూస్తారం”టూ వార్నింగ్ ఇచ్చారు.

ప్రభుత్వ సిబ్బందితో ఎక్కువ పనిచేయించుకుంటారు, తాను నిద్రపోడు, పక్కనవాళ్లని కూడా నిద్రపోనీయరనే పేరు చంద్రబాబుకి ఉంది, అంతేకానీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఎప్పుడూ కూడా ప్రభుత్వ సిబ్బందిని ఈ స్థాయిలో బెదిరించిన సందర్భాలు లేవు. అలాంటి బాబు, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సిబ్బందిని పూర్తిగా టార్గెట్ చేశారు. స్వరం పెంచడంతోపాటు, బాబు మాటతీరు కూడా పూర్తిగా మారిపోయింది.

ఇక నిన్నమొన్నటి వరకూ ఎస్ఈసీ నిమ్మగడ్డని నెత్తిన పెట్టుకుని మోసిన చంద్రబాబు, హఠాత్తుగా పంచాయతీ ఎన్నికల్లో ఈసీ విఫలమైందంటూ విమర్శించారు. అధికారాలు వాడుకోలేదని, అధికార పక్షానికి పరోక్షంగా మేలు చేశారని మండిపడ్డారు. అసలింతకీ చంద్రబాబుకి ఏమైంది? ఆయన ఎందుకిలా మారిపోయారు? మాటతీరు ఎందుకిలా మార్చుకున్నారు? అని టీడీపీ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి.

Tags:    
Advertisement

Similar News