ఎన్నికల కమిషన్ సిబ్బందిపై నిమ్మగడ్డ ప్రతాపం..

అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్టుంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం. స్థానిక ఎన్నికల నిర్వహణ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి దిగిన ఆయన.. వరుసగా ఎన్నికల కమిషన్లో పనిచేసే ఉద్యోగులపై వేటు వేస్తూ వస్తున్నారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సాయి ప్రసాద్ ని సస్పెండ్ చేసిన మరుసటి రోజే.. ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీ మోహన్ ని కూడా తొలగించారు నిమ్మగడ్డ. ఎన్నికల సంఘం కార్యకలాపాలకు […]

Advertisement
Update:2021-01-12 10:37 IST

అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్టుంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం. స్థానిక ఎన్నికల నిర్వహణ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి దిగిన ఆయన.. వరుసగా ఎన్నికల కమిషన్లో పనిచేసే ఉద్యోగులపై వేటు వేస్తూ వస్తున్నారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సాయి ప్రసాద్ ని సస్పెండ్ చేసిన మరుసటి రోజే.. ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీ మోహన్ ని కూడా తొలగించారు నిమ్మగడ్డ. ఎన్నికల సంఘం కార్యకలాపాలకు పథకం ప్రకారం విఘాతం కల్పించారని, పంచాయతీ ఎన్నికలను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారని వీరిపై అభియోగాలు మోపిన ఆయన.. వెంటనే వేటు వేశారు. దీంతో నిమ్మగడ్డ వ్యవహారం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం.. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఉద్యోగులెవరూ సెలవలు పెట్టకుండా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అదే సమయంలో.. రాష్ట్రంలోని ఇతర ఉద్యోగులనుంచి ఎన్నికల విధులు నిర్వర్తించలేమనే అభ్యర్థనలు వచ్చాయి. కొవిడ్ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనలేమని ఉద్యోగ సంఘాల నేతలు రమేష్ కుమార్ కి లేఖలు రాశారు. ఈ వ్యవహారం జరుగుతుండగానే.. సాక్షాత్తూ ఎన్నికల కమిషన్ లో పనిచేసే జాయింట్ డైరెక్టర్ సాయి ప్రసాద్ 30రోజులపాటు సెలవుకోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ ఏకంగా విధులనుంచి తొలగించారు. సాయిప్రసాద్‌ను ఆర్టికల్‌ 243కే రెడ్‌ విత్‌ 324 ప్రకారం అధికారాలు ఉపయోగించి కమిషన్‌ నుంచి తొలగిస్తున్నట్లు రమేశ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో విధులు నిర్వహించడానికి ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా వీల్లేదని కూడా స్పష్టం చేశారు. తాజాగా వాణీ మోహన్ ‌ను కూడా రిలీవ్‌ చేస్తూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ని క్యాన్సిల్ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై సమీక్షకోసం హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ. ఆరు నూరైనా ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని అంటున్నారాయన. కొవిడ్ కేసులు తగ్గిపోయాయని, తొలిదశలో వ్యాక్సిన్ కొంతమందికి మాత్రమే ఇస్తారని, పంచాయతీ ఎన్నికల వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇబ్బంది కలగదనేది ఆయన వాదన.

Tags:    
Advertisement

Similar News