కార్చిచ్చు ప్రమాద సంకేతాలు

ఆస్ట్రేలియాలో అడవులు అంటుకోవడం “సంప్రదాయంగా” తయారైంది. కథలు చెప్పడంలో కూడా అడవులు అంటుకోవడం కనిపిస్తోంది. అయితే శీతోష్ణ స్థితిలో వస్తున్న మార్పులు అడవులు అంటుకోవడం సర్వసాధారణంగా పరిగణించడం లేదు. ఈ సంఘటనలు జరగడం వినాశకరం అనుకుంటున్నారు. దీని ప్రభావం జీవావరణ వ్యవస్థ మీద కూడా ఉంటుందని అనుకుంటున్నారు. ఇంతకు ముందు అడవులు అంటుకోవడం ఏడాదికి ఒక సారే జరిగేది. 2019 సెప్టెంబర్ తరవాత అనేక దఫాలు కార్చిచ్చు రేగుతూనే ఉంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో వాతావరణం ఎక్కువ […]

Advertisement
Update:2020-02-01 02:10 IST

ఆస్ట్రేలియాలో అడవులు అంటుకోవడం “సంప్రదాయంగా” తయారైంది. కథలు చెప్పడంలో కూడా అడవులు అంటుకోవడం కనిపిస్తోంది. అయితే శీతోష్ణ స్థితిలో వస్తున్న మార్పులు అడవులు అంటుకోవడం సర్వసాధారణంగా పరిగణించడం లేదు. ఈ సంఘటనలు జరగడం వినాశకరం అనుకుంటున్నారు. దీని ప్రభావం జీవావరణ వ్యవస్థ మీద కూడా ఉంటుందని అనుకుంటున్నారు.

ఇంతకు ముందు అడవులు అంటుకోవడం ఏడాదికి ఒక సారే జరిగేది. 2019 సెప్టెంబర్ తరవాత అనేక దఫాలు కార్చిచ్చు రేగుతూనే ఉంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో వాతావరణం ఎక్కువ పొడిగా ఉండడంవల్ల కూడా కార్చిచ్చు వ్యాపించడం పెరిగిపోయింది. ఆస్ట్రేలియాలో ఉష్ణోగ్రత 1.4 సెల్సీయెస్ పెరిగిపోతోంది. ప్రపంచంలో ఉష్ణోగ్రత పెరుగుదల 1.1 సెల్సీయెస్ ఉంటే ఆస్ట్రేలియాలో అంతకన్నా ఎక్కువ ఉంది.

ఆస్ట్రేలియాలో ఉష్ణోగ్రత పెరగడంవల్ల వేడి గాలులు ఎక్కువ అవుతున్నాయి. అనావృష్టీ పెరుగుతోంది. గత మూడేళ్లలో దేశంలో చాలా ప్రాంతాలలో అనావృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షపాతం తగ్గుతోంది. ఆస్ట్రేలియా వేపు హిందూ మహాసముద్ర ఉపరితలంలో ఉష్ణోగ్రత పెరుగుతోంది. తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. అందువల్ల వరదలొస్తున్నాయి.

ఇలాంటి వాతావరణ పరిస్థితులవల్ల ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని వందలాది చోట్ల అడవులు అంటుకున్నాయి. ప్రధానంగా న్యూ సౌత్ వేల్స్, విక్టోరియాలో ఈ పరిస్థితి ఎదురైంది. ఈ కార్చిచ్చు ఈశాన్యం వేపున క్వీన్స్ లాండ్ దాకా విస్తరిస్తోంది. 200 అడుగుల ఎత్తున మంటలు ఎగసి పడ్తున్నాయి. దేశవ్యాప్తంగా 10 మిలియన్ హెక్టేర్ల మేర అడవులు బుగ్గి అయిపోయాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చవలసి వచ్చింది. సముద్ర తీరాల్లో అనేకమంది దిగబడి పోయారు. ఇంతకు ముందు సముద్ర తీర ప్రాంతాలు సురక్షితమైనవి అనుకునే వారు. ఈ కార్చిచ్చు కారణంగా ఒక బిలియన్ కన్నా ఎక్కువ పశు సంతతి అంతరించింది. ఈ దృశ్యాలు దుర్భరంగా ఉన్నాయి.

కంగారూ ఐలాండ్ లాటి చోట్ల కాంగారూలు చెట్ల కొమ్మల మీద కనిపిస్తున్నాయి. వాటిని రక్షిస్తున్నారు. అనేక జంతువుల జాతులు అంతరించి పోతున్నాయి. బ్రెజిల్ అమెజాన్ ప్రాంతంలో, అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చులు ఆస్ట్రేలియాలో ఎదురవుతున్న విపత్తు ముందు కురచన అయిపోతున్నాయి.

పొదలకు నిప్పంటుకోవడంవల్ల తోటలు, పళ్ల చెట్లు నాశనమై వ్యవసాయం, పర్యాటన దెబ్బ తింటోంది. భూగోళ కవోష్ణతవల్ల పెరుగుతున్న కార్చిచ్చు ఒక విష వలయానికి దారి తీస్తోంది. ఆస్ట్రేలియాలో మళ్లీ అడవులు పెరగాలంటే దశాబ్దాలు పడ్తుంది. అప్పుడు గానీ విడుదలైన 400 మిలియన్ మెట్రిక్ టన్నుల కర్బన వాయువులను చెట్లు పీల్చుకోవడానికి వీలుండదు. పొగ దట్టంగా వ్యాపించడంవల్ల ఉరుములతో కూడిన గాలి వానలు పెరిగి మళ్లీ అడవులు అంటుకుంటున్నాయి. సుడిగాలులు వీస్తున్నాయి. ధూళి తుపాన్లు, గోల్ఫ్ బంతి పరిమాణంలో వడగళ్లు తప్పడం లేదు. దీనివల్ల కార్చిచ్చు లేని ప్రాంతాల్లో కూడా ఎర్రని ధూళి తుపాన్ల వల్ల వాతావరణ పరిస్థితి దుర్భరంగా మారిపోతోంది. జనావాసానికి అవకాశం లేకుండా పోతోంది.

ఈ కార్చిచ్చు బాధితులు “మేం తగలబడి పోతుంటే మీరు గుణపాఠాలు నేర్చుకోరా” అన్న పోస్టర్లు వెలుస్తున్నాయి. ఈ విపత్తును రాజకీయ నాయకుల, ప్రపంచం దృష్టికి తీసుకు రావడానికి ఈ పోస్టర్ల ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఎలాంటి విపత్తు ఎదురవుతోందో హచ్చరిస్తున్నారు. హరిత గృహ వాయువులు పెరగకుండా ఉండడానికి పారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ దేశాలు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండవలసిన ఆవశ్యకతను ఈ పోస్టర్లు తెలియజెప్తున్నాయి.

వివిధ దేశాలు పారిస్ ఒప్పందానికి నిబద్ధమై లేకపోతే భూగోళ కవొష్ణత రెండు దిగ్రీలు తగ్గించడం సాధ్యం కాదు. ఆస్ట్రేలియాతో సహా అనేక దేశాలు ఈ మాట నిలబెట్టుకోవడం లేదు. ఆస్ట్రేలియా వెదజల్లుతున్న వాయువులు తలసరిగా చూస్తే అత్యధికంగా ఉన్నాయి. ఇంతకు ముదు ఎన్ని హెచ్చరికలు చేసినా ఫలితం కనిపించడం లేదు.

శీతోష్ణ స్థితిలో మార్పుల ప్రభావం వల్ల కార్చిచ్చు రేగడంపై పొంచి ఉన్న ముప్పు ఏమిటో 2007 నుంచి శీతోష్ణ స్థితిపై వివిధ ప్రభుత్వాల మండలి హెచ్చరికలు చేస్తూనే ఉంది. 2019 డిసెంబర్ లో ఐక్య రాజ్య సమితి శీతోష్ణ స్థితిపై నిర్వహించిన 25వ సమావేశంలో ఆస్ట్రేలియాను తప్పుపట్టారు. ఇంత జరుగుతున్నా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ చలించడం లేదు. శిలాజ ఇంధనాలను ఎక్కువగా వినియోగించడం లేదని బుకాయిస్తున్నారు. బొగ్గు పరిశ్రమను ఆయన ప్రోత్సహిస్తూనే ఉన్నారు. “ఉద్యోగాలు ఊడగొట్టే చర్చల్లో” తాను భాగస్వామిని కాలేనని చెప్తున్నారు.

బొగ్గు, గ్యాస్ ఎగుమతి చేసే దేశాలలో ఆస్ట్రేలియా చాలా ప్రధానమైన దేశం. క్లైమేట్ కౌన్సిల్ అనే స్వతంత్ర వ్యవస్థ బొగ్గు గనులను విస్తరించడాన్ని వ్యతిరేకిస్తోంది. ఉద్యోగాల కల్పన పేరుతోనే బొగ్గు గనుల పరిశ్రమలను విస్తరిస్తున్నారు. ఈ బొగ్గు గనుల వల్ల కర్బన ఉద్గారాలు 1.3 రెట్లు పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడానికే బొగ్గు పరిశ్రమను విస్తరిస్తున్నామని చెప్తున్నా… ఉన్న ఉద్యోగాలే ఊడే పరిస్థితి ఎదురవుతోంది. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపలేక పోతున్నారు. అందుకే విస్తారంగా వినాశనం ఎదురవుతోంది. ఈ పరిస్థితిని చూస్తే ఆస్ట్రేలియా స్వీయ విధ్వంసక ధోరణి అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సంక్షోభ సమయంలో తన బాధ్యతను విస్మరిస్తోంది. వినియోగ మనస్తత్వాని, నిర్లక్ష్యాన్ని వదులుకోవలసిన సమయం ఆసన్నమైంది.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

Tags:    
Advertisement

Similar News