కదులుతున్న గణతంత్ర కుదుళ్లు
మనం గణతంత్ర దేశంగా అవతరించి వచ్చే జనవరి 26కు 70 ఏళ్లు అవుతాయి. గణతంత్రంగా అవతరించడానికి ఓ నేపథ్యం ఉంది. మనం నిర్దిష్టమైన రాజ్యాంగం సిద్ధం చేసుకున్నాం. ఈ రాజ్యాంగ రచనకు మనకు స్ఫూర్తినిచ్చిన అనేక రాజ్యాంగాలున్నాయి. వివిధ దేశాల్లోని మంచి విషయాలను మన రాజ్యాంగంలోనూ చేర్చాం. అందుకే కొందరు మన రాజ్యాంగాన్ని అతుకుల బొంత అంటారు. నిజమే. అతుకుల బొంత అయినా అది అందమైనదే. రాజ్యాంగ పీఠికలో మనది సార్వభౌమాధికారంగల సోషలిస్టు, సెక్యులర్, ప్రజాస్వామ్య గణతంత్రంగా […]
మనం గణతంత్ర దేశంగా అవతరించి వచ్చే జనవరి 26కు 70 ఏళ్లు అవుతాయి. గణతంత్రంగా అవతరించడానికి ఓ నేపథ్యం ఉంది. మనం నిర్దిష్టమైన రాజ్యాంగం సిద్ధం చేసుకున్నాం. ఈ రాజ్యాంగ రచనకు మనకు స్ఫూర్తినిచ్చిన అనేక రాజ్యాంగాలున్నాయి. వివిధ దేశాల్లోని మంచి విషయాలను మన రాజ్యాంగంలోనూ చేర్చాం. అందుకే కొందరు మన రాజ్యాంగాన్ని అతుకుల బొంత అంటారు. నిజమే. అతుకుల బొంత అయినా అది అందమైనదే.
రాజ్యాంగ పీఠికలో మనది సార్వభౌమాధికారంగల సోషలిస్టు, సెక్యులర్, ప్రజాస్వామ్య గణతంత్రంగా ఉంటుందని చెప్పుకున్నాం. సామాజిక ఆర్థిక, రాజకీయ న్యాయం కలగజేస్తామని; అందరికీ భావప్రకటనా స్వేచ్ఛ, మత విశ్వాసాలకు సంబంధించిన, ఆరాధనా స్వేచ్ఛ ఉంటుందని; తరతమ భేదాలతో నిమిత్తం లేకుండా సమానత్వం ఉంటుందని, అందరికీ సమానావకాశాలు ఉంటాయని; సుహృద్భావాన్ని పెంపొందించి వ్యక్తి గౌరవాన్ని, దేశ సమైక్యతను కాపాడతామని చెప్పుకున్నాం.
ఇవన్నీ ఉదాత్త ఆశయాలే. సందేహం లేదు. అయితే ఆచరణ ఇందుకు అనుగుణంగా ఉందా అని ఆలోచిస్తే లేదు అనే సమాధానమే వస్తుంది. సమాజంలోని ఒక నిర్దిష్ట మతం వారిని, దళితులను, అణగారిన వర్గాల వారిని మరింత అణగదొక్కడం కొనసాగుతూనే ఉంది. 2014 తరవాత ఈ పెడధోరణి మరింతగా వెర్రి తలలు వేస్తోంది. గణతంత్ర మూలకందమే ప్రమాదంలో పడింది. దీనికి ఒక్క ఉదాహరణ చాలు.
గత సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా దారుల్ ఉలూం దేవబంద్ అనే ఓ మత సంస్థ ముస్లిం విద్యార్థులు గణతంత్ర దినోత్సవం రోజున బయట తిరగకూడదని సూచించింది. ఒక వేళ తిరగడం అనివార్యమైతే పని చూసుకుని వెంటనే తమ సంస్థకు తిరిగి రావాలని కూడా హితవు చెప్పింది. ఇలాంటి హితవచనాలు ఏమిటి అన్న అనుమానం రావొచ్చు. కాని పరిస్థితి భయంకరంగానే ఉండడంవల్లే దేవబంద్ ఆ మార్గదర్శక సూత్రాలు జారీ చేయవలసి వచ్చింది.
ఈ మత సంస్థకు చెందిన విద్యార్థులపై పట్టపగలు బహిరంగ ప్రదేశాల్లోనే దాడులు జరిగాయి. ఒక సందర్భంలోనైతే గణతంత్ర దినోత్సవం రోజునే దాడి జరిగింది. నిందితులు ఎవరో ఇంతవరకు నిగూఢంగానే ఉండిపోయింది. అల్పసంఖ్యాక మతాలకు చెందిన వారి మీద, దళితుల మీద జరిగిన దాడుల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారు మరెందరో. గో రక్షకులు, హిందుత్వ పరిరక్షకుల దగ్గర నుంచి మొదలుపెట్టి వివిధ సామాజిక వర్గాల ప్రయోజనాలకోసం పాటు పడుతున్నామనుకునే వారు ఈ దాడులకు దిగుతున్నారు.
రంజాన్ పండగ సందర్భంగా కావలసినవి కొనుక్కుని వెళ్తున్న ఒక ముస్లిం యువకుడిని రైలులోనే పొడిచి చంపారు. ఈ దాడికి దిగిన వారు ముస్లింలు ధరించే టోపీకి అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో వైపు మూక దాడులు పెచ్చరిల్లాయి. ఝార్ఖండ్ లో ఒక ముస్లిం వ్యాపారస్థుడిని హతమార్చినందుకు దోషులుగా తేలిన వారిని సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రే సన్మానించారు. అలాంటప్పుడు అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తే తత్వాన్ని ఒంటబట్టించుకున్న పోలీసులు ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మూక దాడుల్లో నిందితుల మీద చెదురుమదురుగానే చర్యలు తీసుకుంటున్నారు. బహుశః ఇటీవల ఎన్నికల్లో బీజేపీ ఎదురు దెబ్బలు తినాల్సి వస్తున్నందువల్ల కాబోలు మూక దాడులు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నాయి. అంటే బీజేపీ నాయకులు తమ అనుయాయులకు కళ్లెం వేయక తప్పని పరిస్థితి ఎదురైందనుకోవాలి.
దేవబంద్ గత సంవత్సరం జారీ చేసిన మార్గదర్శకాలు చూస్తే మైనారిటీల్లో ఎంత భయం గూడు కట్టుకుందో అర్థం అవుతోంది. సమ్మిళిత రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడు గొప్ప గణతంత్ర దేశం అని బాకా ఊదుతూ ఉంటే ఒరిగేది ఏమిటి? దేవబంద్ మీద ఎన్ని ఫిర్యాదులైనా ఉండవచ్చు. కాని తమ సంస్థకు చెందిన వారిని గణతంత్ర దినోత్సవం రోజున బయట తిరగకూడదన్న మార్గదర్శకాలు జారీ చేయవలసిన పరిస్థితి రావడమే మన వ్యవస్థ వైఫల్యానికి ప్రబల నిదర్శనం. తాము వేధింపులకు, పీడనకు గురవుతున్న వర్గాల వారే తీవ్రమైన భావాలకు చోటిస్తున్నారన్న వాస్తవాన్ని అర్థం చేసుకోలేక పోతున్నాం. ఆ తీవ్ర భావాలు ప్రతిక్రియగా మాత్రమే వ్యాప్తి చెందుతున్నాయి.
తమ దేశ ప్రజల్లోనే కొందరిని పీడించే చోట ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని ఎలా చెప్పుకోగలం? పౌరుల్లో ఏ వర్గం తమకు భద్రత లేదని, తమని వేటాడుతున్నరని భావించినా అది వ్యవస్థ వైఫల్యం కిందే లెక్క.