హింసను నిరసించడంలో రాజకీయాలు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రంలోనూ, ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లోనూ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అయిన బీజేపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధులు హింసను, దౌర్జన్యాన్ని ఖండించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. హింసను నిరసించడం అంటే అందరి శ్రేయస్సు కోరడం కనక అందులో తప్పుపట్టవలసింది ఏమీ లేక పోవచ్చు. శాంతి నెలకొనాలని కోరుకోవడం, అహింసాయుత విధానం అమలు కావాలనుకోవడంలో తప్పు లేదు. ఉదాహరణకు మహిళలు, దళితుల మీద హింస కొనసాగకూడదని […]

Advertisement
Update:2020-01-07 02:00 IST

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రంలోనూ, ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లోనూ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అయిన బీజేపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధులు హింసను, దౌర్జన్యాన్ని ఖండించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది.

హింసను నిరసించడం అంటే అందరి శ్రేయస్సు కోరడం కనక అందులో తప్పుపట్టవలసింది ఏమీ లేక పోవచ్చు. శాంతి నెలకొనాలని కోరుకోవడం, అహింసాయుత విధానం అమలు కావాలనుకోవడంలో తప్పు లేదు. ఉదాహరణకు మహిళలు, దళితుల మీద హింస కొనసాగకూడదని వాదించడం ప్రజలు జాగరూకంగా ఉండడానికి ఉపకరిస్తుంది. నైతికతను పెంపొందిస్తుంది. ఎందుకంటే ఈ నిరసన మనుషులకు, ఆస్తిపాస్తులకు నష్టం కలగకూడదన్న లక్ష్యంతో ఉన్నదే. అందువల్ల నిరంతరం హింసను నిరసించడం మంచిదే. హింసను సమర్థంగా నివారించడానికి ఈ నిరసన అవసరమైందే.

అయితే అందరి శ్రేయస్సు కోరే ఈ నిరసనలో సమస్యలు లేకపోలేదు. ఉదాహరణకు మహిళలు, దళితుల మీద కొనసాగే హింస, దౌర్జన్యాలను, మూక దాడులను నిరసించడం మంచిదే. నైతిక ప్రవర్తనకు, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం ఇచ్చే వారు సహజంగానే హింసను వ్యతిరేకిస్తారు. అయితే మూక దాడులను నిరసించడంలో కొందరే నైతిక బాధ్యతతో వ్యవహరిస్తారు. మహిళల మీద అఘాయిత్యాలను నిరసించే వారికి కొదవ ఉండదు కాని మూక దాడులను నిరసించే వారు కొద్ది మందే కనిపిస్తారు.

ఉత్తరప్రదేశ్ లో హింసను నిరసించే అధికార పక్షం వారు నిరసిస్తూ ఉండవచ్చు కాని దాని వెనకా ఏదో మతలబు ఉంటుంది. అధికార పక్షం శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు, హింసకు పాల్పడే వారిని ఖండిస్తున్నట్టు కనిపించినా అలా హింసకు పాల్పడే వారు ఎవరో సాక్ష్యాధారాలు ఉన్నా వారిని గుర్తించడంలేదు. వారి మీద చర్య తీసుకోవడం లేదు. ఇలా హింసకు పాల్పడే వారిలో ప్రతీకార కాంక్షను పరోక్షంగా ప్రోత్సహిస్తోంది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దౌర్జన్యకర సంఘటనల కారణంగా జరిగిన ఆస్తి నష్టానికి దౌర్జన్యానికి పాల్పడిన వారి నుంచే పరిహారం రాబడతామంటున్నారు. ఇలాంటి వాదన సమస్యాత్మకమైంది అయినా వాదనకోసం దాన్నీ అంగీకరిద్దాం. అయితే ఇందులో ఓ సమస్య ఉంది. నైతిక దృష్టితో హింసకు పాల్పడిన వారిని విమర్శిస్తున్నా హింసకు కారణమైన మూలాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. కొందరు దోషులను మాత్రమే విమర్శిస్తున్నారు తప్ప దళితుల మీద హింసకు పాల్పడే వారిని, మూక దాడులకు పాల్పడే వారి మీద ఎలాంటి చర్యా తీసుకోవడం లేదు. అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దోషులను సంకుచిత దృష్టితోనే చూస్తోంది. ఉదాహరణకు హర్యానాలో 500 దళిత కుటుంబాలను వెలి వేసిన దోషులపై చర్యతీసుకోవాలని ఆశిస్తాం.

హింసాకాండకు పాల్పడిన వారి నుంచే జరిగిన ఆస్తి నష్టానికి పరిహారం రాబడతామని చెప్పే ప్రభుత్వం దళితుల మీద అఘాయిత్యాలకు పాల్పడే వారి మీద “అత్యాచార పన్ను” విధించాలి కదా! ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు సామాజిక విధ్వంసానికి పాల్పడే వారి మీద, విధ్వసం జరుగుతున్నప్పుడు ప్రేక్షక పాత్ర వహించే వారి మీద ఇలాంటి పన్ను విధించే ఆలోచన అయినా చేయగలవా? వారిని శిక్షిస్తాయా? అల్పసంఖ్యాక వర్గాల వారి మీద మూకదాడులకు పాల్పడిన వారి మీద, లేదా దళితుల మీద అత్యాచారాలు చేసే వారి మీద ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలాంటి పన్ను విధిస్తాయా? చట్టం ప్రకారం వారిని శిక్షిస్తాయా? సమాజం నుంచి కొందరిని వేలివేసిన వారి మీద హర్యానా ప్రభుత్వం చర్య తీసుకుంటుందా? వెలికి గురైన వారు రెండేళ్లుగా తమకు న్యాయం చేయాలని చేస్తున్న పోరాటాన్ని పట్టించుకుంటుందా? వెలికి గురైన వారికి రోజు వారీ అవసరాలు కూడా తీరడం లేదు. కనీసం వారికి సమాజంలోని ఇతరులతో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదుగా?

దళితుల దగ్గర ఉండే ఏకైక ఆస్తి వారి ఆత్మ గౌరవం మాత్రమే. వారు కోరేదల్ల సమాజంలో తమను సమానంగా చూడాలనే. కాని అలాంటి మానవీయ విలువలనే వారి దగ్గర నుంచి లాగేసుకున్నారుగా! అహింసాయుతంగా నిరసన తెలియజేసే వారిని మాత్రం దోషులుగా పరిగణిస్తున్నారుగా! మరి ఇలాంటి సందర్భాలలో బౌద్ధం చెప్పినట్టు సమ్యక్ దృష్టి ఉండాలిగదా? ఎలాంటి హింసను అయినా ఒకే రకంగా పరిగణించాలిగదా? అలా ప్రవర్తించాలంటే హింసను నిరసిస్తున్న ఈ “కొత్త ప్రవక్తలు” సామాజిక పరిస్థితులు సవ్యంగా, అందరికీ ఒకేలా ఉండేట్టు చూడవలసి వస్తుంది. సమాజంలో సామరస్యాన్ని కాపాడవలసి ఉంటుంది. ఈ లోటే బాహాటంగా కనిపిస్తోంది.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

Tags:    
Advertisement

Similar News