న్యాయం పేర అన్యాయానికి ఊతం

ఏదో ఘోరం జరిగేదాకా మనం మౌన ప్రేక్షకుల్లా ఉండిపోతాం. తీరా ఆ ఘోరం జరిగాక న్యాయం కోసం అమాంతం పోరాటం ప్రారంభిస్తాం. ఈ దురాగతాలను వ్యతిరేకించడానికి అరిచి గీపెడ్తాం. అయితే ఈ రొదలో మన ధర్మాగ్రహం వినిపించకుండా పోతుందని మర్చి పోతాం. హైదరాబాద్ లో ఓ పశువైద్యురాలి మీద అత్యాచారం, హత్య దేశమంతటినీ కుదిపేసింది. అయితే ఈ జనాగ్రహం 2012 లో దిల్లీలో జ్యోతీ సింగ్ (నిర్భయ) మీద జరిగిన దురంతంపై వెల్లువెత్తిన ఆగ్రహం లాంటిది కాదు. […]

Advertisement
Update:2019-12-13 01:31 IST

ఏదో ఘోరం జరిగేదాకా మనం మౌన ప్రేక్షకుల్లా ఉండిపోతాం. తీరా ఆ ఘోరం జరిగాక న్యాయం కోసం అమాంతం పోరాటం ప్రారంభిస్తాం. ఈ దురాగతాలను వ్యతిరేకించడానికి అరిచి గీపెడ్తాం. అయితే ఈ రొదలో మన ధర్మాగ్రహం వినిపించకుండా పోతుందని మర్చి పోతాం. హైదరాబాద్ లో ఓ పశువైద్యురాలి మీద అత్యాచారం, హత్య దేశమంతటినీ కుదిపేసింది. అయితే ఈ జనాగ్రహం 2012 లో దిల్లీలో జ్యోతీ సింగ్ (నిర్భయ) మీద జరిగిన దురంతంపై వెల్లువెత్తిన ఆగ్రహం లాంటిది కాదు. హైదరాబాద్ లో జరిగిన దారుణంలో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్లో హతమార్చారు.

నిర్భయ ఉదంతం తరవాత 2013లో నిర్భయ చట్టం తీసుకొచ్చారు. అత్యాచారానికి సంబంధించిన ఫిర్యాదులు చేయడానికి ప్రత్యేక టెలీఫోన్ నంబర్లు ఏర్పాటు చేశారు. న్యాయమూర్తి వర్మ కమిషన్ ఇలాంటి సందర్భాలలో న్యాయ ప్రక్రియ త్వరితంగా పూర్తి కావడానికి చట్టాల్లో చేయవలసిన మార్పులు సూచించింది. అయినా 2012 నుంచి ఇప్పటి వరకు అనేక అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.

దిల్లీ, ఉన్నావ్, కఠువా-ఇప్పుడు హైదరాబాద్ లో జరిగిన అత్యాచారాలు మనల్ని కలచి వేస్తూనే ఉన్నాయి. అత్యాచారంతో పాటు బాధితులను హతమార్చిన వారిని సత్వరం శిక్షించాలని యాగీ చేస్తున్నారు. ఇలాంటి దురాగతాలను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అత్యాచారంతో పాటు కిరాతకంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. న్యాయం కోసం నినదిస్తూనే ఉన్నారు.

ఈ న్యాయం కోసం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో, సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో, ప్రజలు ఎంత గగ్గోలు పెడ్తున్నారో చూసి ఆశ్చర్యపడనక్కర లేదు. ఇలాంటి సంఘటనలను వైపరీత్యంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి దురంతాలు జరిగినప్పుడు ఉద్రేకాలు రెచ్చగొడ్తున్నందు వల్ల ప్రజలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇవి వ్యాపార పరమైన మీడియా వ్యవస్థలు మరింత ప్రచారంలోకి రావడానికి ఉపకరిస్తున్నాయి.

అయితే ఇలా ఉద్రేకాలు రెచ్చగొట్టడంవల్ల అత్యాచారాలు మరింత పెరుగుతున్నాయి. పితృస్వామిక భావజాలం ఇనుమడిస్తోంది. ఈ భావజాలమే నేరాలు పెరగడానికి దోహదం చేస్తోంది. వెరసి ఇలాంటి అఘాయిత్యాలలో సమాజం బాధ్యత ఏమీ లేనట్టు వ్యక్తులను మాత్రమే తప్పు పట్టే ధోరణి ప్రబలిపోతోంది.

హైదరాబాద్ దుర్ఘటన తరవాత రాజకీయ నాయకులు, సినిమా నటుల నుంచి మొదలుపెట్టి అన్ని రంగాల ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలు తన చెల్లెలికి ఫోన్ చేసే బదులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఉంటే ఆమె ప్రాణాలు దక్కి ఉండేవి అని తెలంగాణ హోంశాఖ మంత్రి వ్యాఖ్యానించారు. ఇలాంటి మాటలు లైంగిక అత్యాచారాల తీవ్రతను, వాటికి దారి తీసే పరిస్థితులను విస్మరించడమే. అంతే కాక “తమకేమీ బాధ్యత లేదు”, భారం అంతా బాధితులదేనన్న రీతిలో ఉంది.

నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్న తరవాత మితవాద పక్షానికి చెందిన నాయకులు అనేక మంది నిందుతుల్లో ఒక ముస్లిం కూడా ఉన్నాడు అని గుర్తు చేసి ముస్లింలందరి మీద నింద వేయడానికి సాహసించారు. ఇలాంటి వ్యాఖ్యలవల్ల మహిళల స్వరం వినిపించకుండా పోతుంది. దీనివల్ల అరిచి గీపెట్టడం తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు.

ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని గట్టిగా కోరిన వారిలో చాలా మంది నిందితులను ఉరి తీయాలి అని తమ ఆక్రోషం వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరి తీయాలని గట్టిగా కోరిన వారిలో దిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు కూడా ఉన్నారు. ఇలాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడల్లా నిందుతులను ఉరి తీయడమే వీటికి పరిష్కారం అనీ, బాధితులకు న్యాయం జరిగినట్టు అని వాదించే వారు చాలా మంది ఉంటారు.

ఇలా నిందితులను ఉరి తీయాలి అని కోరడం అంటే “అరుదాతి అరుదైన సంఘటనల్లో” ఉరి శిక్ష విధిస్తారు కనక మన బాధ్యత ఏమీ లేనట్టు వ్యవహరించడమే. ఎలాంటి నేరాలకు మరణ శిక్ష విధించాలి, ఏ సందర్భాల్లో ఆ శిక్ష విధించకూడదు అని ఎలా నిర్ణయిస్తాం? అంటే అత్యాచారాలకు పాల్పడే వారు ఒక గీత దాటకూడదనుకుంటున్నాం. మరణ శిక్ష విధించాలని కోరడం ప్రజలలో మానవీయ విలువలు లేకుండా చేయడమే. ఈ రాక్షసానికి పాల్పడే వారి నుంచి మనల్ని మనం దూరంగా ఉంచడానికి ప్రయత్నించడం అంటే మన తప్పేమీ లేదనుకోవడమే.

ఈ సమస్యకు మూలాలు మన సంస్కృతిలో ఉన్నాయి. స్త్రీ-పురుష సంబంధాల్లో అపసవ్యతే దీనికి కారణం. స్త్రీలు, పురుషుల మధ్య సంబంధాల్లో భేదం ఉండకూడదని స్త్రీవాదులు దశాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. అయినా మనం పట్టించుకోం. ఇలాంటి అత్యాచారాలను అరికట్టడానికి చట్టాలున్నా, పదే పదే తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నా “ఆ రాక్షసులతో” మనకేమీ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నాం. ముఖ్యంగా పురుషులు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వైఖరి అనుసరించడంవల్ల ఒక సమాజంగా విఫలమవుతున్నాం.

అఘాయిత్యం జరిగినప్పుడల్లా మనం ఆగ్రహం ప్రదర్శిస్తాం, హింసను ప్రోత్సహిస్తాం. నిరంతరం జరిగే అన్యాయాలను పట్టించుకోనందువల్ల జనం కిరాతకాలకు పాల్పడతారని గ్రహించం. “మీటూ” లాంటి ఉద్యమాలను కించపరుస్తాం. అత్యాచారానికి గురైన మహిళ ప్రాణాలు కోల్పోతే తప్ప సమస్య ఎంత తీవ్రమైందో గమనించం.

లైంగిక అత్యాచారాలను మనం “భద్రతా సమస్యగా”నే పరిగణిస్తాం. ఈ అఘాయిత్యాల నుంచి తమను తాము కాపాడుకోవలసింది మహిళలే అనుకుంటాం. ఇప్పుడు వ్యక్తమైన ఆగ్రహావేశాలు, నిరసన ధ్వనులు ఇంతకు ముందు అనేక సార్లు వ్యక్తమైనవే. అందువల్ల ఇప్పుడు కొత్తగా చెప్పగలిగింది ఏమీ లేదు. అంటే సమస్య వినిపించుకోవలసిన వారిలోనే ఉంది. వాళ్లు చెవికెక్కించుకోవడం లేదు.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

Tags:    
Advertisement

Similar News