స్వయం ప్రతిపత్తి సంజీవని కాదు
సమకాలీన ఎన్నికల రాజకీయాలలో విపరీత ధోరణులు వ్యక్తం అవుతున్నాయి. ఇతర పార్టీల వారిని తమలో ఇముడ్చుకోవడం, స్వయం ప్రతిపత్తి అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్న బీజేపీ అది చాలా గర్వ కారణంగా భావిస్తోంది. అంటే బీజేపీ అనుసరిస్తున్న పార్లమెంటరీ రాజకీయాలలో ఉన్నత వర్గాల అవకాశవాదులు బీజేపీలో చేరి ఉన్నత వర్గంగా చెలామణి అవుతున్నారు. ఈ ఫిరాయింపులను మహోజ్వల కార్యకలాపంగా చెలామణి చేస్తున్నారు. మరో వేపున అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని […]
సమకాలీన ఎన్నికల రాజకీయాలలో విపరీత ధోరణులు వ్యక్తం అవుతున్నాయి. ఇతర పార్టీల వారిని తమలో ఇముడ్చుకోవడం, స్వయం ప్రతిపత్తి అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్న బీజేపీ అది చాలా గర్వ కారణంగా భావిస్తోంది.
అంటే బీజేపీ అనుసరిస్తున్న పార్లమెంటరీ రాజకీయాలలో ఉన్నత వర్గాల అవకాశవాదులు బీజేపీలో చేరి ఉన్నత వర్గంగా చెలామణి అవుతున్నారు. ఈ ఫిరాయింపులను మహోజ్వల కార్యకలాపంగా చెలామణి చేస్తున్నారు. మరో వేపున అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే రాజకీయ పక్షాలు రాజకీయ స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడుతుంటాయి.
అణగారిన వర్గాలను సమీకరించడమే తమ పని అని చెప్పుకుంటాయి. ఇలాంటి రాజకీయ పార్టీలు “స్వతంత్రంగా”నే ఎన్నికలలో పోటీ చేస్తుంటాయి. కానీ ఈ స్వతంత్ర రాజకీయాలు కూడా అనుమాన రహితమైనవి ఏమీ కాదు. ఈ స్వతంత్రత లేదా స్వయం ప్రతిపత్తిలో దాస్తున్నది ఎంత, బయటపెడ్తున్నది ఎంత అన్న ప్రశ్న మిగిలే ఉంటుంది.
స్వతంత్రంగా వ్యవహరిస్తున్నామనే రాజకీయ పక్షాలు కూడా ఎన్నికల సమయంలో హఠాత్తుగా కూటములు ఏర్పాటు చేస్తుంటాయి. ఈ రాజకీయ పార్టీలు అణగారిన వర్గాల పక్షాన సరైన నిర్ణయమే తీసుకుంటున్నారని సరిపుచ్చుకోవచ్చు. అందువల్ల వీరి వ్యవహారం సవ్యమైందిగానే కనిపిస్తుంది.
అధికార పక్షాన్ని ఎదిరిస్తూ ఎన్నికలలో పోటీ చేసే ఈ పక్షాలు మహా కూటమిలో భాగంగా కాకుండా విడిగా పోటీ చేస్తుంటాయి. ఒక నియోజక వర్గం నుంచే కాకుండా రెండేసి నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తారు. ఈ ధోరణిని మూడు అంశాల ప్రాతిపదికగా పరిశీలించాలి.
మొదటిది – ఆచరణాత్మక దృష్టి నుంచి పరిశీలించడం. ఒక నియోజకవర్గం నుంచి… రెండేసి నియోజక వర్గాల నుంచి పోటీ చేయడమంటేనే ఈ పార్టీల బలాన్ని అనుమానించవలసి వస్తుంది. ఎన్నికలకు ముందు ఏర్పడే ఇలాంటి పార్టీలకు, కూటములకు నిజానికి అనేక నియోజక వర్గాలలో అంత బలం ఉండదు. బలహీనత కారణంగానే ఒకటి కన్నా ఎక్కువ సీట్ల నుంచి పోటీ చేస్తుంటారు. తమకు ఉన్న బలాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ నియోజక వర్గాలలో సాధారణంగా తమ ఓటర్లను పరిరక్షించుకోవాలనుకుంటారు.
రెండవది – ఈ స్వతంత్రత లేదా స్వయం ప్రతిపత్తి సెక్యులర్, ప్రగతి శీల శక్తులను ఏకం చేయడానికి విఘాతంగా మారుతుంది. ఎందుకంటే ఇలా విడిగా పోటీ చేయడంవల్ల మితవాద పక్షాలదే పై చేయి కావడానికి తోడ్పడుతుంది.
మూడవది – అందువల్ల విడిగా పోటీ చేసే పార్టీలపై విపరీత పరిణామాలు ఉంటాయి. ఈ పక్షాలను వెలి వేసినట్టు చూస్తారు. మరీ మాట్లాడితే వీటిని మచ్చ పడిన పక్షాలుగా భావిస్తారు. ఈ నాయకులు ఎన్నికల దృష్టితో చూస్తే స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటున్నట్టు కనిపించదు. ఈ ప్రభావం ఆ పార్టీల అనుచరుల మీద కూడా ఉంటుంది.
స్వయం ప్రతిపత్తి సుగుణమే అయ్యేటట్టయితే దానికి బాధ్యత కూడా ఉంటుంది. దాని పరిధి ఏమిటో గుర్తించాలి. కేవలం స్వతంత్రత లేదా స్వయం ప్రతిపత్తి వల్ల సమానత్వం, స్వేచ్ఛ, గౌరవం అన్న సమస్యలు పరిష్కారం కావు. స్వతంత్రత అన్న పరిభాష ఆ నాయకులకు కొంత మేర ఉపకరించవచ్చు. కొందరైనా వీరిని పట్టించుకోవచ్చు. ఎన్నికల బరిలో ఉండడంవల్ల కూడా పట్టించుకోవచ్చు.
దీనివల్ల వీరికి ఉండే బేరమాడే శక్తి పెరగొచ్చు కాని సామాజిక అంశాలలో జోక్యం చేసుకునే వారి శక్తి మాత్రం పెరగదు. స్వతంత్రత, స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడే వారు తీసుకునే నిర్ణయాలు పొరపాట్లకు సైతం దారి తీయవచ్చు. ఈ తప్పుల వల్ల కలిగే పరిణామాలకు వారే సమాధానం చెప్పవలసి వస్తుంది. స్వయం ప్రతిపత్తి గల రాజకీయాలకు విశ్వసనీయత ఉంటుందని ఈ నాయకులు వాదించనూ వచ్చు. అయితే రాజకీయ నిర్ణయాలలో జరిగే పొరపాట్లను వీరు అంగీకరించగలిగి ఉండాలి.
ఈ స్వయం ప్రతిపత్తి లేదా స్వతంత్రత ఆధారంగా తీసుకునే నిర్ణయాల ప్రభావం కేవలం వ్యక్తుల మీదే కాకుండా అణగారిన వర్గాల మీద కూడా ఉంటుంది. స్వయం ప్రతిపత్తి అణగారిన వర్గాల నాయకులపై సానుకూలంగా ఉంటే ఉండవచ్చు. కానీ ఉమ్మడి తత్వంపై వ్యతిరేక ప్రభావమూ ఉంటుంది. ఉపయోగం రీత్యా చూస్తే స్వయం ప్రతిపత్తి వ్యక్తులకు ఉపకరించవచ్చు. కానీ అణగారిన వర్గాల వారికి దీనివల్ల ఒరిగేది ఏమీ ఉండదు.
అణగారిన వర్గాల వారికి అట్టడుగు వర్గాల వారి విషయంలో ఇష్టానుసారం వ్యవహరించ అవకాశం ఉండకూడదు. స్వయం ప్రతిపత్తిని, స్వతంత్రతను దుర్వినియోగం చేస్తే ఇతర రాజకీయ పార్టీలతో కలవకుండా తామే అదో సాధించగలమనే అభిప్రాయం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది.
అణగారిన వర్గాలను తామే ఉద్ధరించగలమన్న అభిప్రాయం కూడా వారికి కలుగుతుంది. స్వయం ప్రతిపత్తి సంప్రదింపులకు దోహదపడాలే తప్ప సకల అవకాశాలకూ తలుపులు మూసేయ కూడదు. ఇది తిరోగమన రాజకీయాలను నిలవరించడానికి తోడ్పడదు. స్వయం ప్రతిపత్తి సూత్రాన్ని డా. బి.ఆర్. అంబేద్కర్ చాకచక్యంగా, సృజనాత్మకంగా వినియోగించుకున్నారన్న విషయాన్ని గమనించాలి.
(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)