అమ్మమ్మా... 73 ఏళ్ల అమ్మ!!

73 ఏళ్ల అమ్మ. మీరు కరెక్టుగానే చదివారు. అమ్మమ్మ అని రాయబోయి తప్పు రాశారనో…. నానమ్మ అని చెప్పబోయి ఓ అక్షరాన్ని ఎక్కువగా రాశారనో పొరబడొద్దు. నిజంగానే 73 వయసులో అమ్మ కాబోతోంది ఆ తల్లి. అర్ధ శతాబ్దం పాటు పిల్లల కోసం కలలు కన్న ఆ పెద్ద వారి కోరిక ఈ రోజే తీరబోతోంది. ఇదంతా ఎక్కడో ఖండతారాల్లోనో, మరో దేశం కాని దేశంలోనో అనుకుంటున్నారా. ఎక్కడో కాదు.. తెలుగు రాష్ట్ర్రంలోనే. అది కూడా గుంటూరులోనే. ఇంతకీ […]

Advertisement
Update:2019-09-05 03:10 IST

73 ఏళ్ల అమ్మ. మీరు కరెక్టుగానే చదివారు. అమ్మమ్మ అని రాయబోయి తప్పు రాశారనో…. నానమ్మ అని చెప్పబోయి ఓ అక్షరాన్ని ఎక్కువగా రాశారనో పొరబడొద్దు.

నిజంగానే 73 వయసులో అమ్మ కాబోతోంది ఆ తల్లి. అర్ధ శతాబ్దం పాటు పిల్లల కోసం కలలు కన్న ఆ పెద్ద వారి కోరిక ఈ రోజే తీరబోతోంది. ఇదంతా ఎక్కడో ఖండతారాల్లోనో, మరో దేశం కాని దేశంలోనో అనుకుంటున్నారా. ఎక్కడో కాదు.. తెలుగు రాష్ట్ర్రంలోనే. అది కూడా గుంటూరులోనే. ఇంతకీ విషయం ఏమిటో ముందు తెలుసుకుందాం.

తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపూడికి చెందిన రైతు యర్రమట్టి రామరాజారావుతో 1962 సంవత్సరంలో మంగాయమ్మకు వివాహమైంది. ఆనాటి నుంచి ఆ దంపతులు పిల్లల కోసం చేయని పూజలు లేవు. నోచని నోములు లేవు. తిరగని ఆసుపత్రీ లేదు. అయినా వారిని ఏ దేవుడూ కరుణించలేదు. మంగాయమ్మకు 73 సంవత్సరాలు రావడంతో ఇక పిల్లలు పుట్టరని నిర్ధారణకు వచ్చేశారు.

అంతే చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ద్వారా సంతానం పొందాలని నిర్ణయించుకున్నారు. ఈ పని కోసం అక్కడికి వెళ్లారు కూడా. అయితే వారి ఆశలు అక్కడ తీరలేదు. దీంతో వెనక్కి వచ్చేశారు.

కొన్నాళ్ల క్రితం గుంటూరులోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ మళ్లీ మరోసారి ఐవీఎస్ ప్రయత్నం చేశారు. ఆ దంపతుల ఆశలు ఫలించాయి. ఐవీఎస్ పద్దతిలో మంగాయమ్మ గర్భం దాల్చారు. అంతే ఆ రోజు నుంచి నేటి వరకూ మంగాయమ్మను ఆసుపత్రి వైద్యులు ప్రత్యేక గదిలో ఉంచి వైద్య సేవలు అందించారు.

మంగాయమ్మకు షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక రోగాలు ఏవీ లేకపోవడంతో కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెప్పారు. డాక్టర్ల పర్యవేక్షణలో ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇవన్నీ ఫలించి గురువారం నాడు మంగాయమ్మ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నది.

గురువారం ఉదయం గుంటూరులోని సదరు ఆసుపత్రిలో మంగాయమ్మకు ఆపరేషన్ చేసి పురుడు పోయనున్నామని ఆ ఆసుపత్రి డాక్టర్ చెబుతున్నాడు. ఇంత పెద్ద వయసులో ఓ బిడ్డకు జన్మనివ్వడం దేశంలో ఇది తొలిసారి అని డాక్టర్లు చెబుతున్నారు. ఏ వయసు అయినా అమ్మ… అమ్మే కదా…!

Tags:    
Advertisement

Similar News