ఇరాన్ విషయంలో అమెరికాకు దాసోహం

ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత వైఖరిని చూస్తే ఇంతవరకూ ఉన్న అనుమానాలు నిజమేనని తేలిపోయింది. ఈ ఆంక్షలను వ్యతిరేకించకపోగా అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికాకు అంటకాగాలని భారత్ ప్రయత్నిస్తోందని స్పష్టమైపోయింది. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి రెండు రకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి కనక ప్రభుత్వ వైఖరి అసందిగ్ధంగానే మిగిలిపోయింది. ఇరాన్ మీద ఆంక్షలు విధించినప్పుడు భారత్ కు, మరి కొన్ని దేశాలకు అమెరికా గతంలో ఇచ్చిన మినహాయింపులను ఉపసంహరించారు. దీనిపై మోదీ ప్రభుత్వంలో పెట్రోలియం […]

Advertisement
Update:2019-05-21 02:41 IST

ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత వైఖరిని చూస్తే ఇంతవరకూ ఉన్న అనుమానాలు నిజమేనని తేలిపోయింది. ఈ ఆంక్షలను వ్యతిరేకించకపోగా అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికాకు అంటకాగాలని భారత్ ప్రయత్నిస్తోందని స్పష్టమైపోయింది.

ఈ విషయంపై ప్రభుత్వం నుంచి రెండు రకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి కనక ప్రభుత్వ వైఖరి అసందిగ్ధంగానే మిగిలిపోయింది. ఇరాన్ మీద ఆంక్షలు విధించినప్పుడు భారత్ కు, మరి కొన్ని దేశాలకు అమెరికా గతంలో ఇచ్చిన మినహాయింపులను ఉపసంహరించారు. దీనిపై మోదీ ప్రభుత్వంలో పెట్రోలియం శాఖ మంత్రి ట్విట్టర్ లో ఒక సందేశం పెట్టారు. అందులో అమెరికా నిర్ణయం మీద ఒక్క మాట కూడా లేదు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందని మాత్రం చెప్పారు.

ఇదే అంశంపై విదేశాంగ మంత్రి కూడా మే 14వ తేదీన ఇరాన్ విదేశాంగ మంత్రితో సమావేశం అయిన సందర్భంగా ఎన్నికలు జరుగుతున్న తరణంలో కచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోయామని, కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అయితే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఆంక్షలను ఖండించలేదు.

భారత కంపెనీలు ఇరాన్ నుంచి చమురు కొనడం మానేశాయి. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నాయి. ఇరాన్ వ్యవహారం ఎలా పరిణమిస్తుందో గ్రహించడానికి ఎన్నికలు ముగిసేదాకా ఆగనవసరం లేదు. అమెరికా ఆంక్షలను భారత్ పూర్తిగా సమర్థిస్తోందని మాత్రం తేలిపోతోంది.

ఇరాన్ మీద డోనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలు ఏ అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా లేవు. ఇవి ఏకపక్షమైనవి. ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, అమెరికా దౌత్య, సైనిక అంచనాల ప్రకారం అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల భారత్ కు కలిగే ఏ ప్రయోజనమూ లేదు.

ఇరాన్ నుంచి భారత్ నెలకు 12 లక్షల టన్నుల చమురు దిగుమతి చెసుకుంటుంది. ఇది మొత్తం దిగుమతుల్లో పది శాతం. సౌదీ అరేబియా, ఇరాక్ తరవాత భారత్ కు భారీగా చమురు ఎగుమతి చేసే దేశం ఇరానే. ఇరాన్ తో వ్యాపారం వల్ల మనకు అనేక లాభాలున్నాయి. ఇరాన్ సరఫరా చేసే చమురు చౌకగా అందడంతో పాటు ఎక్కువ కాలం అరువు ఇస్తారు. భారత్ ఎక్కువ భాగం యూరోలలో ఇరాన్ కు డబ్బు చెల్లిస్తుంది. మిగతాది రూపాయలలో చెల్లిస్తుంది. అంటే అమెరికా డాలర్ మీద ఆధారపడవలసిన అవసరం లేదు. రూపాయల్లో చెల్లించే మొత్తంలో కొంత వస్తు రూపంలో కూడా ఉండేది. బియ్యం, ఔషధాలు, ఇతర వస్తువులు ఇరాన్ కు సరఫరా చేసేది.

మనకు అవసరమైన చమురులో 84 శాతం దుగుమతే చేసుకుంటాం. చమురు దిగుమతి కోసం మనం ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టాల్సి వస్తోంది. 2018-19లో 100 బిలియన్ డాలర్లు వెచ్చించాం. అందువల్ల చౌకగా, నికరంగా చమురు సరఫరా చేసే వారు ఉండాలి.

ఇప్పుడు సౌదీ అరేబియా నుంచో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచో దిగుమతి చేసుకోవలసి ఉంటుంది. ఇది భారత మార్కెట్ ను రెండు రకాలుగా దెబ్బ తీస్తుంది. వెనిజులా నుంచి చమురు దిగుమతి చేసుకోకూడదని అమెరికా చమురు కంపెనీలపై ఒత్తిడి చేస్తోంది. ఇరాన్, వెనిజులా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే భారత చమురు కంపెనీలకు లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఈ దేశాల నుంచి దిగుమతి నిలిపివేస్తే చమురు ధరలు పెరుగుతాయి. ఈ భారం చివరకు వినియోగదార్లే మోయాల్సి వస్తుంది. ఎన్నికల తరవాత ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది.

అమెరికా ఆంక్షలను సమర్థించడంవల్ల ఫర్జద్ బి గ్యాస్ క్షేత్రాలలో భారత్ కు ఏ అవకాశమూ లేకుండా పోతుంది. అమెరికాను సంతృప్తి పరచడానికి ప్రయత్నించడంవల్ల గత దశాబ్దంలో ఇరాను నుంచి గ్యాస్ పైప్ లైన్ నిర్మించే అవకాశం వదులుకున్నాం. మనం దిగుమతి చేసుకునే చమురులో ఎక్కువ భాగం పర్షియన్ సింధు శాఖ దేశాల నుంచె గనక అక్కడి పరిణామాల ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది.

మిగతా విషయాలలో ఇరాన్ తో సంబంధాలు ఎలా ఉంటాయో తెలియదు. ప్రతికూలత ఉండదని చెప్పలేం. అఫ్గానిస్థాన్, మధ్య ఆసియా, యూరప్ మధ్య భూ మార్గం ఏర్పాటు చేసే ప్రయత్నాలకూ గండి పడక తప్పదు. అరేబియా సముద్రంలో చాబహార్ రేవులో భారత్ ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టింది. పశ్చిమాసియాకు ఎగుమతులు పెంచడంలో ఇరాన్ కీలక పాత్ర నిర్వహించగలుగుతుంది.

వాస్తవ పరిస్థితుల కారణంగానే అమెరికా ఆంక్షలను భారత్ సమర్థించవలసి వస్తోందని వాదించే వారు ఉన్నారు. అమెరికా సరసన ఉండడంవల్ల మేలు కలుగుతుందంటారు. ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని నిలవరించడానికి అమెరికాకు భారత్ మద్దతు కీలకం. కానీ దీనికి ఎంత మూల్యం చెల్లించవలసి వస్తుందో మాత్రం ఆలోచించడం లేదు.

అంతర్జాతీయ రాజకీయాలలో ఇంతవరకు మనం వివిధ దేశాల సార్వభౌమాధికారాన్ని, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను గౌరవిస్తూ వచ్చాం. ఇప్పుడు మాత్రం అమెరికాను సంతృప్తి పరచడానికి ఈ విధానాలకు తిలోదకాలిచ్చాం. అమెరికాను సమర్థించడంవల్ల మన విదేశాంగ విధాన లక్ష్యాలు ఏవీ సాధించలేం. పైగా మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి విషయంలో రాజీ పడుతున్నాం. నిరంతరం అమెరికాను సమర్థించడంవల్ల ప్రాంతీయంగా, అంతర్జాతీయ రాజకీయాల్లో మనకు ఉన్న అవకాశాలు చేజారిపోతాయి. సామ్రాజ్యవాద కుట్రలను సమర్థించినట్టవుతుంది.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

Tags:    
Advertisement

Similar News