ప్రజాస్వామ్యంలో వినమ్రత

ఈ సార్వత్రిక ఎన్నికలలో అహంకార, విద్వేషపూరిత ధోరణులు రాజ్యమేలాయి. ఎన్నికల ప్రచార క్రమంలో తరతమ భేదాలతో అన్ని పార్టీల నాయకులు ఈ ధోరణి ప్రదర్శించారు. ఈ వైఖరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకుల్లో మరింత ఎక్కువ కనిపించింది. తప్పు చేసిన వారిని అదుపు చేయడానికి ఎన్నికల కమిషన్ ప్రయత్నించినా ఇదే ధోరణి కొనసాగింది. ఎన్నికల కమిషన్ నైతికంగా దుందుడు వైఖరికి కళ్లెం వేయడానికి ప్రయత్నించినా అందులో వివక్ష కనిపించింది. తీసుకున్న చర్యలు కూడా చాలా పరిమితం. […]

Advertisement
Update:2019-05-12 00:32 IST

ఈ సార్వత్రిక ఎన్నికలలో అహంకార, విద్వేషపూరిత ధోరణులు రాజ్యమేలాయి. ఎన్నికల ప్రచార క్రమంలో తరతమ భేదాలతో అన్ని పార్టీల నాయకులు ఈ ధోరణి ప్రదర్శించారు. ఈ వైఖరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకుల్లో మరింత ఎక్కువ కనిపించింది. తప్పు చేసిన వారిని అదుపు చేయడానికి ఎన్నికల కమిషన్ ప్రయత్నించినా ఇదే ధోరణి కొనసాగింది.

ఎన్నికల కమిషన్ నైతికంగా దుందుడు వైఖరికి కళ్లెం వేయడానికి ప్రయత్నించినా అందులో వివక్ష కనిపించింది. తీసుకున్న చర్యలు కూడా చాలా పరిమితం. పరుషమైన భాష వాడేవారిని కట్టడి చేయడానికి తనకున్న అధికారాలను వినియోగించడంలో ఎన్నికల కమిషన్ తటపాటాయించింది. కొన్ని సందర్భాలలో చర్య తీసుకోవడానికి ఇష్టపడనే లేదు. భావప్రకటనా స్వేచ్ఛను అవసరమైనప్పుడు పరిమితం చేయడం ఎన్నికల కమిషన్ బాధ్యత. కొంత మంది ప్రచారాన్ని కట్టడి చేసినా శక్తిమంతమైన నాయకుల మీద ఏ చర్యా తీసుకోలేదు.

విద్వేషం, అహంకారం కేవలం ప్రత్యర్థుల మీదే కాకుండా మర్యాదకరమైన సమాజం ఉండాలని కోరుకునే వారి మీద కూడా దుష్ప్రభావం చూపుతుందని ఈ నాయకులు ఎందుకు అనుకోవడం లేదన్నది అసలు ప్రశ్న. అహంకారం, విద్వేషం లాంటి “సామాజిక రుగ్మత”లను అదుపు చేయడంలో వినయానికి ఉన్న విలువ ఎలాంటిది?

వినయం నిరంతరం ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి తోడ్పడుతుంది. ఆత్మ పరిశీలన రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో ప్రదర్శించే దర్పాన్ని అదుపు చేయగలుగుతుంది. వినయం విద్వేషాన్ని, దుర్భాషను తగ్గిస్తుంది. ఇది సుగుణం. వినయం ఉంటే ఇష్టానుసారం మాట్లాడడానికి వీలుండదు.

మన దేశంలోని పరిస్థితుల ప్రకారం వినయంగా ఉండడం అంటే భిన్నాభిప్రాయలను, అసమ్మతిని సహించడం. భిన్నత్వాన్ని గౌరవించడం. వినమ్రత ఆరోగ్యకరమైన రాజకీయ సంవాదానికి అవకాశం కల్పిస్తుంది.

నాయకులకు పరిమితమైన విషయాలకే కాకుండా ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించేటప్పుడు మెరుగైన రాజకీయ సంస్కృతికి దోహదం చేస్తుంది. విభిన్నమైన భావాలను వ్యక్తం చేయడంలో ప్రజాస్వామ్యం వినయానికి చోటిస్తుంది.

వినమ్రత సుగుణమే కానీ అది అనవలసిన మాటలన్నీ అన్న తరవాత నాలుక కరచుకోవడం కాకూడదు. నిజమైన వినయం ఎన్నికల ప్రచార వేళ మాత్రమే కాకుండా అన్ని వేళలా కనిపించాలి. వినయం నటిస్తే సరిపోదు. వినయం ప్రదర్శించకపోతే ఎదుటివారు అవమానం భరించవలసి ఉంటుంది. గత రెండు నెలల కాలంగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో వినయం కనుమరుగైందా అన్న అనుమానం వస్తోంది.

దేశం సాధించిన విజయాలు చూసి గర్వపడడం మానవ సంక్షేమం ఆధారంగా ఉండాలి. సరిహద్దులో సైన్యం సాధించిన విజయాలు ఎవరి సొత్తూ కావు. అధికారంలో ఉన్న వారి సొత్తు అసలే కాదు. దీన్ని రాజకీయ ప్రయోజనాలకోసం వినియోగిస్తే “దురహంకార పూరిత జాతీయతావాదం” పెచ్చరిల్లుతుంది. జాతీయతావాదంలో దురహంకారానికి చోటిస్తే వినమ్రతతో కూడిన ప్రజాస్వామ్యం కనిపించదు.

అహంకారం మీద వినమ్రత ఎందుకు విజయం సాధించదు? ఎందుకంటే ఇలాంటి నాయకులు విజయం తమ ఒక్కరిదే అని భావిస్తారు. అందరి సంక్షేమం వారికి పట్టదు. సమాజం మర్యాదగా ఉండాలని అనుకోరు. అంతా తమ హక్కే అనుకోవడంవల్ల వినమ్రత మాయమవుతుంది. సమాజంలో కొంత మంది సర్వం తమ హక్కు అనుకుంటున్నారు.

అలాంటివారిలోనే విపరీతమైన అహంకారం, అనవసరమైన గర్వం కనిపిస్తుంది. ఇలాంటి వారు ఇతరులకన్నా తమకే ఎక్కువ హక్కులు ఉన్నాయనుకుంటారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్.డి.ఎ.)ని సమర్థించే వారిలో ఈ ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దేశం మీద తమకే హక్కు ఉందని, ఇతరులకు ఏ హక్కూ లేదని భావిస్తున్నారు.

“పాకిస్తాన్ కు వెళ్లిపోండి” అన్న మాటను హిందుత్వవాదులు పదే పదే వాడుతుంటారు. వీరు ప్రజాస్వామ్య సంస్కృతికి విఘాతం కలిగిస్తారు. ఈ దేశాన్ని పరిపాలించే అధికారం మరెవరికీ లేదు అనుకునే వారికి వినయం ఉండదు. తాము చేసిన తప్పును ప్రత్యర్థుల మీదికి తోస్తారు. గతంలో జరిగిన తప్పులన్నింటికీ ప్రత్యర్థులదే బాధ్యత అని వాదిస్తారు.

ఇలాంటి ధోరణి మర్యాద పూర్వకమైన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి తోడ్పడదు. తమ తప్పుకు మరొకరిని బాధ్యులను చేస్తారు కనక కనీసం ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు.

వినమ్రత పాటించనందువల్ల దేశంలో భిన్నత్వ సంప్రదాయానికి విఘాతం కలుగుతోంది. విద్వేష పూరిత ప్రసంగాలను ప్రభుత్వ వ్యవస్థల ద్వారా అదుపు చేయడం కాదు వినమ్రత అనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని అనుసరించడవల్లే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

(ఎకనామిక అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

Tags:    
Advertisement

Similar News