బీజేపీ ఓటమి కాంగ్రెస్ సంబరం కాకూడదు

ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ శాసనసభలకు జరిగిన ఎన్నికలలో ప్రజలు భారతీయ జనతా పార్టీని తిరస్కరించడం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరాకరించడానికి నిదర్శనం. ఈ రాష్ట్రాలలో బీజేపీ ఓడిపోవడానికి స్థానిక అంశాలే కారణమని బీజేపీ ప్రచారకర్తలు ఎంత ఊదరగొట్టినా మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయాలపై తప్పని సరిగా ఉంటుంది. వ్యవసాయ రంగ సంక్షోభం, నిరుద్యోగం, జీవనోపాధులు కోల్పోవడం మొదలైన వాటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం అనుసరించిన పెద్ద నోట్ల రద్దు, వస్తు […]

Advertisement
Update:2019-01-06 00:32 IST

ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ శాసనసభలకు జరిగిన ఎన్నికలలో ప్రజలు భారతీయ జనతా పార్టీని తిరస్కరించడం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరాకరించడానికి నిదర్శనం. ఈ రాష్ట్రాలలో బీజేపీ ఓడిపోవడానికి స్థానిక అంశాలే కారణమని బీజేపీ ప్రచారకర్తలు ఎంత ఊదరగొట్టినా మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయాలపై తప్పని సరిగా ఉంటుంది.

వ్యవసాయ రంగ సంక్షోభం, నిరుద్యోగం, జీవనోపాధులు కోల్పోవడం మొదలైన వాటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం అనుసరించిన పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.), వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడమే ప్రధాన కారణం. ఈ రాష్ట్రాలలో బీజేపీ దుష్పరిపాలన కూడా ఓటమికి కారణం అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుసరించిన అపసవ్య విధానాలు ఓటమికి బాగా దోహదం చేశాయి. ప్రజల సమస్యలు పరిష్కరించలేక ఆర్.ఎస్.ఎస్., బీజేపీ తమకు బాగా అలవాటైన విద్వేష రాజకీయాల పేర ప్రజలను సమీకరించడం మొదలుపెట్టాయి.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో విస్తృతంగా ప్రచారం చేయడం ఇందులో భాగమే. అయితే ఈ రకమైన విద్వేష ప్రచారం జనానికి మింగుడుపడలేదు. ఆదిత్యనాథ్ ప్రచారం ఈ రాష్ట్రాలలో నిజానికి వికటించింది. గత నాలుగు సంవత్సరాల కాలంలో గోరక్షణ పేరిట మూక దాడులకు దిగిన ఆల్వార్ ప్రాంతంలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది.

తెలంగాణలో కూడా ఆదిత్యనాథ్ మతతత్వ దృష్టితో ప్రచారం చేశారు. అక్కడా బీజేపీ బలం గణనీయంగా తగ్గింది. నరేంద్ర మోదీ అధమ స్థాయి ప్రచారాన్ని కూడా ప్రజలు మెచ్చలేదు. దిక్కు తోచకే మోదీ ఈ రకమైన ప్రచారానికి దిగారు.

వాస్తవాన్ని అంగీకరించకుండా పెడదారి పట్టించడం సంఘ్ పరివార్ కు అలవాటైన విషయమే కనక ఓటమి అంత అవమానకరమైంది కాదు అని చెప్పడానికి రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో స్వల్ప తేడాతో ఓడిపోయామని చెప్తున్నారు. అయితే ఓట్లకు సంబంధించినంత మేరకు కాంగ్రెస్ కు, బీజేపీకి వచ్చిన ఓట్ల మధ్య తేడా కిందటి సారి ఎన్నికలలాగానే ఉంది.

అయితే బీజేపీకి ఎక్కువ నష్టం కలిగింది. వ్యాఖ్యానాలు ఎలా ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ బీజేపీని ఓడించింది. రాజస్థాన్ లో రెండు పార్టీల మధ్య ఉన్న తేడాను చాలా వరకు అధిగమించగలిగింది. కాంగ్రెస్ సాధించిన మెజారిటీ మాట ఎలా ఉన్నా 2014 ఎన్నికలలో ఈ మూడు రాష్ట్రాలలో ఉన్న మొత్తం 65 లోకసభ స్థానాలలో 62 సాధించిన బీజేపీ ఇప్పుడు మూడు చోట్లా అధికారం కోల్పోయింది.

పట్టణ ప్రాంతాలలోనూ బీజేపీకి మద్దతు గణనీయంగా తగ్గింది. నిజానికి గ్రామీణ ప్రాంతాలలోకన్నా పట్టణ ప్రాంతాలలో బీజేపీకి ఉన్న అండ బాగా తగ్గింది. నిరుద్యోగం, జి.ఎస్.టి. వల్ల ప్రతికూల ప్రభావం వల్ల చిన్న వ్యాపారులు కూడా పట్టణాలలో బీజేపీని సమర్థించలేదు.

ఏమైనప్పటికీ కాంగ్రెస్ సాధించిన విజయం మహత్తరమైంది ఏమీ కాదు. ఎందుకంటే బీజేపీ మీద అంత అసంతృప్తి, ప్రజల ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్న స్థితిలో కాంగ్రెస్ మరింత మెరుగైన ఫలితాలు సాధించవలసింది. ఒక్క ఛత్తీస్ గఢ్ లో మాత్రమే కాంగ్రెస్ తిరుగులేని విజయం సంపాదించింది. మూడింట రెండు వంతుల సీట్లు సంపాదించగలిగింది.

మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఇంకా పలుకుబడి ఉంది అని విజయవంతంగా నమ్మబలికినందువల్ల, చివరి దశలో రాజస్థాన్ లో మోదీ చెమటోడ్చి ప్రచారం చేసినందువల్ల కాంగ్రెస్ గొప్ప విజయం సాధించలేకపోయింది. సంస్థాగతమైన బలహీనత కూడా కాంగ్రెస్ గొప్ప విజయం సాధించలేకపోవడానికి కారణం. నిజానికి ప్రజల జీవితాల మీద, కొరవడుతున్న జీవనోపాధివంటి అంశాల మీద కాంగ్రెస్ గట్టిగా ప్రచారం చేయడంలో విఫలమైంది.

ఛత్తీస్ గఢ్ లో మాత్రం కాంగ్రెస్ ఈ అంశాలను బాగా ప్రచారం చేయగలిగింది. రాజస్థాన్ లోనూ, మధ్యప్రదేశ్ లోనూ వామపక్ష పార్టీల, ప్రజా సంఘాల నాయకత్వంలో జరిగిన రైతు ఉద్యమాలు కాంగ్రెస్ విజయానికి తోడ్పడ్డాయి. రెండు పార్టీల మధ్య ప్రధానమైన పోటీ ఉండడం కాంగ్రెస్ కు ఉపకరించింది.

బీజేపీ ఓటమి పాలై ఉండవచ్చు కాని మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఆ పార్టీ ఓట్ల శాతం, సామాజిక పునాది అంతగా చెక్కు చెదరలేదు కనక కాంగ్రెస్ మరీ సంబరపడిపోవలసింది ఏమీ లేదు. బీజేపీ పుంజుకోవడానికి అవకాశం ఉంది. ప్రజల జీవన పరిస్థితిని మెరుగుపరచడానికి, సామాజిక సుస్థిరత సాధిస్తామని హామీ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించగలగాలి.

గ్రామీణ ప్రజల ఇబ్బందులను దూరం చేయడమే కాకుండా గోరక్షకుల పేరిట సంఘ్ పరివార్ గూండాల ఆగడాలకు కాంగ్రెస్ అడ్డుకట్ట వేయగలగాలి. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు ముందు సంఘ్ పరివార్ ఇలాంటి దౌర్జన్యకర కార్యకలాపాలకు మరింతగా పాల్పడే అవకాశం ఉంది.

మూడు రాష్ట్రాలలో సాధించిన విజయం ఆసరాగా కాంగ్రెస్ ఈ ఆగడాలను నిరోధించడానికి తగిన విధానాలు అనుసరించాలి. రాజకీయ రంగంలో ప్రజలను ప్రధాన పాత్రధారులను చేయగలగాలి. రాజకీయాలు విధానాల మీద కేంద్రీకృతమై ఉండాలి తప్ప, నాయకుల చుట్టూ తిరగకూడదు. సార్వత్రక ఎన్నికలలో ఇది చాలా అవసరం.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

Tags:    
Advertisement

Similar News