రుతుక్రమానికి మతానికి ఏమిటి సంబంధం!
ఒక ఆరోగ్యకరమైన శారీరక ధర్మాన్ని మతం కోణంలో చూడాల్సిన అవసరం ఏముందో చెప్పాలని కొంతమంది విద్యార్థులు సుప్రీంకోర్టుకి పెట్టుకున్న పిటీషన్లో అడిగారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షల తాలూకూ కేసుని విచారిస్తున్న, ప్రత్యేక ధర్మాసనం న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ పిటీషన్‌ని పరిగణనలోకి తీసుకున్నారు. రుతుక్రమం చుట్టూ అల్లుకుని ఉన్నఛాందస భావజాలాన్ని పటాపంచలు చేసేందుకు హ్యాపీ టు బ్లీడ్ పేరుతో ఈ విద్యార్థులు కృషిచేస్తున్నారు. ఈ ఆధునిక కాలంలో కూడా ఒక సహజ శారీరక […]
ఒక ఆరోగ్యకరమైన శారీరక ధర్మాన్ని మతం కోణంలో చూడాల్సిన అవసరం ఏముందో చెప్పాలని కొంతమంది విద్యార్థులు సుప్రీంకోర్టుకి పెట్టుకున్న పిటీషన్లో అడిగారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షల తాలూకూ కేసుని విచారిస్తున్న, ప్రత్యేక ధర్మాసనం న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ పిటీషన్‌ని పరిగణనలోకి తీసుకున్నారు. రుతుక్రమం చుట్టూ అల్లుకుని ఉన్నఛాందస భావజాలాన్ని పటాపంచలు చేసేందుకు హ్యాపీ టు బ్లీడ్ పేరుతో ఈ విద్యార్థులు కృషిచేస్తున్నారు.
ఈ ఆధునిక కాలంలో కూడా ఒక సహజ శారీరక ధర్మం కారణంగా మహిళలు వివక్షని భరించాల్సిందేనా…ఈ విషయంమీద సమాజానికి కోర్టు నిర్ణయం, తీర్పు ఏమిటో తెలపాలని ఆ విద్యార్థులు కోరారు. సమానత్వం, మహిళల ఆరోగ్యం ఈ రెండూ రాజ్యాంగ హక్కులై ఉన్నపుడు ఈ వివక్ష ఏమిటని, వారు తమ పిటీషన్లో ప్రశ్నించారు.
విద్యార్థుల తరపున ఇందిరా జైసింగ్ కోర్టుకు హాజరయ్యారు. మహిళల హక్కులను పేర్కొన్న రాజ్యాంగంలోని 14, 15 ఆర్టికల్స్‌ని లెక్కచేయకుండా ఇలాంటి నిబంధనలు విధించడం న్యాయం కాదని విద్యార్థులు తమ ఆవేదనని వ్యక్తం చేశారు. దేవస్థానం అధికారులు సైతం దీన్ని సమంజసంగా భావించడంపై తమ అభ్యంతరాన్ని తెలియజేశారు.
ఇంతకుముందు ఇదే కేసుని విచారించిన సమయంలో జస్టిస్ మిశ్రా, మతం ముసుగులో స్త్రీల పట్ల కొనసాగుతున్న వివక్షపై తీవ్రమైన వ్యాఖ్యానాలు చేశారు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతర మతగ్రంథాలు వేటిలో అయినా పురుషులు, స్త్రీలకు మధ్య ఇలాంటి వివక్ష ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆధ్యాత్మికత అనేది పురుషులకు మాత్రమే సంబంధించిన అంశమా…దానిపై వారికి మాత్రమే హక్కు ఉందా….మహిళలకు ఆధ్యాత్మిక సాధన చేతకాదని అనుకుంటున్నారా అంటూ న్యాయమూర్తి ఘాటుగా ప్రశ్నించారు.