ఓ సంస్కారి జీవిత చరిత్ర   

అటల్ బిహారీ వాజపేయి 1957లో లోక సభలో ప్రవేశించినప్పుడు భారతీయ జన సంఘ్ పెద్ద పార్టీ కానందువల్ల ఆ పార్టీ సభ్యులు ఎక్కువ సేపు మాట్లాడడానికి అవకాశం వచ్చేది కాదు. మహా అయితే అయిదు నిమిషాల వ్యవధి మాత్రమే దొరికేది. ఆ తక్కువ సమయంలోనే వాజపేయి తన వాక్పటిమను ప్రదర్శించే వారు. వాజపేయి సభలో ప్రసంగించినప్పుడు అప్పటి ప్రధాన మంత్రి శ్రద్ధగా వినే వారు. విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు వారి గౌరవార్థం ఇచ్చే విందులకు నెహ్రూ ప్రతిపక్షంలో […]

Advertisement
Update:2016-09-06 12:26 IST

అటల్ బిహారీ వాజపేయి 1957లో లోక సభలో ప్రవేశించినప్పుడు భారతీయ జన సంఘ్ పెద్ద పార్టీ కానందువల్ల ఆ పార్టీ సభ్యులు ఎక్కువ సేపు మాట్లాడడానికి అవకాశం వచ్చేది కాదు. మహా అయితే అయిదు నిమిషాల వ్యవధి మాత్రమే దొరికేది. ఆ తక్కువ సమయంలోనే వాజపేయి తన వాక్పటిమను ప్రదర్శించే వారు. వాజపేయి సభలో ప్రసంగించినప్పుడు అప్పటి ప్రధాన మంత్రి శ్రద్ధగా వినే వారు. విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు వారి గౌరవార్థం ఇచ్చే విందులకు నెహ్రూ ప్రతిపక్షంలో ఉన్న వాజపేయిని కూడా ఆహ్వానించే వారు. ఒక సందర్భంలో బ్రిటిష్ ప్రధాన మంత్రికి వాజపేయిని పరిచయం చేస్తూ “ఇతను యువ ప్రతిపక్ష నాయకుడు. ఎప్పుడూ నన్ను విమర్శిస్తుంటాడు. కాని ఇతనికి మంచి భవిష్యత్తు ఉంది” అన్నారు. మరో సందర్భంలో “భవిష్యత్తులో ప్రధాన మంత్రి కాగలిగిన సత్తా వాజపేయికి ఉంది” అని నెహ్రూ చెప్పారు.

నెహ్రూ మాట 1996లో నిజమైంది. మెజారిటీ నిరూపించుకోలేక పోయినందువల్ల వాజపేయి ప్రధాన మంత్రిగా 13 రోజులు మాత్రమే ఉండగలిగారు. అయితే 1998లో వాజపేయి రెండో సారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 13 నెలలపాటు కొనసాగారు. 1999లో మూడో సారి ప్రధాన మంత్రి అయి పూర్తి కాలం పదవిలో కొనసాగిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగా రికార్డు సాధించారు.

ఆరు దశాబ్దాల కన్నా ఎక్కువ కాలం వాజపేయి రాజకీయాల్లో ఉన్నప్పటికీ, మొదట భారతీయ జనసంఘ్, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధినేతగా కొనసాగినప్పటికీ ఎందుకనో ఆయన జీవిత చరిత్రలు రాసిన వారు తక్కువే. వాజపేయి తన జీవిత విశేషాలను, అనుభవాలను గ్రంథస్తం చేయలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో పని చేసే కింగ్షుక్ నాగ్ “అటల్ బిహారీ వాజపేయి-ఎ మాన్ ఫర్ ఆల్ సీజన్స్” పేర వాజపేయి జీవిత చరిత్ర రాశారు. నాగ్ పత్రికా రచనతో పాటు సాహిత్య రచనలోనూ అనుభవజ్ఞులు. సాఫ్రాన్ టైడ్ అన్న ఆయన గ్రంథం బాగా ప్రచారంలోకి వచ్చింది. సాఫ్రాన్ టైడ్ గ్రంథం రాస్తున్న దశలోనే రూపా పబ్లికేషన్స్ వాజపేయి జీవిత చరిత్ర రాయమని నాగ్ ను పురమాయించింది. వాజపేయి జీవిత చరిత్ర రాయడానికి ముందే నాగ్ 2002లోనే నరేంద్ర మోదీ జీవిత చరిత్ర నమో స్టోరీ రాశారు. అయితే అది ప్రచురితమైంది మాత్రం 2013 లోనే. 2012 లోనే నాగ్ సత్యం రామలింగ రాజు మీద ది డబుల్ లైఫ్ ఆఫ్ రామలింగ రాజు వెలువరించారు. అదే సంవత్సరం బాటిల్ గ్రౌండ్ తెలంగాణ కూడా ప్రచురించారు. ఈ ఒక్క గ్రంథం మినహా నాగ్ రచనలన్నీ బీజేపీకి సంబంధించినవే.

అటల్ బిహారీ వాజపేయి వ్యక్తిత్వం బహుముఖీనమైంది. విశిష్టమైంది. ఆయనను సగటు బీజేపీ నాయకుడిగా పరిగణించలేం. సంఘ్ పరివార్ సిద్దాంతానికి చిరకాలంగా కట్టుబడి ఉన్నప్పటికీ సుధీర్ఘ రాజకీయ జీవితంలో తన వైరి పక్షాల వారి మన్ననలు కూడా పొందారు. ఆయన అద్వితీయమైన వ్యక్తి. మొదటి సారి పార్లమెంటుకు ఎన్నికైనప్పుడు ఆయన ప్రసంగ ధోరణిని గమనించిన అప్పటి లోక సభ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ ఇంగ్లీషు ప్రసంగాలకు లోక్ సభలో హిరేన్ ముఖర్జీ పెట్టింది పేరైతే హిందీ ప్రసంగాలకు వాజపేయి అద్వితీయుడు అని వ్యాఖ్యానించారు.

దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ ప్రసాద్ ముఖర్జీ అనుచరుడిగా రాజకీయ ప్రస్థానం కొనసాగించిన వాజపేయి బీజేపీకి మారు పేరుగా మారి పోయారు. ఆయన రాజకీయ రంగం నుంచి నిష్క్రమించేదాకా మేటి రాజకీయవేత్తగా చెరగని ముద్ర వేశారు. దేశ రాజకీయాల్లోనూ, ముఖ్యంగా సంఘ్ పరివార్ రాజకీయాలలోనూ ఆయనది విశిష్ట శైలి. తన రాజకీయ అభిప్రాయాలతో విభేదించే వారితోనూ సఖ్యతగా ఉండడం ఆయన వ్యక్తిత్వంలోని ప్రత్యేకత. ఈ కలివిడితనం ఎంత దాకా వెళ్లిందంటే వాజపేయి బీజేపీలో ఉండకూడని వ్యక్తి అనే దాకా వెళ్లింది.

విదేశాంగ విధానం మీద వాజపేయికి ముందు నుంచి అపారమైన ఆసక్తి ఉంది. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జనతా పార్టీ కేంద్రంలో అధికారం వచ్చినప్పుడు ఆయనే విదేశాంగ శాఖ మంత్రి. పాకిస్తాన్ తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లాహోర్ బస్సు యాత్ర చేపడ్తే ఆయన సొంత పార్టీవారే వ్యతిరేకించినా వాజపేయి వెనుకాడలేదు. 1999 ఫిబ్రవరి 21న లాహోర్ లోని మినార్-ఎ-పాకిస్తాన్ దగ్గర ప్రసంగించి ‘పాకిస్తాన్ అస్తిత్వాన్నే అంగీకరించని భారత్ తో చర్చించి ఏం లాభం’ అని నసిగేవారిని కూడా నిరుత్తరులను చేశారు. పాకిస్తాన్ అస్తిత్వాన్ని అంగీకరించడంలోనే ఆయన రాజనీతిజ్ఞత ఇమిడి ఉంది. వాజపెయి ప్రసంగం తర్వాత జమాత్-ఎ-ఇస్లామీ వారు ఆ మినార్ ను గులాబీ నీళ్లతో శుద్ధి చేయడం ఓ వైపరీత్యం. లాహోర్ బస్సు యాత్ర ద్వారా వాజపేయి సాధించిన ఫలితాన్ని కార్గిల్ యుద్ధానికి తలపడడం ద్వారా పాకిస్తాన్ వమ్ము చేసింది. అయినా వాజపేయి పాకిస్తాన్ తో శాంతి కోసం కృషి చేసి జనరల్ ముషరఫ్ ను ఆగ్రా చర్చలకు ఆహ్వానించారు. ఈ చర్చలు కడకు బెడిసిపోయినా ఆ ప్రయత్నం అటల్జీ చిత్త శుద్ధికి నిదర్శనం. బీజేపీలో ఉన్న అంతర్గత వైరుధ్యాలు కూడా ఆగ్రా చర్చలు విఫలం కావడానికి కారణం అన్న వాదనలూ ఉన్నాయి.

ఇతర పక్షాల నాయకులంటే వాజపేయికి గౌరవం. అయినా అవసరమైనప్పుడు ఉద్దండులనూ నిలదీయడానికి జంకలేదు. నెహ్రూ వాజపేయిని అభిమానించే వారు. అటల్జీకి నెహ్రూ మీద అపారమైన గౌరవం ఉండేది. కాని ప్రధానిని నిలదీయాల్సి వచ్చినప్పుడు వాజపేయి తన ధర్మాన్ని నిర్మొహమాటంగా నిర్వహించారు. ఇందిరా గాంధీ స్వర్ణ దేవాలయం మీద సైనిక చర్యకు పాల్పడడానికి ముందు వాజపేయి సలహా అడిగారు. ఆయన ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఇందిరా గాంధీ ఆ సలహాను చెవికెక్కించుకో లేదు. ఆ సైనిక చర్యే చివరకు ఇందిరా గాంధీ ప్రాణాలనే కబళించిందన్నది చరిత్రే. ఇందిర మరణం తర్వాత దిల్లీలో సిక్కుల మీద ఉధృతంగా దాడులు జరిగినప్పుడు తన ఇంటి సమీపంలో సిక్కుల మీద దాడి చేయడానికి వచ్చిన అల్లరి మూకలను స్వయంగా నివారించడమే కాక వారు నిష్క్రమించే దాకా అక్కడే కదలకుండా నిలబడ్డ కార్యవాది వాజపేయి.

ప్రత్యర్థులను కూడా గౌరవించడం వాజపేయి సంస్కారం. కాని ప్రతిపక్షాల వారు హద్దు మీరి మాట్లాడిన సందర్భంలో దీటుగానే సమాధానం చెప్పే వారు. “మీరు ఆర్.ఎస్.ఎస్. ఒత్తిడికి లొంగి వ్యవహరిస్తున్నారు” అని సోనియా గాంధీ పార్లమెంటులో ఆరోపించినప్పుడు వాజపేయి ఇచ్చిన సమాధానాన్ని కింగ్షుక్ నాగ్ ఈ గ్రంథంలో కళ్లకు కట్టినట్టు వివరించారు. “నేను ఎవరి ఒత్తిడికీ లొంగి పని చేయను. ఒత్తిడికి లొంగి అణు పరిక్షలను వాయిదా వేసింది మీ పార్టీయే. అణుపరిక్షలకు తేదీలు ఖరారై సర్వం సిద్ధమైన తర్వాత విదేశీ ఒత్తిడికి లొంగి వాయిదా వేసింది మీరే. సంఘ్ పరివార్ గురించి నాకు చెప్పడానికి మీరెవరు? అది మా అంతర్గత వ్యవహారం. ఈ విషయంలో జోక్యం చేసుకోకండి” అని మందలించే స్థాయిలో మాట్లాడగలిగిన దిట్ట వాజపేయి.

ఒక సందర్భంలో వాజపేయి పార్లమెంటులో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ ను తీవ్రంగా దుయ్యబట్టారు. దీనికి మనస్తాపం చెందిన మన్మోహన్ రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని, అయితే అప్పటి ప్రధాని పీవీ నరసింహా రావు వాజపేయికి ఫోన్ చేసి మన్మోహన్ ను శాంతింప చేయాలని కోరితే ఏ మాత్రం భేషజం లేకుండా వాజపేయి తన ఔదార్యాన్ని ప్రదర్శించారు. వాజపేయికి భారత రత్న ఇవ్వాలని బీజేపీ మొట్టమొదటి సారి 2008లో కోరిందని, ఆ తర్వాత 2010లో మళ్లీ ఈ విషయం అడిగిందని, అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అనుకూలంగానే ఉన్నా సోనియా గాందీ వ్యతిరేకించారని నాగ్ రాశారు. యూపీఏ అధికారంలో ఉన్నన్నాళ్లు వాజపేయికి భారత రత్న ఇవ్వనే లేదు. 2014 ఆగస్టు 15న అటల్జీకి భారత రత్న ప్రకటిస్తారనుకున్నా అదీ జరగలేదు. కాని వాజపేయి జన్మ దినమైన డిసెంబర్ 25న భారత రత్న ప్రదానం చేయాలని మోదీ నిర్ణయించి రాష్ట్రపతి అనుమతితో ప్రదానం చేశారు. కాని అప్పటికే వాజపేయి అల్జిమీర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. తనకు భారత రత్న వచ్చిన విషయాన్ని ఆయన గుర్తించగలిగే అవకాశం లేకుండా పోయింది.

సంకీర్ణ ప్రభుత్వాలు రాష్ట్రాల స్థాయిలో 1967లోనే మొదలయ్యాయి. తొమ్మిది రాష్ట్రాలలో సంయుక్త విధాయక్ దళ్ మంత్రివర్గాలు ఏర్పాటయ్యాయి. కాని ఆ ప్రయోగమూ మధ్యలోనే వికటించింది. ఆ తర్వాత ప్రతిపక్షాలన్ని ఏకమై 1977లో జనతా పార్టీగా అవతరించి కేంద్రంలో సంకీర్ణ ప్రయోగం చేశాయి. అదీ అర్ధంతరంగానే ముగిసింది. రెండో సారి వాజపేయి నాయకత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వమూ 13 నెలలకే ముగిసింది. ఆ తర్వాతే ఒంటరిగా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని గుర్తించిన వాజపేయి మూడో సారి ప్రధాన మంత్రి అయినప్పుడు 24 పార్టీలను కూడదీసి నిరాఘాటంగా అయిదేళ్లు అధికారంలో కొనసాగగలిగారు. సంకీర్ణ ప్రభుత్వాలను దక్షతతో నిర్వహించడంలో జ్యోతిబసు తర్వాత చెప్పాల్సింది నిస్సందేహంగా వాజపేయి పేరే. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి రాగలిగినా ఆ ముచ్చట రెండు సార్లూ రెండేళ్లకే ముగిసింది. జ్యోతి బసు నడిపిన సంకీర్ణ ప్రభుత్వాలు భావ సారూప్యతగల వామపక్ష పార్టీల అండతోనే. కాని వాజపేయి కాంగ్రెస్ వ్యతిరేకత అన్న ఒక్క విషయంలోనే భావ సామ్యం ఉన్న రెండు డజన్ల పార్టీలను ఒక్క తాటి మీదకు తీసుకు రాగలిగారు. సంకీర్ణ ధర్మాన్ని ఆయన ఎంతగా పాటించినా పరిపాలనకు ఆటంకం లేకుండా చూశారు.

వాజపేయి అవివాహితుడిగానే ఉండి పోయారు. “నేను అవివాహితుడినే కాని బ్రహ్మచారిని కాదు” అని ఆయనే చెప్పుకున్నారు. ఆయన వ్యక్తిగత జీవన విధానం మీద జన సంఘ్ కు చెందిన బల్ రాజ్ మధోక్ అనేక పితూరీలు లేవ దీశారు. రాజ్ కుమారి కౌల్ తో వాజపేయికి సాన్నిహిత్యం ఉండేది. మేం చాలా సన్నిహిత మిత్రులం అని కౌల్ చెప్పే వారు. కౌల్ ఇంట్లోనే వాజపేయి ఉన్న రోజులున్నాయి. వాజపేయి ఇంట్లో కూడా కౌల్ తరచుగానే కనిపించే వారు. కాని వారిద్దరి మధ్య సంబంధానికి వారు ఏ పేరూ పెట్టలేదు. నిజానికి ఆ అవసరమే రాలేదు. కింగ్షుక్ నాగ్ ఈ వ్యవహారాన్ని మర్యాదకు భంగం కలగకుండా హృద్యంగా చిత్రీకరించారు. స్త్రీ పురుషుల మధ్య సంబంధాలకు మకిలి అంటించనవసరం లేని రీతిలోనే వాజపేయి జీవితం గడిచింది. కౌల్ కుమార్తె నమితను వాజపేయి దత్తత తీసుకున్నారు.

వాజపేయి భావుకుడు. కవి. ఈ లక్షణం ఆయనకు వారసత్వంగా అబ్బినట్టుంది. ఆయన తాత శ్యాం లాల్ సంస్కృత పండితుడు. కవిత్వాభిమాని. ఆయన మాటల్లో సంస్కృత శ్లోకాలు అలవోకగా దొర్లేవి. తండ్రి కృష్ణ బిహారీ ఖడీ బోలీలో కవితలల్లే వారు. ఈ వివరలన్నీ నాగ్ ఈ పుస్తకంలో పొందుపరిచారు.

అధికారిక రికార్డుల ప్రకారం వాజపేయి 1926లో జన్మించినట్టు లెక్క. కాని ఆయన జన్మించింది 1924 లోనే. ఉద్యోగం చేస్తే మరో రెండేళ్లు కలిసొస్తుందని కృష్ణ బిహారీ 1926 అని రాయించారు. పాపం ఆ బడి పంతులు వాజపేయి తత్వం ఉద్యోగం చేసేది కాదని, అందునా ప్రభుత్వ ఉద్యోగం చేసేది కాదని ఊహించలేక పోయారు. తండ్రి అత్యాశ, ‘ముందు చూపు ‘ నెరవేరలేదు కాని నెహ్రూ వాక్కు నిజమైంది.

వాజపేయి ప్రధాన మంత్రి అయినా కాక పోయినా ఆయన భారత రాజకీయ రంగంలో ఉద్దండుడే. ఆయన ప్రతిపక్షంలోనే మిగిలిపోయినా ఆయన వ్యక్తిత్వం విశిష్టమైందిగానే మిగిలేది. రాజకీయాలకు సంస్కార సుగంధం అంటించింది పీవీ నరసింహా రావు అయితే సంస్కారం రాజకీయాలకు అడ్డంకి కాదని నిరూపించింది వాజపేయి. రాజకీయాల్లో సంస్కారం అంతరిస్తున్న దశలో వాజపేయిలాంటి వారి జీవితం ఆయన రాజకీయాల పొడ గిట్టాని వారికి కూడా ఆదరణీయమైందే. వాజపేయి సమగ్ర జీవిత చరిత్ర అందుబాటులో లేని దశలో కింగ్షుక్ నాగ్ ఆ లోటు తీర్చారు.

-ఆర్వీ రామారావ్

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News