పాలేరు ఏకగ్రీవం ఎందుకు కాలేదంటే..?
పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే! దీంతో ఎలాగైనా ఈ స్థానం తిరిగి తమకే దక్కాలని శతవిధాలా ప్రయత్నించిన కాంగ్రెస్‌కు నిరాశే మిగిలింది. అప్పటికే వెంకటరెడ్డి పీఏసీ చైర్మన్‌గా ఉన్నారు. దీంతో ఆ పదవిని గీతారెడ్డికి ఇచ్చింది అధికార పార్టీ. అయితే, ఈ స్థానానికి ఉప ఎన్నిక రాకుండా ఏకగ్రీవం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దగా ప్రయత్నాలు జరపలేదన్న విమర్శలు వస్తున్నాయి. […]
Advertisement
పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే! దీంతో ఎలాగైనా ఈ స్థానం తిరిగి తమకే దక్కాలని శతవిధాలా ప్రయత్నించిన కాంగ్రెస్‌కు నిరాశే మిగిలింది. అప్పటికే వెంకటరెడ్డి పీఏసీ చైర్మన్‌గా ఉన్నారు. దీంతో ఆ పదవిని గీతారెడ్డికి ఇచ్చింది అధికార పార్టీ. అయితే, ఈ స్థానానికి ఉప ఎన్నిక రాకుండా ఏకగ్రీవం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దగా ప్రయత్నాలు జరపలేదన్న విమర్శలు వస్తున్నాయి. పాలేరులో వెంకటరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా ఒకరిని నిలుచోబెట్టి ఎన్నిక ఏకగ్రీవం చేద్దామని కాంగ్రెస్ భావించింది. అయితే, తొలి నుంచి ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్లు కనిపించ లేదు. నోటిఫికేషన్ విడుదలయ్యాక సీఎంను కలిసేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆయన అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండానే.. తన మనసులో ఏముందో చెప్పకనే చెప్పారు సీఎం కేసీఆర్.
నారాయణ ఖేడ్ అనుభవంతోనేనా..
గతంలో పీఏసీ చైర్మన్‌గా ఉన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. దీంతో అక్కడ వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. అక్కడ పోటీ పెట్టవద్దని అన్ని పార్టీలను కోరింది. దీనికి సీఎం కేసీఆర్ తో సహా అంతా సుముఖత వ్యక్తం చేశారు. కానీ, రుణమాఫీ ఒకేసారి చేయాలంటూ అసెంబ్లీలో టీడీపీతో పాటు కలిసి కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. ఒకేసారి అమలు సాధ్యం కాదని కేసీఆర్ కాంగ్రెస్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా శాంతించలేదు. ప్రజలకు అధికార పార్టీపై నమ్మకం పోయిందంటూ ఆరోపణలు చేశారు. టీడీపీతో కలిసి సెలవుదినమైన రెండో శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ తీరుతో విసిగిన కేసీఆర్ అప్పటికప్పడు తన నిర్ణయం మార్చుకున్నారు. నారాయణఖేడ్‌లో పోటీ పెట్టి గెలిచి మరీ తమపై ప్రజావ్యతిరేకత లేదని చాటుకున్నారు. తాజగా సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధమే ప్రకటించింది. కాంగ్రెస్ నాయకులంతా పదునైన విమర్శనాస్ర్తాలతో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అందుకే, పాలేరును గులాబీ పార్టీ నుంచి అభ్యర్థులను నిలపొద్దని కోరడంలో జాప్యం చేసింది. నోటిఫికేషన్ రాగానే సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా ఆయన నిరాకరించడంతో ఆయన అంతరంగం తేటతెల్లమైంది. ఈసారి కూడా పాలేరులో పోటీ చేసి గెలిచి కాంగ్రెస్ను నైతికంగా దెబ్బతీయాలని సీఎం పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంంది.
Advertisement