కొప్పుల ఈశ్వర్ మంత్రి అయ్యేనా?
తెలంగాణ రాష్ట్ర సమితిలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తోన్న నేతల్లో ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఒకరు. పార్టీ ఎంత కష్టకాలంలో ఉన్నా.. ఆయన కేసీఆర్ వెంటే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత గులాబీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆశించిన వారిలో కొప్పుల ఈశ్వర్ కూడా ఒకడు. ఆశించిన మంత్రి పదవి రాకపోవడంతో కొప్పుల అలకబూనాడు. అతనికి మంత్రి వర్గం ఏర్పాటుకు ముందు చాలా ఆఫర్లు వచ్చినా […]
తెలంగాణ రాష్ట్ర సమితిలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తోన్న నేతల్లో ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఒకరు. పార్టీ ఎంత కష్టకాలంలో ఉన్నా.. ఆయన కేసీఆర్ వెంటే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత గులాబీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆశించిన వారిలో కొప్పుల ఈశ్వర్ కూడా ఒకడు. ఆశించిన మంత్రి పదవి రాకపోవడంతో కొప్పుల అలకబూనాడు. అతనికి మంత్రి వర్గం ఏర్పాటుకు ముందు చాలా ఆఫర్లు వచ్చినా ఎందుకనో ఆయన ముందుకు రాలేదు. వాస్తవానికి కేసీఆర్‌కు నమ్మినబంటుల్లో కొప్పుల ముందుంటాడు. కొప్పులకు దళిత కోటాలో ఉపముఖ్యమంత్రి పదవి వస్తుందని అనుకున్నారంతా. కానీ, తొలికేబినెట్‌లో ఎలాంటి పదవి రాకపోవడం పార్టీలో పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
కేబినేట్ ఏర్పాటుకు అందరికంటే ముందే కొప్పులతో సీఎం మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే, అది మంత్రి పదవి కోసం కాదు… ఎందుకంటే కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నుంచి ఎమ్మెల్యే. అప్పటికే అదే జిల్లాకు చెందిన సిరిసిల్ల, హుజురాబాద్ ఎమ్మెల్యేలు కేటీఆర్, ఈటెలకు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. ఒకే జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు ఇస్తే.. విమర్శలు వస్తాయన్న కారణంతోనే కేసీఆర్….. స్పీకర్ పదవిని కొప్పులకు ఇద్దామని అనుకున్నారు. కానీ, ఎందుకో ఏమో కొప్పుల ఈ ప్రతిపాదన అంగీకరించేందుకు ముందుకు రాలేదు. దీంతో కేసీఆర్ ఏమీ చేయలేని పరిస్థితి.
అయినా కొప్పుల ఏమీ నొచ్చుకోలేదు. కానీ, ఆయనకు పార్టీ చీఫ్ విప్ పదవి ఇవ్వడం మాత్రం బాధించినట్లు సమాచారం. పార్టీలో నిన్నగాక మొన్న చేరిన వారికీ, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి దక్కిన ప్రాధాన్యం కూడా తనకు దక్కకపోవడంపై కొప్పుల అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో కేటీఆర్ వెళ్లి కొప్పులతో మంతనాలు జరపాడు. ఆ రాయబారం సఫలీకృతం కావడంతో కొప్పుల ప్రెస్‌మీట్ పెట్టాడు. కేసీఆర్ సైన్యంలో తానొక సాధారణ సైనికుడినని ఏ బాధ్యత అప్పగించినా సంతోషంగా నెరవేరుస్తానని చెప్పాడు. ఇప్పుడు తప్పకుండా తనకు న్యాయం జరుగుతుందని కొప్పుల గంపెడాశతో ఉన్నాడు!