వీసీ అప్పా రావు గ్రంథ చౌర్యం బట్టబయలు

హైదరాబాద్ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ పొదిలి అప్పారావు మళ్లీ వార్తలకెక్కారు. ఈ సారి ఆయన పై గ్రంథ చౌర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రంథ చౌర్యానికి పాల్పడ్డ మాట వాస్తవమేనని పొదిలి అప్పా రావు అంగీకరించి తన నిజాయితీని నిరూపించుకున్నారు కనక ఆరోపణలు అనడం అన్యాయమే. 2007, 2014 లో ఆయన ఇతరులతో కలిసి రాసిన మూడు వ్యాసాలలో ఇతరుల రచనల నుంచి ఉదారంగా వాక్యాలకు వాక్యాలు దొంగిలించి తన రచనల్లో చేర్చారని “వైర్” అనే […]

Advertisement
Update:2016-04-06 09:27 IST

హైదరాబాద్ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ పొదిలి అప్పారావు మళ్లీ వార్తలకెక్కారు. ఈ సారి ఆయన పై గ్రంథ చౌర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రంథ చౌర్యానికి పాల్పడ్డ మాట వాస్తవమేనని పొదిలి అప్పా రావు అంగీకరించి తన నిజాయితీని నిరూపించుకున్నారు కనక ఆరోపణలు అనడం అన్యాయమే. 2007, 2014 లో ఆయన ఇతరులతో కలిసి రాసిన మూడు వ్యాసాలలో ఇతరుల రచనల నుంచి ఉదారంగా వాక్యాలకు వాక్యాలు దొంగిలించి తన రచనల్లో చేర్చారని “వైర్” అనే వెబ్ సైట్ మంగళవారం సుధీర్ఘమైన వార్త సోదాహరణంగా ప్రకటించింది. దానితో అంతర్జాలంలో అగ్గి అంటుకుంది. రెండు ఇంగ్లీషు దినపత్రికలు బుధవారం నాడు అప్పా రావు గ్రంథ చౌర్యం గురించి మొదటి పేజీలో వివరమైన వార్తలు ప్రచురించాయి. ఆయన ఏయే వ్యాసాలనుంచి ఎత్తిపోతల పథకం అమలు చేశారో సాక్ష్యాలతో సహా వివరించాయి.

ఆచార్య అప్పారావు ఆరోపణలకు తొణికే మనిషి కాదని ఇదివరకే రుజువైంది. లేకపోతే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అంత రభస జరిగిన తర్వాత సెలవు మీద వెళ్లి తాను అనుకున్న రోజున చడీ చప్పుడూ లేకుండా మళ్లీ విధుల్లో చేరేవారే కాదు. అదీ వీసీ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తికి, కేంద్ర మానవ వనరుల శాఖకు ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా అమాంతం వచ్చి తన కుర్చీలో తాను కూర్చోగలిగే వారే కాదు. అలా బెదిరిపోయే మనిషే అయితే రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత నిరసన తెలియజేస్తున్న విద్యార్థులను అదుపు చేయడానికి పోలీసులను పిలిపించే సాహసం చేసే వారా! “గవురునమెంటు జీతం ఇచ్చి ఉంచిన కనిస్టీబు ఉండగా మనకు ఎందుకు శరీరాయాసం” అని గురజాడ వారి కన్యాశుల్కం నాటకంలో రామప్పంతులుకు ఉన్న పాటి లౌక్యం ఆచార్య పొదిలి అప్పారావుకు లేకుండా పోలేదు.

ఆ స్థితప్రజ్ఞత్వం కారణంగానే గ్రౌంథ చౌర్యానికి పాల్పడ్డారన్న నిందను కూడా సునాయాసంగా ఎదుర్కుంటున్నారు. గ్రంథ చౌర్యానికి పాల్పడలేదని బుకాయించేంతటి దిగజారుడుతనం లేని “మహోదాత్త” వ్యక్తిత్వం ఆయనది. “మైం ఇతరుల సమాచారాన్ని గ్రంథ చౌర్యం చేసి ఉంటే మా పత్రాన్ని వెనక్కు తీసుకుంటాం, విచారం వ్యక్తం చేస్తాం. ఒక వేళ ఆ వాక్యాలు ఫలానా వారివి అని చెప్పడం మరిచిపోయి ఉంటే ఆ తప్పుకు క్షమాపణ చెప్తాం” అని ఆయన సెలవిచ్చారు. తప్పు చేయలేదని అడ్డంగా వాదిస్తే తప్పు కాని చేశామని ఒప్పుకుని నివారణోపాయాలు కూడా తానే సూచించిన “పెద్దమనిషిని” తప్పు ఎలా పట్టగలం. గ్రంథ చౌర్యాన్ని పసిగట్టే సాఫ్ట్ వేర్ అందుబాటులో ఉండి ఉంటే సరి చూసుకునే వాళ్లం కదా అని వాదించి తన గ్రంథ చౌర్యానికి సాఫ్ట్ వేర్ మీద బాధ్యత నెట్టి వేయగలిగిన ఆచార్య అప్పారావు ఎంత జాగ్రత్తపరుడై ఉండాలి.

అయినా గ్రంథ చౌర్యం అనే మహా పాతకం ఆయన ఒక్కడే చేసినట్టు గగ్గోలు చేయడంలో ఏమైనా న్యాయం ఉందా. భారత రత్న బిరుదాంకితుడైన సి.ఎన్.ఆర్. రావు మీద, ప్రసిద్ధ రసాయనిక ఇంజనీరు ఆర్.ఎ. మషేల్కర్ మీద, పుదుచ్చేరి విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ చంద్ర కృష్ణ మూర్తి మీద, దిల్లీ యూనీవర్సిటీ మాజీ వైస్ చాన్స్ లర్ దీపక్ పెంటాల్ మీద, కుమావూన్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్ లర్ బి.ఎస్. రాజ్ పుత్ మీద కూడా గ్రంథ చౌర్య ఆరోపణలు వచ్చాయి. వారంతా తమ పాపానికి తలో కారణం చెప్పేసి, తమ సహచరుల మీద, తమకు సహకరించిన, చెప్పిన మాట విని పరిశోధనలో బండ చాకిరీ చేసి ఆచార్యులకు సమాచారం పోగేసి ఇచ్చిన విద్యార్థుల మీద ఆ తప్పు నెట్టేసి హాయిగా ఉండడం లేదా! ఒక్క రాజ్ పుత్ మాత్రమే ఒత్తిళ్లకు లొంగి రాజీనామా చేయాల్సి వచ్చింది పాపం! ఆచార్య అప్పా రావు అలా చేయకుండా తప్పైతే విచారం వ్యక్తం చేస్తామని బోలెడు ఔదార్యం ప్రకటించారు కదా.

పైగా సి.సి.ఎం.బి. వ్యవస్థాపక అధిపతి, ప్రసిద్ధ జీవశాస్త్రవేత్త పి.ఎం.భార్గవ చెప్పినట్టు “నాణ్యమైన విద్య” కొందరికే అందుబాటులో ఉంది. అలాంటి స్థితిలో మణిపూసల్లాంటి శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి వస్తారో ఆలోచించాల్సిన పని లేదా? ఈ స్థితిలో నాణ్యమైన, అసలు సిసలైన శాస్త్రవేత్తలు ఉండాలనడం, ఎవరి గ్రంథం నుంచీ దొంగిలించకుండా పరిశోధనా పత్రాలు, రచనలు చేయాలనడం అత్యాశే కదా! ఆశకు అంతుండాలన్నారు అందుకే. అయినా చతుష్షష్టి కళల్లో చోర కళను చేర్చిన మన పూర్వీకులు వెర్రిబాగుల వాళ్లా? ఎంత ప్రజాస్వామ్యమైనా కుసింత కళాపోషణ లేకపోతే ఎలా!

– ఆర్వీ రామా రావ్

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News