మనమంతా త్యాగాలు చేస్తే... వీళ్లంతా పన్నులు ఎగ్గొడతారట !

మనదేశ ధనవంతులు డబ్బులు ఎక్కడపెట్టుకోవాలో తెలియక విదేశీ బ్యాంకుల్లో లక్షలకోట్ల బ్లాక్‌మనీని మురగబెడుతుంటే దాన్ని ఎలా మనదేశంలోకి తెప్పించాలో చేతకాక విదేశీ పెట్టుబడులకోసం దేశసంపదను అప్పనంగా దోచిపెడుతున్నారు. విదేశీ సంస్థలు ఒక చిన్న పరిశ్రమ పెడతామన్నా అవసరం లేకున్నా వందలాది ఎకరాలను వాళ్లకు కట్టబెట్టడం, వాళ్లు అడిగినవి, అడగనివి… అన్ని రకాల ప్రయోజనాలు కల్పించడం మన నేతలకు ఆనవాయితీగా మారింది. విదేశీ పెట్టుబడులకోసం అంటూ ప్రజలసొమ్మును మంచినీళ్లలా ఖర్చుపెడుతూ దేశాలవెంబడి తిరగడం గొప్ప నాయకత్వ లక్షణం అయింది. […]

Advertisement
Update:2016-02-17 07:33 IST

మనదేశ ధనవంతులు డబ్బులు ఎక్కడపెట్టుకోవాలో తెలియక విదేశీ బ్యాంకుల్లో లక్షలకోట్ల బ్లాక్‌మనీని మురగబెడుతుంటే దాన్ని ఎలా మనదేశంలోకి తెప్పించాలో చేతకాక విదేశీ పెట్టుబడులకోసం దేశసంపదను అప్పనంగా దోచిపెడుతున్నారు. విదేశీ సంస్థలు ఒక చిన్న పరిశ్రమ పెడతామన్నా అవసరం లేకున్నా వందలాది ఎకరాలను వాళ్లకు కట్టబెట్టడం, వాళ్లు అడిగినవి, అడగనివి… అన్ని రకాల ప్రయోజనాలు కల్పించడం మన నేతలకు ఆనవాయితీగా మారింది. విదేశీ పెట్టుబడులకోసం అంటూ ప్రజలసొమ్మును మంచినీళ్లలా ఖర్చుపెడుతూ దేశాలవెంబడి తిరగడం గొప్ప నాయకత్వ లక్షణం అయింది.

పెట్టుబడులకోసం దేహీ అని వాళ్లవెంట పడుతున్నాం కాబట్టే విదేశీ పరిశ్రమలు మనదేశంలో అడ్డగోలు పన్నురాయితీలకు నిసిగ్గుగా వెంపర్లాడుతున్నాయి. కట్టాల్సిన పన్నులను ఎగ్గొడుతున్నాయి. వోడా ఫోన్‌ కట్టాల్సిన క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ రూ. 14,200ల కోట్లు చెల్లించకపోగా ఆదాయపు పన్నుశాఖ పంపిన నోటీసుకు విచిత్రమైన సమాధానమిస్తోంది. “ఒకవైపు ప్రధాని నరేంద్రమోదీ స్నేహపూర్వకమైన పన్ను చట్టాలను రూపొందిస్తామని హామీ ఇస్తుంటే మరో వైపు ఆదాయపు పన్ను శాఖ నోటీసులపై నోటీసులు పంపడం చూస్తుంటే ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది” అని కామెంట్‌ చేసింది.

అంటే వోడా ఫోన్‌ దృష్టిలో తను కట్టాల్సిన రూ.14,200ల కోట్లను మాఫీచేస్తే మన చట్టాలు స్నేహా పూర్వకంగా ఉన్నట్టు, మన అధికారులు, మన నేతలు కలిసి పనిచేస్తున్నట్టు లెక్క. అందమైన మాటల మధ్య వాళ్ల వికృత ఆలోచనలు సగటు పౌరులకు కంపరం కలిగిస్తున్నాయి.

ప్రణబ్‌ ముఖర్జీ ఆర్ధికమంత్రిగా ఉన్నప్పుడు వోడా ఫోన్‌చేత రూ. 14,200ల కోట్లను కట్టించడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆతరువాత వచ్చిన స్వయం ప్రకటిత మహామేధావి ఆర్ధికమంత్రి చిదంబరం ఆ పన్ను రద్దుచేయడానికి తనవంతు సహాయంచేశాడు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా ఆ పన్ను రద్దుకే పూర్తిగా సహకరించినట్లుంది.

నిరుపేదలకు వంట గ్యాస్‌ అందాలంటే మధ్యతరగతి ప్రజలు, ధనవంతులు, గ్యాస్‌ సబ్సిడీలను త్యాగం చేయాలని మోదీ ప్రభుత్వం విజ్ఞప్తులు చేస్తోంది. ఎన్ని లక్షలమంది త్యాగాలు చేస్తే రూ. 14,200ల కోట్లు అవుతాయి? ఓఎన్‌జీసి, రిలయన్స్‌ మధ్య వివాదంలో ఓఎన్‌జీసికి రిలయన్స్‌ కట్టాల్సిన సుమారు రూ. 9,000 కోట్ల రూపాయలను రిలయన్స్‌కు బదులుగా ప్రభుత్వం చెల్లించడానికి ముందుకువచ్చింది. ఎంతమంది ప్రజలు త్యాగాలు చేస్తే రూ. 9,000 కోట్లు అవుతాయి?.

అడుక్కునే ప్రజల దగ్గరనుంచి కూడా పరోక్ష పన్నులద్వారా ప్రభుత్వం సేకరిస్తున్న డబ్బును ఇలా కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు పందారం చేయడం ప్రజాస్వామ్యం కాబోలు.

Tags:    
Advertisement

Similar News