ముంచుకొస్తున్న మ‌రొక ముప్పు...జికా వైర‌స్‌!

దోమ‌… మ‌న దృష్టిలో అత్య‌ల్పప్రాణి…కానీ అది తెచ్చే రోగాలకు మాత్రం అంతే లేకుండా పోతోంది. ప‌లుర‌కాల ప్ర‌మాద‌క‌ర‌మైన వైర‌స్‌లు వీటిద్వారా వ్యాపించి మ‌న‌కు ప్రాణాంత‌కంగా మారుతున్నాయి. ఐసిస్ కంటే ఎక్కువ‌గా వైర‌స్‌లు మ‌న‌ల్ని భ‌య‌పెడుతున్నాయి. ఇప్ప‌టికే ఎయిడ్స్‌, ఎబోలా లాంటి  మ‌హ‌మ్మారులు   శాస్త్ర‌వేత్త‌లకు స‌వాల్ విసురుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు విస్తృతంగా విన‌బ‌డుతున్న మ‌రొక  వైర‌స్ పేరు జికా. డెంగ్యూ, ఎల్లో ఫీవ‌ర్‌, చిక‌న్‌గున్యా, జ‌పానీస్ బి ఎన్‌స‌ఫ‌ల‌టీస్ త‌దిత‌ర జ్వ‌రాల‌కు కార‌ణ‌మవుతున్న వైర‌స్ ల్లాంటిదే ఈ […]

Advertisement
Update:2016-02-01 02:30 IST

దోమ‌… మ‌న దృష్టిలో అత్య‌ల్పప్రాణి…కానీ అది తెచ్చే రోగాలకు మాత్రం అంతే లేకుండా పోతోంది. ప‌లుర‌కాల ప్ర‌మాద‌క‌ర‌మైన వైర‌స్‌లు వీటిద్వారా వ్యాపించి మ‌న‌కు ప్రాణాంత‌కంగా మారుతున్నాయి. ఐసిస్ కంటే ఎక్కువ‌గా వైర‌స్‌లు మ‌న‌ల్ని భ‌య‌పెడుతున్నాయి. ఇప్ప‌టికే ఎయిడ్స్‌, ఎబోలా లాంటి మ‌హ‌మ్మారులు శాస్త్ర‌వేత్త‌లకు స‌వాల్ విసురుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు విస్తృతంగా విన‌బ‌డుతున్న మ‌రొక వైర‌స్ పేరు జికా. డెంగ్యూ, ఎల్లో ఫీవ‌ర్‌, చిక‌న్‌గున్యా, జ‌పానీస్ బి ఎన్‌స‌ఫ‌ల‌టీస్ త‌దిత‌ర జ్వ‌రాల‌కు కార‌ణ‌మవుతున్న వైర‌స్ ల్లాంటిదే ఈ జికా వైర‌స్‌. జికా ఫీవ‌ర్‌లో కూడా డెంగ్యూ ఫీవ‌ర్ ల‌క్ష‌ణాలు క‌న‌బ‌డుతుంటాయి. కాక‌పోతే అంత తీవ్రంగా ఉండ‌వు. ఈ జికా వైర‌స్ ఎక్కువ‌గా భ‌య‌పెడుతున్న‌ది గ‌ర్భిణుల‌ను. ఎందుకంటే ఈ వైర‌స్ సోకిన గ‌ర్భిణికి జ‌న్మించే బిడ్డ‌లు మెద‌డుకు సంబంధించిన లోపాల‌తో పుట్టే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంది. ఈ పిల్ల‌లు న్యూరో డెవల‌ప్‌మెంట‌ల్ డిజార్డ‌ర్ (నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ పూర్తిగా అభివృద్ధి చెంద‌క‌పోవ‌డం)కి గుర‌య్యే ప్ర‌మాదం ఉంది. ఇది గ‌ర్భంలో ఉన్న‌ప్పుడే శిశువుకి సోకుతుంది. అలాగే మ‌గ‌వారిలో వ్యాధి సోకిన‌పుడు, ఈ వైర‌స్ వీర్య‌క‌ణాల్లో ఉండి పోయి, త‌రువాత వారి ద్వారా పుట్ట‌బోయే పిల్ల‌ల‌కు సంక్ర‌మిస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. జికా వైర‌స్‌ని వ్యాపించ‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. నివార‌ణ‌, చికిత్స‌ల‌కంటే ముందు…. అవ‌గాహ‌న చాలా ముఖ్యం. అందుకే జికా స‌మాచారం పూర్తిగా తెలుసుకుని ఉండ‌టం మంచిది-

ఉగాండాలో 1947లో ఈ వైర‌స్ పుట్టింద‌ని ఆ దేశ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. మొద‌ట కోతుల్లో దీన్ని గుర్తించారు. మ‌నుషుల‌కు అంత ప్ర‌మాద‌క‌రం కాదులే అనుకున్నారు. కానీ చాలా వైర‌స్‌లు కాల‌క్ర‌మేణా త‌మ జ‌న్యువుల్లో మార్పులు సంత‌రించుకున్న‌ట్టే జికా వైర‌స్‌లో కూడా మార్పులు వ‌చ్చాయి. ఇప్పుడు ఈ వైర‌స్ మ‌నుషుల‌కు హాని త‌ల‌పెట్టే స్థాయిలో బ‌ల‌ప‌డింది. 1960లో ఆఫ్రికాలో మొట్ట‌ మొద‌ట దీన్ని మ‌నిషికి సోకిన‌ట్టుగా గుర్తించారు. ఇప్పుడిది అమెరికా, ఆఫ్రికా దేశాల‌కే కాక ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాప్తి చెందింది. 2014లో బ్రెజిల్‌లో గుర్తించ‌గా ఇప్పు డ‌క్క‌డ వంద‌ల కేసులు న‌మోదు అవుతున్నాయి. కొలంబియా, సాల్వేడార్‌, ప‌రాగ్వే వెనిజులా, ప‌నామా, ఫ్రంచ్ గ‌యానా, ఈక్వెడార్‌, క‌రేబియ‌న్ దీవులు, బొలీవియా, హైతీ…ఈ వ‌రుస పెరిగి పెరిగి…ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా 40ల‌క్ష‌ల వ‌ర‌కు జికా వైర‌స్ బాధితులు ఉన్న‌ట్టుగా స‌మాచారం.

గ‌ర్భిణుల‌కు ప్ర‌మాదం
జికా వైర‌స్ ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తుల గుండెల్లో ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. ఈ వైర‌స్‌కి గుర‌యిన మ‌హిళ‌ల‌కు పుట్టే చిన్నారులు మైక్రోసెఫిలీ అనే వ్యాధికి గుర‌వుతున్న‌ట్టుగా బ్రెజిల్లో గుర్తించారు. ఈ వ్యాధి కార‌ణంగా చిన్నారుల మెద‌డు స‌రిగ్గా ఎద‌గ‌దు. మెద‌డులో లోపాలు ఏర్ప‌డ‌తాయి. పుట్టుక‌తోనే వీరి త‌ల చిన్న‌గా ఉంటుంది. బ్రెజిల్, ఎల్ సాల్వెడార్ లలో జికా వైరస్ ప్రమాదకర స్థాయిలో విస్తరించడంతో అక్కడి ప్రభుత్వాలు మూడేళ్ల వరకు గర్భం ధరించకుండా ఉండడమే మేలని సలహా ఇస్తున్నాయి. పలు దేశాలు తమ మహిళా క్రీడాకారిణులను బ్రెజిల్ పంపడానికి వెనుకాడుతున్నాయి. అయితే ఒలంపిక్స్ నాటికి జికాను అదుపులోకి తెస్తామని బ్రెజిల్ చెబుతోంది.

అదే దోమ‌….వైర‌స్ జీవిత‌కాలం ఎక్కువ‌

  • జికా వైర‌స్‌కి గుర‌యిన ప్ర‌తి అయిదుమందిలో ఒక‌రు దీనివ‌ల‌న తీవ్రంగా రోగ‌గ్ర‌స్తులు అవుతున్నారు.
  • ల‌క్ష‌ణాలు డెంగ్యూ, చిక‌న్ గున్యా ల‌క్ష‌ణాల మాదిరిగానే ఉంటాయి. ఎందుకంటే ఈ వైర‌స్ సైతం ఆ రెండు వ్యాధుల‌కు కార‌ణ‌మైన‌ ఎడిస్ అనే దోమ‌నుం డే వ్యాపిస్తుంది.
  • జ్వ‌రం, ఎర్ర‌ని ద‌ద్దుర్లు, జాయింట్ల వ‌ద్ద నొప్పులు, క‌ళ్లు ఎర్ర‌బార‌డం ల‌క్ష‌ణాలు. ఇవి కాక త‌లనొప్పి, కండ‌రాల నొప్పులు ఉంటాయి.
  • ల‌క్ష‌ణాలు మ‌రీ తీవ్రంగా లేక‌పోయినా కొన్ని రోజులు లేదా వారం వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు. వైర‌స్‌కి గుర‌య్యాక వ‌చ్చిన అనారోగ్యాలు కొన్నాళ్ల‌కు త‌గ్గినా వైర‌స్ ఇంకా వ్య‌క్తిలో నిలిచే ఉంటుంది. అందుకే ఇది పుట్ట‌బోయే పిల్ల‌ల‌కు శాపంగా మారుతోంది.
  • హాస్ప‌ట‌ల్లో ప‌డిపోవ‌డం, మ‌ర‌ణాలు లాంటి ప్ర‌మాదాలు చాలా అరుదే అయినా వ్యాధి తాలూకూ ల‌క్ష‌ణాలు వేధిస్తాయి.
  • ఇత‌ర దేశాల‌కు వెళ్లివ‌చ్చిన‌వారిలో వ్యాధి ల‌క్ష‌ణాలు క‌న‌బ‌డితే మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి.

చికిత్స‌…

  • ఇప్ప‌టివ‌ర‌కు జికా వైర‌స్‌కి ప్ర‌త్యేకంగా మందులు కానీ, వ్యాక్సిన్లు కానీ లేవు.
  • బాగా విశ్రాంతి తీసుకోవాలి. శ‌రీరం డీ హైడ్రేష‌న్‌కి గురికాకుండా ద్ర‌వ‌ప‌దార్థాలు ఎక్కువ‌గా తీసుకోవాలి.
  • జ్వ‌రం, నొప్పుల‌ను త‌గ్గించే మందులు వాడాలి.
  • యాస్ప్రిన్ గానీ, ఇంకా ఇత‌ర నాన్ స్టిరాయిడ‌ల్ యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ డ్ర‌గ్స్ అంటే ఇబుప్రొఫెన్‌, న్యాప్రాక్సెన్ లాంటివి వాడకూడ‌దు. డెంగ్యూ, జికా ల‌క్ష‌ణాలు లేవ‌ని తేలేవ‌ర‌కు ఈ మందుల‌ను వాడ‌కూడ‌దు. అలా వాడితే ర‌క్త‌స్రావం ప్ర‌మాదం ఉంటుంది.
  • మ‌రేదైనా అనారోగ్యానికి మందులు వాడుతున్న‌వారు కూడా డాక్ట‌రుని సంప్ర‌దించాకే మందులు వేసుకోవాలి.
  • జికా ల‌క్ష‌ణాలున్న‌వారికి ఒక వారం వ‌ర‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ దోమ‌లు కుట్ట‌కుండా జాగ్ర‌త్తప‌డాలి. ఎందుకంటే ఇన్‌ఫెక్ష‌న్ సోకిన‌ మొద‌టివారంలో ర‌క్తంలో జికా వైర‌స్ ఉంటుంది. దోమ‌లు మ‌ళ్లీ కుట్టిన‌పుడు ఆ వైర‌స్ వాటి ద్వారా తిరిగి మ‌రొక వ్య‌క్తికి సంక్ర‌మించ‌వ‌చ్చు. ఇన్‌ఫెక్ష‌న్‌కి కార‌ణ‌మ‌య్యే వైర‌స్‌ని మోసుకువెళ్లే దోమ అది కుట్టిన‌వారికి దాన్నివ్యాపింప‌చేస్తుంది.

మ‌న‌దేశంలో లేదు…అయినా…
జికా వైరస్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక మేరకు మంత్రి నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జికా వైరస్ కు సంబంధించిన భయం అక్కర్లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పరిస్థితిని సమీక్షించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామ‌ని వారిచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అయితే డెంగ్యూకి కార‌ణ‌మ‌వుతున్న ఎడిస్ దోమ‌లే జికా వైర‌స్‌ని వ్యాప్తి చేస్తాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్న నేప‌థ్యంలో మ‌నం మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఎందుకంటే మ‌న‌దేశంలో డెంగ్యూ ఎక్కువ‌గా ఉంది క‌నుక‌.

Tags:    
Advertisement

Similar News