ఆమె పూజ చేస్తే...ఆయ‌న చాకిరీ చేయ‌గ‌ల‌రా?

చ‌ట్టాలు, రాజ్యాంగం, కోర్టులు ఒక వైపు… మ‌తాలు, ఆచారాలు, సంప్ర‌దాయాలు ఒక‌వైపు…మ‌న‌దేశంలో అనేక సంక్లిష్ట ప‌రిస్థితుల‌కు దారితీస్తున్న వైరుధ్యం ఇది. మ‌తం,దేవుడు, పూజ‌లు, ఆల‌యాలు ఇవ‌న్నీ ప్ర‌జ‌ల‌ను మంచి బాట‌లో న‌డిపించేవ‌నేది ఒక న‌మ్మ‌కం. ఇలాంటివి లేక‌పోతే లోకంలో అరాచ‌కం రాజ్య‌మేలుతుంద‌ని వీటిని పాటించేవారు నూటికి నూరుశాతం న‌మ్ముతారు. కానీ వీటిని న‌మ్మేవారి వ‌ల‌న కూడా అరాచ‌కాలు, అన్యాయాలు జ‌రుగుతుంటాయి…అందుకు స‌మాధానం ఉండ‌దు. న‌మ్మ‌కాలు, సంప్ర‌దాయాలు ప్ర‌జాజీవితాల‌ను స‌క్ర‌మంగా న‌డ‌ప‌లేవు. స‌మాన‌త‌లు, హ‌క్కులు, బాధ్య‌త‌ల వంటివి వాటిలో […]

Advertisement
Update:2016-01-27 06:27 IST

చ‌ట్టాలు, రాజ్యాంగం, కోర్టులు ఒక వైపు… మ‌తాలు, ఆచారాలు, సంప్ర‌దాయాలు ఒక‌వైపు…మ‌న‌దేశంలో అనేక సంక్లిష్ట ప‌రిస్థితుల‌కు దారితీస్తున్న వైరుధ్యం ఇది. మ‌తం,దేవుడు, పూజ‌లు, ఆల‌యాలు ఇవ‌న్నీ ప్ర‌జ‌ల‌ను మంచి బాట‌లో న‌డిపించేవ‌నేది ఒక న‌మ్మ‌కం. ఇలాంటివి లేక‌పోతే లోకంలో అరాచ‌కం రాజ్య‌మేలుతుంద‌ని వీటిని పాటించేవారు నూటికి నూరుశాతం న‌మ్ముతారు. కానీ వీటిని న‌మ్మేవారి వ‌ల‌న కూడా అరాచ‌కాలు, అన్యాయాలు జ‌రుగుతుంటాయి…అందుకు స‌మాధానం ఉండ‌దు. న‌మ్మ‌కాలు, సంప్ర‌దాయాలు ప్ర‌జాజీవితాల‌ను స‌క్ర‌మంగా న‌డ‌ప‌లేవు. స‌మాన‌త‌లు, హ‌క్కులు, బాధ్య‌త‌ల వంటివి వాటిలో ఉండ‌వు. అందుకే ప్ర‌పంచాన్ని న‌డిపించేది దేవుడే అని న‌మ్మినా, జీవితాన్ని ముందుకు న‌డిపించే అంశాల‌ను మ‌నం రాజ్యాంగం నుండే పొందాలి. రాజ్యాంగం వాటిని ఇవ్వాల‌ని మ‌నం రాసుకున్నాము. రాత‌ల‌కు చేత‌ల‌కు చాలా తేడా ఉంటుంది కాబట్టి ఆ సంఘ‌ర్ష‌ణ నిరంత‌రం ఉంటుంది. అలాంటిదే ఒక‌టి ఈ మ‌ధ్య తెర‌మీద‌కు వ‌చ్చింది.

శ‌బ‌రిమ‌లై అయ్యప్ప ఆల‌యంలోకి మ‌హిళ‌ల ప్ర‌వేశాన్ని ఎందుకు నిషేధించార‌ని సుప్రీంకోర్టు ట్రావెంకోర్ దేవస్థానం బోర్డుని ప్ర‌శ్నించింది. మ‌హిళ‌లను సైతం శ‌బ‌రిమ‌లైకి రానివ్వాల‌ని ఆదేశించింది. అలాగే మ‌హారాష్ట్ర‌, అహ్మద్ నగర్ లోని శింగణాపూర్ శని ఆలయంలోకి కూడా మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం లేదు. 400 సంవ‌త్స‌రాలుగా ఇదే ఆచారాన్ని కొన‌సాగిస్తున్నారు. శ‌నిదేవుని నుండి హానిక‌ర‌మైన త‌రంగాలు విడుద‌ల అవుతాయ‌ని, అందుకే మ‌హిళ‌ల‌కు అనుమ‌తి లేద‌నే న‌మ్మ‌కం ఉంది. అయితే రిప‌బ్లిక్ డే రోజున ర‌ణ‌రాగిణి భూమాత మహిళా ద‌ళానికి చెందిన స‌భ్యులు ఈ సంప్ర‌దాయాన్ని, వివ‌క్ష‌ని ఛేదించాల‌నుకున్నారు. దాదాపు 500మంది రణరాగిణి భూమాత బ్రిగేడ్ సంస్థకు చెందిన మ‌హిళ‌లు దాని అధ్య‌క్షురాలు తృప్తి దేశాయి (26) ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌య‌త్నం చేశారు. కానీ వారి ప్ర‌య‌త్నాన్ని విఫ‌లం చేస్తూ పోలీసులు, ఆల‌యం ఉన్న సూపా గ్రామానికి డెభై కిలోమీట‌ర్లకు అవ‌త‌లే వారిని నిలిపివేశారు.

గుడిలోకి అనుమ‌తించేవ‌ర‌కు తాము వెనుతిర‌గ‌బోమ‌ని ర‌ణ‌రాగిణి స‌భ్యులు అక్క‌డే కూర్చుని నిర‌స‌న‌ మొద‌లుపెట్టారు. ఇదిలా ఉంటే వీరికి వ్య‌తిరేకంగా ఆ గ్రామ ప్ర‌జ‌లు గుడి ప్రాంగ‌ణంలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. వీరికి శివ‌సేన‌, హిందూ జ‌నజాగృతి, ఇంకా కొన్ని స‌నాత‌న సంస్థ‌ల మహిళా విభాగాలు మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించాయి. అంత‌కుముందే ర‌ణ‌రాణిగి భూమాత బ్రిగేడ్ అధ్య‌క్షురాలు హెలికాప్టర్ నుండి నిచ్చెన‌ల‌ సాయంతో ఆల‌య గ‌ర్భగుడికి స‌మీపంలో దిగాల‌ని అనుకున్నారు. ఆమె అలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డంతో పుణె జిల్లా క‌లెక్ట‌ర్ అందుకు అనుమ‌తి లేకుండా చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. చివ‌రికి ర‌ణ‌రాగిణి త‌న ప్ర‌య‌త్నం తాను చేసింది.

కోర్టులు, మ‌హిళ‌ల‌కు మ‌గ‌వాళ్ల‌తో స‌మానంగా ఆల‌య ప్ర‌వేశం ఉంది అని ఆదేశాలు జారీ చేసిన‌పుడు, ప్ర‌భుత్వాలు వాటిని పాటిస్తే…పోలీసులు ద‌గ్గ‌రుండి మ‌హిళ‌ల‌ను గుడిలోకి పంపాలి. కానీ ఇక్క‌డ అలా కాకుండా మ‌హిళ‌ల‌ను ఆపేందుకు పోలీసులు ఉన్నారు…. అదే విచిత్రం. ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను మ‌నం కేవ‌లం గుళ్ల‌లోకి ప్ర‌వేశం కోసం మ‌హిళ‌లు చేస్తున్న యాగీగా చూడ‌కూడ‌దు. ఆ సంద‌ర్భానికి ప‌రిమితం చేసి కూడా చూడ‌లేము. మ‌హిళ‌ల‌కు కొన్నిగుళ్ల‌లోకి అనుమ‌తిని ఇవ్వ‌కూడ‌దు…అన‌డం వెనుక ఉన్న‌ది స్త్రీల ప‌ట్ల ఉన్న వివ‌క్షే అన్న‌ది తేట‌తెల్లం. న‌మ్మ‌కాలు, సంప్ర‌దాయాలు స‌క్ర‌మ జీవ‌న విధానం కోసం మ‌నిషి ఏర్పాటు చేసుకున్న తొలి ప‌ద్ధ‌తులు. అక్క‌డి నుండి ముందుకు సాగి నాగ‌రిక‌త‌వైపు చాలా అడుగులు వేశాం. స‌మాన‌త్వం కంటే మించిన నాగ‌రిక‌త ఏముంటుంది? కానీ మ‌నం స‌మాన‌త్వం అనే స‌రికి వెన‌క్కు ప‌రుగులు పెడుతూ నాటి న‌మ్మ‌కాలు, ఆచారాల‌నే ఆశ్ర‌యిస్తున్నాం. మ‌హిళ‌ల‌పై సాగే వివ‌క్ష‌ రూపం, స‌మ‌య సంద‌ర్భాలను బ‌ట్టి వేరుగా ఉన్నాఅక్క‌డున్న వేర్లు, మూలాలూ ఒక్క‌టే. వివ‌క్ష‌కు మూలం మ‌హిళ‌ దేహం, దాని ధ‌ర్మాలు… వీటి చుట్టూనే ఉంటున్న‌ది. స్వ‌భావ‌సిద్ధంగా వ‌చ్చిన రూపం, శారీర‌క ధ‌ర్మం ఆధారంగా వివ‌క్షకు గురిచేస్తే అది ప్ర‌కృతి ధ‌ర్మాన్ని వ్య‌తిరేకించ‌డం కాదా? వానాకాలం వానెందుకు ప‌డుతుంది, ఎండాకాలం ఎండ ఎందుకు కాస్తోంది…అని అడ‌గ‌టంలో ఎంత తెలివిత‌క్కువ‌త‌నం ఉంటుందో, ఇందులోనూ అంతే తెలివితక్కువ త‌నం ఉంది. అయినా అది నిర‌భ్యంత‌రంగా, నిర్ల‌జ్జ‌గా కొన‌సాగుతూనే ఉంది.

ముందు దేహంపై సందేహాలు లేవ‌నెత్తితే, దాన్నే లోప‌భూయిష్టంగా చూపితే, త‌రువాత ఆమె చ‌దువు, హ‌క్కులు, ధ‌రించే దుస్తులు, పెళ్లి, పిల్ల‌లు, చేసే ప‌నులు….ఇలా ఆమెకు సంబంధించిన అన్నింటిమీద ఆధిప‌త్యం చెలాయించ‌వ‌చ్చు. అదే జ‌రుగుతోంది. స‌రే స్త్రీకి విశ్రాంతినిచ్చేందుకే ఈ ప‌ద్ధ‌తులు పెట్టార‌ని స‌ర్ది చెప్పుకుంటున్నాం. కానీ రుతుక్ర‌మానికి అప‌విత్ర‌త‌త‌ని ఆపాదించ‌డం, ఆ కార‌ణంగా ఆమెకు నిబంధ‌న‌లు, నియంత్ర‌ణ‌లు పెట్ట‌డం….వీటిని ఎలా చూడాలి…కేవ‌లం కొన్ని న‌మ్మకాలను నిలుపుకునేందుకు మ‌నిషి( స్త్రీ )అస్తిత్వానికి, ఉనికికి పెనుముప్పవుతున్న‌ విధానాల‌ను పాటించ‌డం..దీన్నేమ‌నాలి? మ‌తాల ప్రాతిప‌దిక‌పై ఒక్క‌టైన జ‌నాన్ని ఆక‌ట్టుకోవాలంటే ఆ మ‌త విశ్వాసాల‌ను పెంచి పోషిస్తే చాల‌నుకునే మ‌న రాజ‌కీయ పార్టీలు, లింగ వివ‌క్ష‌ని రూపు మాప‌డం త‌మ ప‌ని అనుకోవు. అస‌ల‌వి ఏ వివ‌క్ష‌ల జోలికీపోవు. నిజానికి వాటిని ఆపాల‌నుకునేవారితోనే వారికి ప్ర‌మాదం. క‌నుక ప్ర‌భుత్వాల నుండి మ‌నం దాన్ని ఆశించ‌లేము. అలాగే రాజ్యాంగంలో ఉన్న స‌మ‌స‌మాజం నిజ‌జీవితంలో అమ‌ల్లోకి రావాల‌ని కూడా ఏ ప్ర‌భుత్వాలూ అనుకోవు. అందుకే మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్ ఆల‌య అధికారులు ఈ విష‌యాన్ని చ‌ర్చ‌ల‌ద్వారా సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రిస్తార‌ని, దేవుని ఆరాధ‌న‌లో వివ‌క్ష చూపాల‌ని తాము అనుకోవ‌డం లేద‌ని ప్ర‌క‌టించి ఊరుకున్నారు.

ఆల‌య ట్ర‌స్ట్ బోర్డుకి మొట్ట‌మొద‌టి మ‌హిళా అధ్య‌క్షురాలిగా నియ‌మితురాలైన అనితా షేతి, శ‌నిదేవుని విగ్ర‌హానికి దూరంగా ఉండి మ‌హిళ‌లు పూజ‌లు చేయ‌వ‌చ్చ‌ని, అస‌లు ఇదంతా ఆ సంస్థ‌ తమ ఉనికిని చాటుకునేందుకే చేస్తోంద‌నీ అన్నారు. అనిత‌, తాను బాధ్య‌త‌లు స్వీక‌రించాక, తాను కూడా ఆల‌య సంప్ర‌దాయాన్ని కొనసాగిస్తాన‌ని ప్ర‌క‌టించారు. శని విగ్రహానికి మహిళలు తైలపూజ చేసే సంప్రదాయం ఇప్పటివరకు లేదనీ, శని విగ్రహం వద్దకు మహిళా భక్తులను అనుమతించబోమ‌ని ఆమె అప్పుడే చెప్పారు. దీన్ని బ‌ట్టి ఫ‌డ్న‌విస్ ప్ర‌క‌ట‌న‌కు అర్థ‌మేమిటో అర్ధ‌మ‌వుతోంది. ఇలాంటి సంద‌ర్భాల్లో మార్పుకోసం కొంత‌మంది మ‌హిళ‌లు ప్ర‌య‌త్నిస్తుంటే అంతకంటే ఎక్కువ స్థాయిలో మ‌హిళ‌లు వారికి వ్య‌తిరేకంగా నిలుస్తున్నారు. ఒక న‌మ్మ‌కంలోంచి మ‌నిషిని బ‌య‌ట‌కు తీసుకురావ‌డం అనేది ఎంతో క‌ష్ట‌సాధ్య‌మైన విష‌యం. మ‌న జీవితంలో చాలా అధ్య‌యాలు ఇప్ప‌టికీ ప‌లు న‌మ్మ‌కాల‌ను ఆధారం చేసుకునే న‌డుస్తున్నాయి.శ‌బ‌రిమ‌లైలోకి ప్ర‌వేశం లేక‌పోతే ఏమ‌వుతుంది…అక్క‌డికి వెళ్లే మ‌గ‌వారికి అన్నీ అమ‌ర్చిపెట్టే భాగ్యం మ‌హిళ‌ల‌దేగా అన్నారు ఒక మ‌హిళా ఆధ్యాత్మిక‌వేత్త ఆ విష‌యంపై స్పందిస్తూ. ఇక్క‌డ ఉత్త‌మ సంస్కారంగా చెప్ప‌బ‌డే పూజ అనేది పురుషుల‌కు, వారికోసం ఇల్లు వాకిలీ ఊడ్చి ముగ్గులు పెట్టి, వండి వార్చే చాకిరీ ఆడ‌వాళ్ల‌కూ విభ‌జించ‌బ‌డింద‌నే విష‌యాన్ని ఆమె అస‌లు గుర్తించ‌న‌ట్టే మాట్లాడారు. ఒక్క ప‌దిరోజులు మ‌హిళ‌లు అలాంటి క‌ఠిన పూజ ఏద‌న్నా నిర్వ‌హిస్తూ, మ‌గ‌వారు వారికి అన్నీ అమ‌ర్చి పెట్టాలి…అంటే…. ఎక్కడ‌న్నా, ఏ ఇంట్లో అయినా కుదురుతుందా?
చాలా సంక్లిష్ట‌త‌లు ఉన్నాయి. వంద‌ల ఏళ్లుగా ప‌డిపోయిన చిక్కుముళ్లు ఉన్నాయి. కుక్క‌ని వాకిట్లో, గోడ్ల‌ని సావిట్లో ఉంచిన‌ట్టుగానే పెళ్లాం వంటింట్లో ఉండాల‌ని అనుకునే మ‌గ‌వారు ఇంకా ఉన్నారు. అవ‌స‌రార్థం కాస్త మారిన‌ట్టుగా అనిపించినా మ‌గ‌వారి న‌ర‌న‌రాల్లో ఇంకిపోయిన ఒక మూఢ‌త్వం అది. ఈ ఘ‌ర్ష‌ణ ఇలాగే ఉంటుంది. వేల‌ మంది భ‌క్తుల‌తో సామూహిక పూజ‌లు చేయించే స్వామీజీలు మ‌న‌కు వంద‌ల్లో ఉంటారు…కానీ ప‌ది, ప‌న్నెండేళ్ల చిన్న‌త‌ల్లుల‌ను సైతం రుతుక్రమం పేరిట హింసించ‌కండి…అని చెప్పే సామాజిక వేత్త‌లు మ‌న‌కు కొద్దిమందే ఉంటారు. న‌మ్మ‌కంలో మ‌నిషికి సౌక‌ర్యం ఉంది. ఎక్కువ‌మందికి ఆ సౌక‌ర్య‌మే కావాలి కాబ‌ట్టి ప్ర‌భుత్వాలు ఆ ఎక్కువ‌మందికి అనుకూలంగానే ఉంటాయి. అంతెందుకు దేవుని గొప్ప‌తనం చెప్పుకున్నంత‌గా మ‌నం మ‌నిషి గొప్ప‌త‌నాన్ని చెప్పుకోలేము. మ‌నిషి అంటే గొప్ప‌మ‌నిషి అనికాదు, మ‌నిషిగా పుట్టిన ప్ర‌తి మ‌నిషీ… అని!!!!

వ‌డ్ల‌మూడి దుర్గాంబ‌

Tags:    
Advertisement

Similar News