దొంగ చాటుగా రోహిత్ అంత్యక్రియలు
హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురై తీవ్రమైన మనో వ్యధతో ఆదివారం ఆత్మ హత్య చేసుకున్న వేముల రోహిత్ కు సోమవారం నాడు పోలీసులు దొంగ చాటుగా అంత్యక్రియల తంతు ముగించేశారు. ఒక శ్మశానవాటిక దగ్గరకు మృత దేహాన్ని తీసుకెళ్తున్నామని చెప్పి అక్కడికి కాకుండా అంబర్ పేట శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు కానిచ్చేశారు. పోలీసులు తప్పుదారి పట్టించినందువల్ల ఆయన మిత్రులెవరూ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. రానివ్వ కూడదనే పోలీసులు ఇంత పకడ్బందీగా తప్పుడు సమాచారం […]
రోహిత్ ఆత్మ హత్య చేసుకున్న తర్వాత హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో నిరసన తెలియజేసిన విద్యార్థులను పోలీసులు కిరాతకంగా చితకబాది రోహిత్ మృత దేహాన్ని తరలించుకు పోయారు.
రోహిత్ మిత్రుడు పడవల చిట్టిబాబు ఎలాగో అంత్యక్రియల ఫొటోలు సంపాదించి ఫేస్ బుక్ లో ఉంచారు.
బతికున్నంత కాలం, ముఖ్యంగా విశ్వవిద్యాలయంలో గౌరవానికి నోచుకోని దళిత విద్యార్థి రోహిత్ కు కనీసం అంతిమయాత్ర అయినా గౌరవప్రదంగా జరగకుండా చేసి పోలీసులు బ్రాహ్మణాధిపత్య ధోరణి ప్రదర్శించే విశ్వవిద్యాలయ అధికారులకన్నా తాము ఏ మాత్రం తీసిపోలేదని నిరూపించుకున్నారు.
అంత్యక్రియలకు అతని మిత్రులు, తోటి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరైతే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని విశ్వవిద్యాలయ అధికారులు, పోలీసులు, సంఘ్ పరివార్ పెద్దలు భావించి ఉండవచ్చు. కాని నిర్దయగా రోహిత్ను, మరో నలుగురిని హాస్టల్ నుంచి బహిష్కరించకుండా కనీస మానవత్వాన్ని ప్రదర్శించి, బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఉంటే శాంతి భద్రతలకు భంగం కలగడానికి అవకాశమే ఉండేది కాదు.
సాధారణంగా సంఘ్ పరివార్ వారు అనాథ ప్రేతాలకు అంతిమ సంస్కారాలు చేసి తమ “సంస్కారం” గొప్పదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. మరి రోహిత్ విషయంలో ఆ సంస్కారం ఎందుకు పని చేయలేదు. మరణించిన తర్వాత కూడా రోహిత్ అంటే అంత భయమెందుకో!
ఆత్మ హత్య చేసుకోవడం ద్వారా రోహిత్ లో అనిర్వచనీయమైన పిరికితనం ఉంటే ఉండొచ్చు. కాని సజీవంగా ఉన్నప్పుడు అతని వీరోచిత ప్రవర్తన, మరణంతో సిద్ధించిన అమరత్వం, అతడు అనుభవించిన కుల వివక్ష, కడకు ఆత్మత్యాగం మొదలైనవి బ్రాహ్మాణీకాన్ని అమలు చేయాలని ప్రయత్నించిన వారిని వెన్నాడుతూనే ఉంటాయి. సకల విధాల వివక్షను వ్యతిరేకించే వర్గాలకు రోహిత్ చితిమంటలు స్ఫూర్తి కలిగిస్తూనే ఉంటాయి.
-ఆర్వీ రామారావ్