స్కూల్లో నిలబడితే...జీవితంలో నిలబడతారు..!
పిల్లలు స్కూళ్లలో నిద్రపోతున్నపుడో, స్కూలుకి ఆలస్యంగా వచ్చినపుడో లేదా హోంవర్కు చేయనపుడో టీచర్లు ఆ పీరియడ్ మొత్తం నిలబడమని శిక్ష విధిస్తుంటారు. అయితే ఒక నూతన అధ్యయనం చెబుతున్నదాన్ని బట్టి అది శిక్షకాదు, మంచి శిక్షణకు దారిలా కనబడుతోంది. స్కూళ్లలో కూర్చునే సీట్లకు బదులుగా నిలబడి పాఠాలు చదువుకునేందుకు వీలుగా స్టాండింగ్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తే పిల్లలో తెలివితేటలు మరింతగా పెరుగుతాయని టెక్సాస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రంజనా మెహతా అంటున్నారు. భారతీయ సంతతికి చెందిన రంజనా […]
పిల్లలు స్కూళ్లలో నిద్రపోతున్నపుడో, స్కూలుకి ఆలస్యంగా వచ్చినపుడో లేదా హోంవర్కు చేయనపుడో టీచర్లు ఆ పీరియడ్ మొత్తం నిలబడమని శిక్ష విధిస్తుంటారు. అయితే ఒక నూతన అధ్యయనం చెబుతున్నదాన్ని బట్టి అది శిక్షకాదు, మంచి శిక్షణకు దారిలా కనబడుతోంది. స్కూళ్లలో కూర్చునే సీట్లకు బదులుగా నిలబడి పాఠాలు చదువుకునేందుకు వీలుగా స్టాండింగ్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తే పిల్లలో తెలివితేటలు మరింతగా పెరుగుతాయని టెక్సాస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రంజనా మెహతా అంటున్నారు. భారతీయ సంతతికి చెందిన రంజనా టెక్సాస్‌లోని హెల్త్ సైన్స్ సెంటర్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో పనిచేస్తున్నారు.
తరగతి గదిలో నిలబడి చదువుకునే విద్యార్థులపై ఆమె అధ్యయనం నిర్వహించారు. హైస్కూలు చదువుతున్న విద్యార్థులకు ఒక సంవత్సరం పాటు స్టాండింగ్ డెస్క్‌లను ఏర్పాటు చేసి అధ్యయనం చేశారు. సంవత్సరంలో నాలుగుసార్లు కంప్యూటర్ల ద్వారా నిర్వహించిన పరీక్షల్లో వారిలో నిర్వహణా సామర్థ్యం, పనితీరు క్రమంగా అభివృద్ధి చెందినట్టుగా గుర్తించారు. విద్యాపరమైన నైపుణ్యాలు, టైమ్ మేనేజ్‌మెంట్, జ్ఞాపకశక్తి, క్లాసులో పాఠాలు అర్థం చేసుకునే శక్తి ఇవన్నీ పిల్లల్లో ఇనుమడించినట్టుగా ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఈ పనులను నిర్వహించే మెదడు ముందుభాగం, నిలబడి నేర్చుకుంటున్నపుడు మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని విద్యార్థుల తలలకు అమర్చిన బయో సెన్సార్ల వలన తేలింది. పిల్లలో శక్తి వినియోగం, ప్రవర్తన కూడా మెరుగుపడినట్టుగా గుర్తించారు.
స్టాండింగ్ డెస్క్‌లకు, విద్యార్థుల తెలివితేటలకు మధ్య ఉన్న అనుబంధాన్ని గురించి నిర్వహించిన ఈ అధ్యయనంలో పిల్లలు ఎంతసమయం కదలకుండా కూర్చుంటున్నారు అనే విషయం మీద కూడా దృష్టి పెట్టారు. మొత్తానికి ఈ అధ్యయనాలను కొనసాగించడం ద్వారా ప్రజారోగ్య నిపుణులు తీసుకునే నిర్ణయాలకు, స్కూళ్ల నిర్వాహకులు మార్చుకోవాల్సిన విధానాలకు చక్కని మార్గ దర్శకాలు లభిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.