ఒక్క అతిథి... లక్షల ప్రాణుల గృహప్రవేశం !
ఒక మనిషి ఇంట్లోకి వస్తే అతనితో పాటు లక్షల కొద్దీ బ్యాక్టీరియా మన ఇంట్లోకి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇవన్నీ మనకు మేలే చేస్తాయని, మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయని వారు చెబుతున్నారు. ఇంట్లోకి కొత్తగా వచ్చే ప్రతి అతిధి నుండి ఒక్క గంటలో 3కోట్ల80లక్షల బ్యాక్టీరియా కణాలు మన నివాసంలోకి ప్రవేశిస్తుంటాయని వారు చెబుతున్నారు. మన ఇంటికి వచ్చిన ఒక గెస్ట్ తాను ముక్కుమూసుకుని విడిచేగాలిని ఆపి ఉంచినా, గంటకు ఒక కోటి బ్యాక్టీరియా […]
ఒక మనిషి ఇంట్లోకి వస్తే అతనితో పాటు లక్షల కొద్దీ బ్యాక్టీరియా మన ఇంట్లోకి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇవన్నీ మనకు మేలే చేస్తాయని, మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయని వారు చెబుతున్నారు. ఇంట్లోకి కొత్తగా వచ్చే ప్రతి అతిధి నుండి ఒక్క గంటలో 3కోట్ల80లక్షల బ్యాక్టీరియా కణాలు మన నివాసంలోకి ప్రవేశిస్తుంటాయని వారు చెబుతున్నారు. మన ఇంటికి వచ్చిన ఒక గెస్ట్ తాను ముక్కుమూసుకుని విడిచేగాలిని ఆపి ఉంచినా, గంటకు ఒక కోటి బ్యాక్టీరియా కణాలను తన చర్మం ద్వారా విడుదల చేస్తాడని చికాగో యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉన్న జాక్ ఎ గిల్‌బర్ట్ చెబుతున్నారు. ఇంకా ఈ విషయంపై ఆయన చెబుతున్న ఆసక్తికరమైన విషయాలు ఇవీ-
- మన స్నేహితులు, అతిథులు, కుటుంబ సభ్యులు వీరందరి ద్వారా మనకు చేరే బ్యాక్టీరియా అంతా చెడ్డదేం కాదు, అది మనకు ఎన్నో విధానాలుగా మేలు చేసేదే.
- శుచి శుభ్రతల పేరుతో నివసిస్తున్న పరిసరాలను ఎప్పుడూ రసాయనాలతో శుభ్రం చేసుకుంటున్న మనం మన పూర్వీకుల కంటే బలహీనంగా మారిపోతున్నాం. మన పూర్వీకులంతా వ్యవసాయం మీద ఆధారపడి నివసించేవారు. చెట్టుచేమలతో కలిసి జీవించేవారు. వాతావరణంలోని బ్యాక్టీరియా, మార్పులు అన్నింటిని భరిస్తూ, వాటిని ఎదుర్కొనే శక్తిని పెంచుకునేవారు.
- మన పూర్వీకులు ఎప్పుడూ పలురకాల బ్యాక్టీరియాతో కలిసి ఉండడం వలన వారి శరీరాలు వాటిని తట్టుకునేందుకు సిద్ధంగా ఉండేవి. మనం మాత్రం ఎప్పుడూ బ్యాక్టీరియా నుండి సురక్షితంగా ఉండాలనుకోవడం వలన, వాటిని ఎదుర్కొనాల్సిన పరిస్థితి వస్తే మన శరీరం అందుకు సహకరించడం లేదు. అందుకే పలురకాల జ్వరాలు, ఎలర్జీలు, ఆస్తమా లాంటి అనారోగ్యాలు తరచుగా మనల్ని వెంటాడుతున్నాయి.
- తరచుగా చేతులు కడుక్కునే అలవాటు మనల్ని జలుబు జ్వరాల నుండి కాపాడినా, ఆ మేరకు రోగనిరోధక శక్తిని తగ్గిస్తోంది. చెడు బ్యాక్టీరియాని దూరంగా ఉంచడంలో మనం విజయం సాధిస్తున్నా, మనకు ఆరోగ్యాన్నిచ్చే బ్యాక్టీరియాని పొందడంలో విఫలమవుతున్నాం.
- నాలుగుగోడల మధ్య గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాల కారణంగా మనకు ఈ నష్టం మరింతగా జరుగుతోంది. అందుకే ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, రోగనిరోధక శక్తి పెరగాలంటే స్నేహితులు, సన్నిహితులను ఇంటికి పిలవండి, వారితో పాటు ఇంట్లోకి వచ్చే మంచి బ్యాక్టీరియాని పొందండి.
- అలాగే చంటి పిల్లలను ఇన్‌ఫెక్షన్లు వస్తాయనే భయంతో ఇంట్లోనే ఉంచకుండా పలురకాల జంతుజాలానికి సమీపంలోకి తీసుకువెళ్లాలి. ఇది వారి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఒకవేళ హానికరమైన బ్యాక్టీరియా ఎటాక్ చేసినా దాన్ని వారు చాలా తేలిగ్గా అధిగమిస్తారు.
- అలాగే షేక్ హ్యాండ్, ఆలింగనం, ముద్దుపెట్టుకోవడం…లాంటి సంప్రదాయాలు మనుషులకు మేలే చేస్తాయి. ఇవన్నీ మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముద్దు ద్వారా సంక్రమించే బ్యాక్టీరియాతో జీర్ణశక్తి పెరుగుతుంది. తెలివితేటలు కూడా పెరుగుతాయి.
- సూక్ష్మజీవులు అనేవి మనం ఊహించలేనంత వేగంగా వ్యాప్తి చెందుతాయి. వాటిని తొలగించడం అనేది మనవల్ల కాని పని.అందుకే అతిథులు వచ్చి వెళ్లాక ఇంటిని అదేపనిగా శుభ్రం చేయాలని చూడటం అనవసరం.
ఇంకేం…జాక్ ఎ గిల్‌బర్ట్ వెల్లడించిన ఈ విషయాలను బట్టి చూస్తే ఇకపై అతిథులను మనం మరింత ఆనందంగా ఆహ్వానించాల్సిందే. పెద్దవాళ్లు అతిథి దేవోభవ… అనడంలో ఈ ఉద్దేశ్యం కూడా ఉందేమో కదా!