పండితుల సలహా- ఐటీని తాకొద్దు !
ఒక్కోసారి భారీ అంచనాలు కూడా భారాన్ని రెట్టింపు చేస్తాయి. ఇప్పుడు ఏపీలో ఐటీ రంగం విషయంలో చంద్రబాబు పరిస్థితి ఇలాగే తయారైంది. హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని నిలబెట్టింది చంద్రబాబే అన్న ప్రచారం ఇప్పుడు ఆయనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 18 నెలలు అవుతున్నా ఏపీలో మాత్రం ఐటీ ఊసు కనిపించడం లేదు. నెపాన్ని ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై నెడుతూ ముందుకు సాగుతున్నా ఆ సాకు మరెన్నో రోజులు పనిచేయదంటున్నారు. నిజంగా పల్లె ఫెయిల్ అవుతుంటే మరొకరిని […]
ఒక్కోసారి భారీ అంచనాలు కూడా భారాన్ని రెట్టింపు చేస్తాయి. ఇప్పుడు ఏపీలో ఐటీ రంగం విషయంలో చంద్రబాబు పరిస్థితి ఇలాగే తయారైంది. హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని నిలబెట్టింది చంద్రబాబే అన్న ప్రచారం ఇప్పుడు ఆయనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 18 నెలలు అవుతున్నా ఏపీలో మాత్రం ఐటీ ఊసు కనిపించడం లేదు. నెపాన్ని ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై నెడుతూ ముందుకు సాగుతున్నా ఆ సాకు మరెన్నో రోజులు పనిచేయదంటున్నారు. నిజంగా పల్లె ఫెయిల్ అవుతుంటే మరొకరిని ఐటీ మంత్రిగా నియమించాలని పలువురు సూచిస్తున్నారు. అందులో చాలా మంది టీడీపీ నేతలు చినబాబు లోకేష్ పేరును ప్రతిపాదిస్తున్నారు.
తెలంగాణలో ఐటీ మంత్రిగా కేటీఆర్ దూసుకుపోతున్నారని ఆయనకు లోకేష్‌బాబే సరైన పోటీదారు అంటున్నారు. లోకేష్ ఐటీ మంత్రి అయితే చాలా కంపెనీలు క్యూ కడుతాయని అభిప్రాయపడుతున్నారు. అయితే లోకేష్‌కు ఐటీ బాధ్యతలు అప్పగించేందుకు అగ్రనాయకత్వం సుముఖంగా లేదని సమాచారం. అందుకు లాజిక్ కూడా చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో ఇంకా ఒక ఇటుక కూడా పేర్చలేదు. మౌలిక సదుపాయాలు సిద్ధం కాలేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. ఈ దశలో లోకేష్‌ను ఐటీ మంత్రిగా చేస్తే ప్రస్తుతం పల్లె రఘునాథరెడ్డి మోస్తున్న నిందను చినబాబు మోయాల్సి వస్తుందని పండిపోయిన రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. వ్యక్తులను చూసే ఐటీ కంపెనీలు వచ్చే పరిస్థితే ఉంటే ఐటీ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ముఖాన్ని చూసే ఐటీ కంపెనీలు పరుగులు తీస్తూ రావాలి కదా అని లాజిక్ మాట్లాడుతున్నారు.
చంద్రబాబును చూసి ఐటీ కంపెనీలు వస్తాయనుకున్నామే గానీ ఏనాడు మంత్రి పల్లెపై అంచనాలు పెట్టుకోలేదు కదా అని ప్రశ్నించుకుంటున్నారు. మొత్తం మీద లోకేష్ బాబుపై భారీ అంచనాలు పెట్టుకున్న వారు ఆయనను ఐటీ మంత్రిని చేయాలంటుండగా… పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన రాజకీయ పండితులు మాత్రం అలా చేస్తే చినబాబుకు ఆరంభంలోనే ఇమేజ్ డామేజ్ ఖాయమంటున్నారు. రాజకీయాల్లో లోకేష్ ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు నడిపించాలని సూచిస్తున్నారు.