నిర్భయకేసు... నేరస్తుడిని క్షమించేసిన సొంత ఊరు
నిర్భయ కేసులో బాలనేరస్తుడిని అతని సొంత ఊరు క్షమించింది. నిర్భయ ఘటన జరిగినపుడు అతను మైనర్ కనుక అతడిని మూడేళ్లకంటే ఎక్కువగా నిర్బంధంలో ఉంచాల్సిన పనిలేదని చట్టాలు చెబుతున్నాయి. దాంతో ఢిల్లీ హైకోర్టు తీర్పు మేరకు ఈ రోజే అతడిని విడుదల చేయాల్సి ఉంది.. ఆ విడుదలను ఆపాలంటూ ఢిల్లీ మహిళా కమిషన్ వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఢిల్లీ ప్రభుత్వంలోని మహిళలు బాలల సంక్షేమ శాఖ అతనికి కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు అన్నీ […]
నిర్భయ కేసులో బాలనేరస్తుడిని అతని సొంత ఊరు క్షమించింది. నిర్భయ ఘటన జరిగినపుడు అతను మైనర్ కనుక అతడిని మూడేళ్లకంటే ఎక్కువగా నిర్బంధంలో ఉంచాల్సిన పనిలేదని చట్టాలు చెబుతున్నాయి. దాంతో ఢిల్లీ హైకోర్టు తీర్పు మేరకు ఈ రోజే అతడిని విడుదల చేయాల్సి ఉంది.. ఆ విడుదలను ఆపాలంటూ ఢిల్లీ మహిళా కమిషన్ వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఢిల్లీ ప్రభుత్వంలోని మహిళలు బాలల సంక్షేమ శాఖ అతనికి కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేస్తోంది. బాల నేరస్తుడు ఒక టైలరింగ్ షాపుని పెట్టుకునేందుకు పదివేల రూపాయిల సహాయం అందుతుంది. నెలవారీ అద్దెతో అతనికి షాపుని సైతం ప్రభుత్వమే ఇప్పిస్తుంది. అతని పాత జీవితం తాలూకూ గుర్తులు లేకుండా అతనికి ఒక కొత్త పేరు, గుర్తింపు ఇచ్చేందుకు, బాలనేరస్తుల పునరావాసం పథకం ప్రకారం ఇవన్నీ ప్రభుత్వమే సమకూరుస్తున్నది. ఒక ఆడపిల్ల పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించిన అతనికి పడుతున్న శిక్ష…స్వేచ్ఛగా వదిలేయడం, ప్రభుత్వమే జీవన భృతిని చూపించడమూనా అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిర్భయ తల్లిదండ్రులు సైతం అతని విడుదలపై తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతున్నారు.
ఈ క్రమంలో బాలనేరస్తుని గ్రామస్తులు ఆ అబ్బాయిని చెడగొట్టింది ఢిల్లీ నగరవాసులే అంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని బాదౌన్ జిల్లా అతనిది. అతను ఇక్కడ ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు ఢిల్లీకి వెళ్లడం వల్లనే అలా తయారయ్యాడని మాజీ గ్రామాధికారి, 60 ఏళ్ల నాథూ రామ్ అంటున్నాడు. తను ఇక్కడికి వచ్చి మాతో కలిసి బతుకుతానంటే మాకేమీ అభ్యంతరం లేదని చెప్పాడు. చాలా చిన్నతనంలోనే ఊరు వదిలి వెళ్లి పోవడం వల్లనే అలా తయారయ్యాడని, చిన్నప్పుడు తోటి పిల్లలతో కూడా గొడవ పెట్టుకునేవాడుకాదని గ్రామస్తుల్లో కొందరు అంటున్నారు.
ఈ నేరస్తుడి తండ్రికి మతి స్థిమితం లేదు, తల్లికి ఆరోగ్యం సరిగ్గా లేదు. పదేళ్ల లోపు తమ్ముళ్లు ఇద్దరు ఉన్నారు. తినడానికి తిండికూడాలేని దుర్భరమైన పేదరికాన్ని అనుభవిస్తున్నారు. కొడుకు వచ్చి తమని ఆదుకోవాలని ఆమె కోరుకుంటోంది.
నిర్భయ ఘటన వెనుక అవిద్య, పేదరికం, పల్లెల్లు నిర్జీవం కావడం, నగరాల్లో మురికివాడలు, ఏరులై పారుతున్న మద్యం, అశ్లీల సినిమాలు, మహిళల పట్ల చులకనా భావం…ఇవన్నీ.. తయారుచేసిన వాతావరణం ఉంది. ఆ వాతావరణాన్ని ఛేదించే ప్రయత్నాలు చేయకుండా శిక్షలు, పునరావాసాలు మనుషుల్లో మార్పులు తీసుకురావన్న సంగతి అందరికీ తెలిసిందే.