అద్దం... ఆ విషయానికీ అద్దం పడుతుంది !
అద్దం అబద్దం చెప్పదు… అనేది ఒక నానుడి. అందుకే ఎవరినైనా విమర్శించాల్సిన సందర్భంలో, నీ మొహం అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా…అనే మాటని వాడుతుంటారు చాలామంది. సరే ఇప్పుడు విషయానికి వస్తే, అద్దం మన అందం విషయంలోనే కాదు ఆహారం విషయంలోనూ అబద్దం చెప్పదంటున్నారు పరిశోధకులు. ఏ ఫుడ్ మన ఆరోగ్యానికి మంచిది, ఏది మంచిది కాదు అనే నిజానిజాలను ఇది తేల్చి చెబుతుందట. అనారోగ్యమని తెలిసినా జంక్‌ఫుడ్ అనగానే పడి చచ్చిపోయేవారు, అదే ఫుడ్‌ని అద్దంలో చూస్తే, […]
అద్దం అబద్దం చెప్పదు… అనేది ఒక నానుడి. అందుకే ఎవరినైనా విమర్శించాల్సిన సందర్భంలో, నీ మొహం అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా…అనే మాటని వాడుతుంటారు చాలామంది. సరే ఇప్పుడు విషయానికి వస్తే, అద్దం మన అందం విషయంలోనే కాదు ఆహారం విషయంలోనూ అబద్దం చెప్పదంటున్నారు పరిశోధకులు. ఏ ఫుడ్ మన ఆరోగ్యానికి మంచిది, ఏది మంచిది కాదు అనే నిజానిజాలను ఇది తేల్చి చెబుతుందట. అనారోగ్యమని తెలిసినా జంక్‌ఫుడ్ అనగానే పడి చచ్చిపోయేవారు, అదే ఫుడ్‌ని అద్దంలో చూస్తే, అది వారికి అంత రుచికరంగా అనిపించదని ఒక అధ్యయనంలో తేలింది.
జంక్‌ఫుడ్, ఇంకా అనారోగ్యాలు కలిగించే ఆహారాన్ని చూసినపుడు అవి చాలా రుచిగా ఉంటాయనే భావన కలగటం వల్లనే తినడం జరుగుతుంది. తరువాత అనారోగ్యాలు, అధికబరువు తప్పవు. ఆహార రుచులకు సంబంధించి నిర్వహించిన ఒక అధ్యయనంలో 185మంది విద్యార్థులకు చాక్‌లేట్ కేక్, ఫ్రూట్ సలాడ్ చూపించి వాటి రుచి గురించి ప్రశ్నించారు. అయితే ఒకసారి చుట్టూ అద్దాలు ఉన్న గదిలో, మరొకసారి అద్దాలు లేని గదిలో పదార్థాలు ఉంచి వారిని ప్రశ్నించారు. అద్దాలు లేని గదిలో చాక్‌లెట్ కేక్‌ని చూపించినపుడు అది చాలా రుచికరమైన పదార్థంగా వారి కంటికి కనిపించింది, అనిపించింది. అదే అద్దాలు ఉన్న గదిలో చూపించినపుడు, అది అంత రుచిగా ఉందని తాము అనుకోవడం లేదని విద్యార్థులు చెప్పారు. అయితే ప్రూట్ సలాడ్ విషయంలో ఇలాంటి తేడా కనిపించలేదు.
అద్దం మన భౌతిక రూపం కంటే ఎక్కువే మన గురించి చెబుతుందని, అలాగే ఇతరులను కూడా అద్దంలో చూసి మరికాస్త ఎక్కువగా అంచనా చేయవచ్చని, ఇదే ఫుడ్‌కి కూడా వర్తించిందని ఈ అధ్యయనంలో ప్రధాన పాత్ర పోషించిన పరిశోధకుడు ఆటా జామీ అంటున్నారు. సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్శిటీలో దీన్ని నిర్వహించారు.
అద్దం మన బాడీ లాంగ్వేజ్‌ని, ప్రవర్తనని, రూపాన్ని సరిచేసుకునేందుకే కాక, సరైన ఆహారాన్ని సైతం ఎంపిక చేసుకునేందుకు ఉపయోగపడటం మంచి విషయమే. ఇక నుండి డ్రెస్సింగ్ రూములోనే కాదు, డైనింగ్ హాల్లోనూ అద్దాలు పెట్టుకోవాలన్నమాట.