విశ్వవ్యాప్త నిరసనల మధ్య జపాన్ తో అణు ఒప్పందం
జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే మూడు రోజుల భారత పర్యటన సందర్భంగా బుల్లెట్ రైలు, రక్షణ సాంకేతికత, అణు శక్తి రంగంలో సహకారానికి రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ముంబై-అహమదాబాద్ మధ్య అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైలుకు మార్గం సుగమం అవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రైలు కోసం జపాన్ 12 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. శాంతియుత ప్రయోజనాలకు అణుశక్తి వినియోగానికి రెండు దేశాలు […]
శాంతియుత ప్రయోజనాలకు అణుశక్తి వినియోగానికి రెండు దేశాలు అవగానా పత్రంపై సంతకాలు చేశాయి. అయితే ఈ ఒప్పందం పట్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయనందువల్ల ఇంత కాలం భారత్ తో అణుశక్తి రంగంలో సహకారానికి నిరాకరించింది.
షింజో అబే పర్యటన సందర్బంగా అణుశక్తి రంగంలో ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నందువల్ల శుక్రవారం నాడు అనేక దేశాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో అణు కేంద్రాన్ని నెలకొల్పాలన్న ప్రతిపాదనను వ్యతిరేకెస్తున్న స్థానికులు కూడా జపాన్ తో అణు ఒప్పందానికి నిరసన వ్యక్తం చేశార్. యూపీఏ హయంలో అమెరికాతో అణు ఒప్పందం కుదిరినప్పుడు కూడా ఇలాగే నిరసన వ్యక్తం అయింది. జైతాపూర్, దిల్లీలోని జంతర్ మంతర్, బెంగుళూరు, నాగపూర్, చెన్నై, కోల్ కతా, లండన్, న్యూయార్క్ లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
అమెరికా, ఫ్రాన్స్ లోని అణు కేంద్రాలు జపాన్ నుంచి కీలక అణు పరికరాలు అందకపోతే ముందుకు సాగవు కనక భారత్ తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఆ దేశాలు జపాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. ఫుకుషిమాలో అణు ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ పరిస్థితి ఇప్పటికీ దారుణంగానే ఉంది. అణు ధార్మిక శక్తి ప్రభావం తీవ్రంగా ఉంది. ఫుకుషిమా ప్రమాదం తర్వాత జపాన్ లోని అణు కార్పొరేషన్ల వ్యాపారం మందకొడిగా తయారైంది. ఆ కార్పొరేషన్లను ఆదుకోవడానికే జపాన్ ప్రధాని భారత్ తో అణు ఒప్పందం కుదుర్చుకుంటున్నారన్న ఆరోపణలు జపాన్ లో గట్టిగా వినిపిస్తున్నాయి. జపాన్ లోని అణు కార్పొరేషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారు కూడా ఈ ఒప్పందాన్ని నిరసిస్తున్నారు. ఫుకుషిమా ప్రమాదం తర్వాత ఈ కార్పొరేషన్ల దృష్టి భారత్ మీదకు మళ్లింది.
అణు ప్రమాదాలను నివారించడానికి భారత్ లో స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ ఏదీ లేదు. ఫుకుషిమా ప్రమాదం తర్వాత భారత్ లోని అణు కేంద్రాల భద్రతపై ఎలాంటి తనిఖీ జరగలేదు. ప్రమాదం జరిగితే అణు సామాగ్రి సరఫరా చేసిన వారి మీద ఉండే బాధ్యతను మోదీ ప్రభుత్వం మరింత నీరుగార్చింది. ప్రమాదకరమైన అణు సాంకేతికు భారత్ ను నిలయంగా మారుస్తున్నారని అనేక మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్-జపాన్ దేశాల మధ్య సంబంధాలు బలపడడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. కాని ప్రమాదకరమైన అణు సాంకేతికను వినియోగించుకోవడంలో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరడం వల్ల ఈ ప్రమాద ప్రభావం ఖండాంతరాలకు విస్తరిస్తుంది.
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీకి, అబేకు మధ్య సఖ్యత మరింత పెరిగింది. చైనా ఆధిపత్యాన్ని నిలవరించడానికి రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
– ఆర్వీ రామారావ్