మాంత్రికుడు భూతాన్ని సీసాలోకి దించి బిరడా బిగించినట్టు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రవాదాన్ని, ఇస్లాం మతాన్ని సమానార్థకాలుగా మార్చేశారు. నవంబర్ 13న పారిస్ లో తీవ్రవాదుల దాడి, దిసెంబర్ రెండున కాలిఫోర్నియాలోని సాన్ బెర్నార్డినోలో తీవ్రవాదుల దాడి తర్వాత ఒబామా తీవ్రవాదాన్ని, ఇస్లాం మతాన్ని ఒకే గాట కట్టడం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. అంతకు ముందు ఒబామా ఇంత స్పష్టంగా తీవ్రవాదులందరూ ముస్లింలే అనే ధోరణిలో మాట్లాడిన సందర్భాలు అరుదు.
కాలిఫోర్నియా దాడుల నేపథ్యంలో ఆదివారంనాడు ఒబామా దేశప్రజలకు ఇచ్చిన సందేశంలో తీవ్రవాదులందరూ ముస్లింలే అన్న ధోరణిలో మాట్లాడారు. “ముస్లింలు అందరూ తీవ్రవాదులు కారు, కాని తీవ్రవాదులందరూ ముస్లింలే”అని ప్రబలంగా వినిపిస్తున్న వాదనకు నెల రోజుల వ్యవధిలో ఒబామా వ్యక్తం చేసిన అభిప్రాయాలకు సన్నిహిత సంబంధం ఉంది. 2009లో ఫోర్ట్ హూడ్ లో జరిగిన దాడికి, ఈ ఏడాది ఆరంభంలో చట్టనూగాలో జరిగిన దాడికి, కాలిఫోర్నియాలో జరిగిన దాడికి సామ్యం ఉందని ఒబామా అన్నారు. కాలిఫోర్నియాలో దాడి చేసిన తీవ్రవాదులు విదేశీ గడ్డ మీంచి అందిన ఆదేశాలకు అనుగుణంగా దాడి చేశారనడానికి ఇంతవరకు ఆధారాలు లేవని ఒబామా చెప్పినా కాలిఫోర్నియాలో దాడికి దిగిన జంట తీవ్రవాదులేనని, వారు వికృతీకృత ఇస్లాంను అనుసరించే వారని ఒబామా తేల్చేశారు. ఈ రకమైన తీవ్రవాదం అమెరికా మీద, పశ్చిమ దేశాల మీద యుద్ధం ప్రకటిస్తోందని చెప్పారు. వారి దగ్గర అధునాతన ఆయుధాలు, పైప్ బాంబులు ఉన్నాయి. అందువల్ల వారు తీవ్రవాదులే అని ఒబామా చెప్పారు.
9/11 నాటి దాడిలో 3000 మంది అమెరికా వాసులను అల్ ఖాయదా పొట్టన పెట్టుకున్నప్పటి నుంచి అమెరికా తీవ్రవాదం మీద యుద్ధం కొనసాగిస్తోందని ఒబామా తెలియజేశారు. “ఐ ఎస్ ఐ ఎస్ తీవ్రవాదులకు ఇస్లాం తరఫున మాట్లాడే హక్కు లేదు, వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 100 కోట్ల మంది ముస్లింలలో చిన్న భాగం మాత్రమే” అంటూనే “ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాద బాధితులందరూ ముస్లింలే” అని గుర్తు చేస్తూనే ముస్లింలే తీవ్రవాదులు అన్న తన మనసులో మాట ఒబామా స్పష్టంగానే చెప్పారు..
కాలిఫోర్నియాలో కాల్పులకు తెగబడింది పాకిస్తాన్ జాతీయుడైన అమెరికా పౌరుడు సయ్యద్ రిజ్వాన్ ఫారూఖ్, ఆయన భార్య తష్ఫీన్ మాలిక్. ఆమె అమెరికా పౌరురాలు కాదు కాని చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తున్న పాకిస్తానీ మహిళ. తీవ్రవాదాన్ని తుదముట్టించాలన్న ఒబామా సంకల్పాన్ని తప్పుబట్టలేం. కాని తీవ్రవాదం మీద దాడి చేయడానికి పాకిస్తాన్ అనే పిల్లిని చంకన పెట్టుకుని బయలుదేరారు. సరిహద్దు ఆవలి నుంచి భారత్ మీదికి పాకిస్తాన్ తీవ్రవాదులను ఉసిగొల్పుతున్నారన్న వాస్తవాన్ని ఒబామా, అంతకు ముందున్న అమెరికా అధ్యక్షులెవరూ అంగీకరించలేదు. అఫ్గానిస్తాన్ లో తాలిబన్లను ఏరివేసేటప్పుడు సైతం అమెరికా పాకిస్తాన్ తీవ్రవాదానికి నెలవుగా ఉందన్న వాస్తవాన్ని గుర్తించడానికి నిరాకరించింది. ఒసామా బిన్ లాదెన్ ఏ కలుగులో దాగి ఉన్నా అంతమొందిస్తామన్న మాటను అమెరికా నిలబెట్టుకున్న మాట వాస్తవమే కాని లాదెన్ కు ఆశ్రయమిచ్చిన పాకిస్తాన్ పాలకులను పల్లెత్తు మాట అనలేదు. తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకోసం పాకిస్తాన్ కు అమెరికా అండదండలందిస్తున్నంతకాలం తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామని అమెరికా చేసే గంభీర ప్రకటనల్లోని డొల్లతనం బయటపడుతూనే ఉంటుంది. తీవ్రవాద మూలాలు ముస్లిం దేశాలలో నిరంకుశ సైనిక ప్రభుత్వాలకు అమెరికా ఇస్తున్న మద్దతులో ఉన్నాయి తప్ప ఇస్లాం మతంలో లేవు.
-అనన్య