చెన్నై వర్ష విలయంలో... స్వయంకృతాపరాధమెంత?
లండన్లో వరదలను అడ్డుకునేందుకు నిట్టనిలువు గోడపై చెట్లు! చెన్నైలో వర్షాలు నేలని నదులుగా మార్చేసి, విలయం సృష్టించాక ఇప్పుడు దేశంలో ఏ నగరాలు ఎంతవరకు వర్షాలు, వరదలను తట్టుకుంటాయి అనే సందేహం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. మన ప్రధాని, భవిష్యత్తులో రూపుదిద్దుకోనున్న 100 స్మార్ట్ సిటీల లిస్టుని ఘనంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత ప్రాధాన్యత పెరిగింది. నేలమీద వానలు, వరదల నీటి నిర్వహణ, డ్రైనేజి వ్యవస్థలను చక్కబెట్టుకోలేకపోతున్న ఈ తరుణంలో ఆకాశ హర్మ్యాలకు […]
లండన్లో వరదలను అడ్డుకునేందుకు నిట్టనిలువు గోడపై చెట్లు!
చెన్నైలో వర్షాలు నేలని నదులుగా మార్చేసి, విలయం సృష్టించాక ఇప్పుడు దేశంలో ఏ నగరాలు ఎంతవరకు వర్షాలు, వరదలను తట్టుకుంటాయి అనే సందేహం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. మన ప్రధాని, భవిష్యత్తులో రూపుదిద్దుకోనున్న 100 స్మార్ట్ సిటీల లిస్టుని ఘనంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత ప్రాధాన్యత పెరిగింది. నేలమీద వానలు, వరదల నీటి నిర్వహణ, డ్రైనేజి వ్యవస్థలను చక్కబెట్టుకోలేకపోతున్న ఈ తరుణంలో ఆకాశ హర్మ్యాలకు ప్రణాళికలు వేసుకోవడంలో ఉన్న ఔచిత్యంపై విమర్శలూ వినబడుతున్నాయి.
ఇప్పటికే కాలవలు కాలనీలుగా మారిపోవడం, పట్టణాల రూపురేఖలను నిర్దేశించే ప్లానింగ్‌లో అవినీతి, అక్రమాలు, డెవలపర్ల భూ ఆక్రమణలు ఇవన్నీ కలిసి వర్షాలను తట్టుకునే వసతులను చేతులారా నాశనం చేసినట్టయిందని స్థానిక జనం వాపోతున్నారు. 2005లో ముంబయిలో ఒక్కరోజులో 944 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 500మంది చనిపోయారు. వరదలను తట్టుకునేందుకు కావలసిన చెట్లను నరుక్కుంటూ, కాంక్రీట్ జంగిల్స్‌ని నిర్మించుకుంటూ పోవడమే ఇందుకు కారణమని ఇంజినీరింగ్ నిపుణులు ఈ నష్టంపై చేసిన విశ్లేషణల్లో పేర్కొన్నారు.
మనదేశంలో జనాభా పెరిగిపోవడం, పట్టణాలు, నగరాలు విస్తరిస్తూ పోవడం, చెట్లను నరుక్కుంటూ పోవడం, సమగ్ర ప్రణాళికలు పాటించలేని వ్యవస్థలు, పెరుగుతున్న జనాభా, మారుతున్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని, వానలు వరదలను తట్టుకునే చర్యలను తీసుకోలేకపోవడం, ఇంకా వాననీటి స్టోరేజి పాయింట్లు లేకపోవడం, ఇళ్లు వాణిజ్య సముదాయాల డ్రేనేజి లైన్లను అక్రమంగా, వర్షాలు తుపాన్ల తాలూకూ నీటి పారుదల కాలువలకు అనుసంధానం చేయడం లేదా చెత్తని నేరుగా ఆ కాలువల్లో పోయడం…ఇవన్నీ చైన్నైలో వర్షాలు విలయంగా మారడానికి కారణమయ్యాయి.
బకింగ్ హాం ప్యాలస్ రోడ్డులో విక్టోరియా స్టేషన్ సమీపంలో రూబెన్స్ అనే ఫోర్ స్టార్ హోటల్‌కి ఒకవైపున నిట్టనిలువుగా ఉన్న గోడకు, 350 చదరపు మీటర్ల మేర, 21 మీటర్ల ఎత్తున చెట్లను నాటారు. పదివేల మొక్కలు, 16 టన్నుల మట్టితో అద్భుతం అనిపించే లివింగ్ వాల్‌ని నిర్మించారు. లండన్లో వరదల ఉధృతిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందని దీని రూపశిల్పులు చెబుతున్నారు. గ్రీన్ రూఫ్ కన్సల్టెన్సీకి సంబంధించిన గ్యారీ గ్రాంట్ దీన్ని రూపొందించారు.
రాయల్ హార్టికల్చర్ సొసైటీ వారి సలహాల మేరకు ఈ చెట్లను ఎంపిక చేశారు. నగరంలో అడవిని తలపింపచేస్తున్న ఈ గోడపై పలు పక్షులు, సీతాకోక చిలుకలు, తేనెటీగలు లాంటివి నివాసం ఏర్పరచుకున్నాయి. హోటల్ పైన కట్టిన నిర్మాణాల్లో వర్షపు నీరు నిలవుండి అదే ఆ లివింగ్ వాల్‌కి ఆధారంగా మారుతోంది. దీనివలన వరదల కారణంగా రోడ్లు జలమయం కాకుండా నివారించే అవకాశం ఉందని దీని డిజైనర్లు చెబుతున్నారు. లండన్లో ఈ తరహా గోడల్లో ఇదే పెద్దది. చిలవలు పలవలుగా పెరుగుతూ, మార్కెట్‌ని కమ్ముకుంటున్న టెక్నాలజీ కంటే ముందు, మానవ జీవితాన్ని సురక్షితం చేసే ఇలాంటి విధానాలను దిగుమతి చేసుకోవడం మరింత అవసరంగా గుర్తించి తీరాలి.
-వి.దుర్గాంబ