ముందు పాత లెక్కలు చెప్పండి

అమరావతి నిర్మాణం విషయంలో కేంద్రంపై కోటి ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రభుత్వానికి పెద్ద చిక్కు వచ్చిపడింది. రాజధాని నిర్మాణం కోసం తాము ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆలోచనతో దారి మళ్లించడంపై కేంద్రం గుర్రుగా ఉంది. ముందు లెక్కలు చెప్పండి… ఆ తర్వాతే మలివిడత సాయం అని తేల్చిచెప్పింది. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటి వరకు కేంద్రం రూ. 1850 కోట్లు మంజూరు చేసింది. తొలి విడతలో 1500 కోట్లు ఇచ్చిన కేంద్రం… వాటిలో వెయ్యి […]

Advertisement
Update:2015-12-05 01:02 IST

అమరావతి నిర్మాణం విషయంలో కేంద్రంపై కోటి ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రభుత్వానికి పెద్ద చిక్కు వచ్చిపడింది. రాజధాని నిర్మాణం కోసం తాము ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆలోచనతో దారి మళ్లించడంపై కేంద్రం గుర్రుగా ఉంది. ముందు లెక్కలు చెప్పండి… ఆ తర్వాతే మలివిడత సాయం అని తేల్చిచెప్పింది.

రాజధాని నిర్మాణం కోసం ఇప్పటి వరకు కేంద్రం రూ. 1850 కోట్లు మంజూరు చేసింది. తొలి విడతలో 1500 కోట్లు ఇచ్చిన కేంద్రం… వాటిలో వెయ్యి కోట్లు మౌలికసదుపాయాల కోసం, మరో 500 కోట్లు రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం నిర్మాణం కోసం వాడాలని సూచించింది. మూడు నెలల క్రితం మరో రూ. 350 కోట్లు మంజూరు చేసింది. అయితే కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఒక్క పైసా కూడా రాజధాని నిర్మాణం కోసం ఏపీ ఖర్చు చేయలేదని చెబుతున్నారు. ఇంకా రాజధాని నిర్మాణం మొదలుకాలేదన్న ఉద్దేశంతో నిధులను ఇతర అవసరాలకు మళ్లించారు. అయితే కేంద్రం ఇచ్చిన సొమ్ములో కొంతభాగాన్ని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వినియోగించినట్టు అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణం కోసం నిధులివ్వాలని మరోసారి వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఊహించని సమాధానం ఎదురైంది. ఇది వరకు ఇచ్చిన రూ. 1850 కోట్లు ఎలా ఖర్చుపెట్టారో చెప్పండి అని ప్రశ్నించింది. దీంతో అధికారులు నీళ్లు నమిలారు. ఆ నిధులు రాజధాని నిర్మాణంలో ఎలా ఖర్చు పెట్టారో రికార్డులతో సహా సమర్పించాలని కేంద్రం కోరింది. అలా వివరాలు అందజేస్తేనే మలివిడత సాయం చేయగమలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మళ్లించిన విషయం కేంద్రానికి తెలిసిపోవడం వల్లే ఇలా కొత్త కండిషన్‌ తెరపైకి తెచ్చిందని అధికారులు భావిస్తున్నారు. ఇకపై రాజధాని పేరుతో నిధులు తెచ్చుకోవాలంటే ముందుగా అమరావతిలో పనులు ప్రారంభించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News